‘పశ్చిమాసియా ఉద్రిక్తతలపై రాజకీయాలకు తావు లేదు’
x

‘పశ్చిమాసియా ఉద్రిక్తతలపై రాజకీయాలకు తావు లేదు’

ఐక్యతకు ప్రధాని పిలుపు.. ‘మన్ కీ బాత్’లో మోదీ


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తన 132వ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఇది క్లిష్ట సమయమని, ఈ పరిస్థితిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మవద్దని కోరారు. ప్రభుత్వం అందించే అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. గతంలోలాగే ఈసారి కూడా దేశం కలసికట్టుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయులకు సహాయం అందిస్తున్న ఆ దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం అంతర్జాతీయ సంబంధాలు, గత దశాబ్దంలో సాధించిన పురోగతి ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తాయని చెప్పారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ప్రారంభమైన వివాదం హెూర్ముజ్ జలసంధి రవాణాపై ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక మార్గమని వివరించారు.

క్రీడల విషయంలో జమ్మూ కాశ్మీర్ జట్టు తొలి రంజీ ట్రోఫీ గెలుపును ప్రధాని అభినందించారు. ఇది దీర్ఘకాల కృషి ఫలితమని చెప్పారు. యువ ఆటగాళ్ల ప్రతిభను ప్రశంసించారు.

ఆరోగ్యంపై మాట్లాడుతూ.. చక్కెర వినియోగాన్ని తగ్గించాలని, వంట నూనెను కనీసం 10 శాతం తగ్గించాలని సూచించారు. ఇలా చేస్తే జీవనశైలి వ్యాధులను నివారించవచ్చన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో యోగా ప్రాధాన్యతను వివరించారు. మహిళల క్రీడా ప్రగతిని కూడా ప్రశంసించారు. వివిధ క్రీడల్లో రాణిస్తున్న యువ క్రీడాకారులను అభినందించారు.

నీటి సంరక్షణలో ఛత్తీస్‌గఢ్ రైతులు అమలు చేస్తున్న ‘ఆవా పానీ జోంకీ’ నమూనాను ఉదాహరణగా చూపారు. ఇది భూగర్భజలాలను పెంచడంలో సహాయపడుతోందని తెలిపారు.

పురాతన రాతప్రతులను సంరక్షించేందుకు చేపట్టిన ‘జ్ఞాన భారతం’ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. తమ వద్ద ఉన్న మాన్యుస్క్రిప్టుల వివరాలను యాప్ ద్వారా పంచుకోవాలని సూచించారు.

భారతదేశ బలం ప్రజల భాగస్వామ్యంలోనే ఉందని ప్రధాని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

Read More
Next Story