
ముగిసిన 35 ఏళ్ల అజ్ఞాతం..డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు
లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని డీజీపీ పేర్కొన్నారు.
మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ (AOB) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న తన అనుచరులతో కలిసి సోమవారం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. సోమన్నతో పాటు మరో ఏడుగురు కీలక మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలిశారు. వీరి నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎవరీ చెల్లూరి నారాయణరావు?
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన నారాయణరావు, 1989-90 కాలంలో పీపుల్స్ వార్‌లో చేరి దాదాపు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఉద్దానం ప్రాంతం నుంచి వెళ్ళిన ఆయన, పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. గతేడాది ఎన్‌కౌంటర్‌లో గాజర్ల రవి, అరుణ వంటి అగ్రనేతలు మృతి చెందడంతో ఏవోబీ బాధ్యతలను సోమన్న చేపట్టారు. ఆయనపై ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో భారీ రివార్డులు ఉన్నాయి.
ఆపరేషన్ కగార్ ప్రభావం.. రేపటితో గడువు ముగింపు
భారత ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తోంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిస్థాయిలో అణచివేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు కారడవుల్లో జరిపిన పోరాటం మావోయిస్టులను ఆత్మరక్షణలో పడేసింది. గత ఏడాది తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో జరిగిన భారీ ఆపరేషన్ సహా అనేక పరిణామాలు పార్టీని బలహీనపరిచాయి. కేంద్రం విధించిన గడువు రేపటితో ముగియనుండగా, కీలక నేత లొంగిపోవడం గమనార్హం.
మారుతున్న పరిస్థితులే కారణం: సోమన్న
ఈ సందర్భంగా చెల్లూరి నారాయణరావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరుతున్నాయి. మావోయిస్టు ఉద్యమం క్రమంగా కనుమరుగయ్యే స్థితికి వచ్చింది. అందుకే సాయుధ పోరాటాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నాను అని పేర్కొన్నారు.
డీజీపీ ప్రకటన
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, మావోయిస్టుల లొంగుబాటుతో ఏవోబీ ప్రాంతంలో పార్టీ ఉనికి నామమాత్రంగా మారిందని తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని, మిగిలిన వారు కూడా ఆయుధాలు వదిలి రావాలని పిలుపునిచ్చారు.
Next Story

