మహాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు? ఇంతకీ మోదీ అంతమాట ఎందుకన్నట్టు?
x

మహాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు? ఇంతకీ మోదీ అంతమాట ఎందుకన్నట్టు?

ప్రపంచానికి నేను కొత్తగా బోధించాల్సిన విషయమేమీ లేదు. సత్యం, అహింస అనాది నుంచి ఉన్నవేనని చెప్పిన మహాత్మాగాంధీ గురించి ప్రపంచానికి తెలియదంటారేమిటీ ప్రధాని మోదీ?


1908 డిసెంబర్ 14.. ప్రపంచ ప్రఖ్యాత రచయిత లియో టాల్ స్టాయ్ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకి లేఖ రాస్తూ..

దక్షిణాఫ్రికాలో జాత్యాహంకారాన్ని నిరసిస్తారు
1939లో ఐన్ స్టీన్ మహాత్మా గాంధీకి రాసిన లేఖలో..
“మా కాలపు రాజకీయ నాయకులందరిపైనా గాంధీ అభిప్రాయాలు అత్యంత ప్రభావం చూపి ఉంటాయని నా ప్రగాఢ విశ్వాసం. గాంధీ స్ఫూర్తితో మనం కృషి చేయాలి. మన ప్రయోజనాల కోసం చేసే పోరాటంలో హింసకు తావివ్వొద్దు. మీరు చెడ్డదని భావించే ఏ పనిలోనూ పాల్గొనవద్దు అనేది గాంధీ సిద్ధాంతం” అంటారు ఐన్‌స్టీన్.
1948 జనవరి 30న..నాధూరాం గాడ్సే అనే ఆర్.ఎస్.ఎస్. వీరాభిమాని మహాత్ముణ్ణి తుటాలతో తూట్లు పొడచినప్పుడు గాంధీ అన్న చివరి మాటలు హేరామ్- జగద్విఖితం
1982 ఆగస్టులో మహాత్మాగాంధీపై ప్రముఖ దర్శకుడు అటెన్ బరో సినిమా తీసిన సినిమా అప్పట్లో పెద్ద సూపర్ డూపర్ హిట్..
2024 మే 29.. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ వ్యాఖ్య- తొలిసారి 'గాంధీ' సినిమా తీసినప్పుడు ఈ వ్యక్తి ఎవరనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి. సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ చేవచచ్చిందా , మహాత్మాగాంధీని అవమానపరిచినా పట్టించుకోరా అని నెటిజన్లు వాపోతున్నారు.

గాంధీ, మోదీలిద్దరిదీ గుజరాతే. ఇద్దరూ విభిన్న ఆలోచన ధోరణులకు చెందిన వారే. ఒకరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పురుడు పోసిన బీజేపీ పెంచి పోషించిన వారు. హిందూయిజమే ప్రాణంగా భావించే వారు. మరొకరు దేశ హితం కోసం ప్రాణాలు అర్పించిన వారు. సత్యం, అహింసతో దైన్నైనా సాధించవచ్చునని గట్టిగా విశ్వసించి కరుడుగట్టిన మతోన్మాది చేతిలో బలైపోయిన వారు. అటువంటి వ్యక్తిపై ప్రధానమంత్రి హోదాలో మోదీ ఈ తరహా కామెంటు చేయడం చౌకబారుతనంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు చాలామంది ఖండించారు. మరికొందరు మోదీపై కేసు పెట్టాలంటూ పలుచోట్ల ఫిర్యాదులు చేశారు. అయితే అవేవీ ఇంకా నమోదు కాలేదు. కాంగ్రెస్ పార్టీ జీవశ్చవంగా ఉండబట్టి పరిస్థితి ఇలా ఉంది గాని లేకుంటే ఈపాటికి దేశం భగ్గుమనేదేమో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి విమర్శలకు, ఫిర్యాదులకు ఏమాత్రం చలించని మోదీ తన మానాన తను తపస్సు చేసుకునేందుకు కన్యాకుమారి వెళ్లారు.
పార్లమెంటుకి చివరి దశ ఎన్నికలు జరుగుతున్న దశలో మోదీ మహాత్మాగాంధీపై ఇటువంటి కామెంట్లు చేయడం గమనార్హం. పార్లమెంటు తుదిదశ ఎన్నికలు జూన్ ఒకటిన జరుగబోతున్నాయి.

