మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల కలకలం
x

మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల కలకలం

శశిథరూర్, ఖేరాపై ఘాటు విమర్శలు


Click the Play button to hear this message in audio format

కేరళ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపల మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తన సహచర నేతలపై ఘాటు విమర్శలు చేస్తూ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారు.

ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా విభజనకు గురయ్యారని, అందువల్ల రాబోయే కేరళ ఎన్నికల్లో పార్టీ గెలవడం కష్టమేనని వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్ గెలవాలని నేను కోరుకుంటున్నాను, కానీ నాయకులు ఒకరినొకరు ఎక్కువగా ద్వేషించుకుంటున్నారు” అని అన్నారు.

ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఒక సెమినార్‌లో ప్రశంసించినందుకు కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఆ కార్యక్రమంలో కేరళ అభివృద్ధిని పొగడ్తలతో ముంచెత్తిన అయ్యర్ వ్యాఖ్యలు అప్పటికే వివాదానికి దారితీశాయి.

ఇక కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరాను “కీలుబొమ్మ”గా అభివర్ణించిన అయ్యర్.. పార్టీ ఆయన తప్ప మరెవరినీ ప్రతినిధిగా పెట్టలేకపోతే అదే స్థితిలో ఉంటుందని అన్నారు. దీనికి స్పందించిన ఖేరా.. అయ్యర్ చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని, ఆయన వ్యక్తిగత అభిప్రాయాలకే పరిమితమని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

శశి థరూర్‌పై కూడా అయ్యర్ విమర్శలు గుప్పించారు. ఆయనను “పాకిస్తాన్ వ్యతిరేకి”గా పేర్కొన్నారు. భవిష్యత్తులో విదేశాంగ మంత్రిగా అవ్వాలనే ఆశతో ఈ విధమైన వైఖరి అవలంబిస్తున్నారని వ్యాఖ్యానించారు. థరూర్ అప్పుడప్పుడు పార్టీ అధికారిక లైన్‌కు భిన్నంగా మాట్లాడుతుండటంతో ఆయనపై ఇప్పటికే పార్టీలో చర్చ కొనసాగుతోంది.

అదే సమయంలో కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్‌పై కూడా అయ్యర్ విమర్శలు చేశారు. విజయన్‌ను ప్రశంసించిన తన వ్యాఖ్యలను ఖండించడంలో రమేష్ పాత్ర ఉందని, “తన పదవి కాపాడుకోవడానికే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు” అని సూచించారు. అయితే రమేష్ మాత్రం కాంగ్రెస్ సిద్ధాంతాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

మొత్తానికి కేరళ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయనే భావన ఈ వ్యాఖ్యలతో మరింత బలపడింది. పార్టీ ఒకవైపు ఎన్నికలకు సిద్ధమవుతుండగా, మరోవైపు సీనియర్ నేతల విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.

Read More
Next Story