మోదీ వ్యాఖ్యలపై జాతీయ అవార్డు గ్రహీత, చిత్రనిర్మాత లూయిత్ కుమార్ బర్మన్ అస్సోం రాజధాని గౌహతీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 29న, ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు " దేశానికే అత్యంత అవమానకరం" అని ఆయన అభివర్ణించారు. మహాత్మా గాంధీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు అని పోలీసులు చెప్పారు.
“ఇది చాలా అవమానకరమైన ప్రకటన. భారతీయులు ఆమోదించలేరు. ఒక పౌరుడిగా, మహాత్మా గాంధీని అవమానించడాన్ని మేము అంగీకరించలేము. గాంధీని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏ సినిమా అవసరం లేదు…” అన్నది బర్మన్ ఆవేదన.
మహాత్మా గాంధీని సినిమాతో పోల్చడం ద్వారా “నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలతో పాటు మహాత్మా గాంధీ పరువు తీశారని పేర్కొంది. కాబట్టి, నరేంద్ర మోదీపై సంబంధిత సెక్షన్ ఆఫ్ లా కింద చర్య తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.

ఏబీపీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ... “మహాత్మా గాంధీ ఒక గొప్ప వ్యక్తి. ఈ 75 ఏళ్లలో ప్రపంచం మొత్తం మహాత్మాగాంధీ గురించి తెలుసుకునేలా చేయడం మన బాధ్యత కాదా? గాంధీ గురించి ఎవరికీ తెలియదని చెప్పడానికి చింతిస్తున్నాను. తొలిసారిగా 'గాంధీ' సినిమా తీసినప్పుడు ఈ వ్యక్తి ఎవరనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది" అన్నారు మోదీ. నిజానికి ఇంత చిన్న విషయం మోదీకి తెలియందేమీ కాదు. ఓ వివాదాన్ని సృష్టించడం ఆయన ఉద్దేశం కావొచ్చు లేదా ఆర్ఎస్ఎస్ పై పడిన మచ్చను తుడిపేసే క్రమంలో గాంధీ ప్రతిష్టను దిగజార్చాలన్నది ఉద్దేశం కావొచ్చునన్నది కాంగ్రెస్ నాయకుల వాదన.
మహాత్మా గాంధీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో విస్తృత ఆగ్రహాన్నే రేకెత్తించాయి.
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యల్ని "దిగ్భ్రాంతికరమైనవి" అన్నారు. ఇద్దరూ గుజరాత్ నుంచి వచ్చినప్పటికీ మహాత్మా గాంధీని ప్రశంసించడంలో ప్రధాని మోదీ "సిగ్గుపడుతున్నారు" అన్నారు.
ప్రధాని మోదీ విద్యార్హతను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కూడా విరుచుకుపడ్డారు. మహాత్మాగాంధీని తెలుసుకోవాలంటే 'మొత్తం పొలిటికల్ సైన్స్' విద్యార్థి మాత్రమే ఆ సినిమా చూడాల్సి ఉంటుందన్నారు.
కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ, “1982కి ముందు మహాత్మా గాంధీని గుర్తించని ప్రపంచమేదో రేపోమాపో దిగిపోనున్న ఈ ప్రధాని మోదీ చెప్పాలి. ఇంతకీ మోదీ ఏ ప్రపంచంలో నివసిస్తున్నారో తెలియడం లేదు. మహాత్ముని వారసత్వాన్ని ఎవరైనా నాశనం చేసి ఉంటే, అది సాక్షాత్తూ ఈ ప్రధానమంత్రి మాత్రమే. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో గాంధీ సంస్థలను ఆయన ప్రభుత్వం ధ్వంసం చేసింది" అని విమర్శించారు.
‘గాంధీ’ సినిమాతో మోహన్‌ దాస్‌ గాంధీకి ‘అంతర్జాతీయ గుర్తింపు’ వచ్చిందనడం ఎలా ఉంటుందంటే మండల్ వ్యతిరేక ఉద్యమం వల్ల – బాబాసాహబ్‌ అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో తెలిసివచ్చిందన్నట్టుగా ఉంటుంది.
గాంధీ ఇంటిపేరున్న రాహుల్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మాట అన్నారేమోనన్న సెటైర్లు పేలాయి. మహాత్మా మోహన్‌ దాస్‌ గాంధీకి ‘ప్రపంచవ్యాప్త గుర్తింపు’ 1982లో ‘గాంధీ’ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మాట ఎంత వరకు నిజమో గాంధీ ఇంటి పేరున్న రాహుల్‌ గాంధీకి బాగా తెలుసు.
భారతదేశంలో బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో (మండల్‌ కమిషన్‌ సిఫార్సు మేరకు) 27 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ 1990 చివర్లో నాటి ప్రధాని విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకబడిన వర్గాలు లేదా కులాల జనానికి అంబేడ్కర్‌ వ్యక్తిత్వం, ఆయన జ్ఞానం, వివేకం ఎంతటి గొప్పవో తెలిశాయి. దేశంలో అగ్రవర్ణాలు లేదా అగ్రకులాల యువత ఆరు నెలల పాటు మండల్‌ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపాయి.
ఆమాటలెలా ఉన్నా ... ఆటెన్ బరో గాంధీపై సినిమా తీసిన తర్వాతే ప్రపంచానికి ఆయన గురించి తెలిసిందనడం మాత్రం వింతే. "ఇంత అజ్ఞాన రాజకీయ శాస్త్రజ్ఞుడిని ఇంతవరకు చూడలేదు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి లోకమంతా చీకటయిపోయిందనుకుంటున్నాడు. ఆ సినిమా తీయకముందు గాంధీ గురించి లోకానికి తెలియదా" అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.

గాంధీ నుంచి స్ఫూర్తి పొందిన విశ్వకవి టాల్ స్టాయ్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి ప్రముఖులు ఏ కాలం నాటివారో ఈ అల్పబుద్ధికి తెలిసే అవకాశమే లేదు అని కాంగ్రెస్ వాదులు విమర్శిస్తున్నారు.
రెచ్చిపోతున్న నెటిజన్లు..
మోదీ వ్యాఖ్యలపై నెటిజన్లు తామరతంపరగా కామెంట్లు పెడుతున్నారు. మోదీని తీవ్ర పదజాలంతో నిందిస్తున్నారు. "ప్రపంచం తెలియని ఒక నియంత, ఏమీ చదవని ఒక మూర్ఖుడు ఎలా ఉంటాడో తెలుస్తోందా!" అని ఒకరంటే "ఏ యూనివర్శిటీలో చరిత్ర చదివారో చెప్పాలి" అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
గాంధీజీ 20వ శతాబ్దంలోనే గాంధీజీ మోస్ట్ పాపులర్ గ్లోబల్ పొలిటికల్ పర్సనాలిటీ. సామాజిక జీవితంలో ఉన్న వారందరికీ గాంధీజీ ఎవరో తెలియదంటే వాళ్లు రాజకీయ అజ్ఞానులు మాత్రమే అవుతారు. ఎవరో సినిమా తీస్తే తప్ప తెలుసుకోలేని స్థాయి గాంధీజీ ది కాదు. "రక్త మాంసాలు తప్ప ఎక్కడా చెంచా కండలేని దేహంతో ఓ మనిషి ఈ నేలమీద నడయాడాడని చెబితే, ముందు తరాల వారు నమ్ముతారా?" అంటారు విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్. టాల్ స్టాయ్, జోసెఫ్ స్టాలిన్, విన్సెంట్ చర్చిల్, జె.ఎఫ్. కెన్నెడీ, మార్టిన్ రూథర్ కింగ్, నెల్సన్ మండేలా దాకా...ఎందరెందరో గాంధీజీ విశిష్టతను కీర్తిస్తారు.
మరి ఈ మోదీకి ఏమైందన్నది?
1982లో అటెన్ బరో "గాంధీ' సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదనడమే విడ్డూరం. మోదీ కావాలనే ఈ వ్యాఖ్య చేసి ఉండవచ్చు. ఈ భారత భూమికి 'విశ్వ గురువు' అనే ప్రతిష్టను కాపాడిన వాడు, నిలబెట్టిన వాడు మనం అవునన్నా, కాదన్నా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీయే అవుతాడు తప్ప నరేంద్ర మోదీ కాడు అన్నది అందరికీ తెలిసిన సత్యమే. విశ్వగురువుగా ఖ్యాతి గాంచాలన్న కాంక్షతో మోదీ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునేమో గాని అది ఎన్నటికీ నెరవేరదు అంటారు ప్రముఖ గాంధేయవాది సుబ్రమణ్యేశ్వరరావు. నెహ్రూ, గాంధీల వారసత్వాన్ని పాతిపెట్టాలంటే వ్యక్తిత్వ హననం చేయకూడదంటారు ఆయన.
గాంధీపై ఆటెన్ బరో సినిమా
"గాంధీ" అనే సినిమా 1982లో విడుదలైంది. ఈ చిత్రం 20వ శతాబ్దంలో బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి కోసం సాగిన స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ పోషించిన పాత్రను, ఆయన వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది. గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇండియా, బ్రిటన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించారు. జాన్ బ్రైలీ స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రం బెన్ కింగ్ల్సీ గాంధీ పాత్రను చాలా గొప్పగా పోషించారు.
పోర్ బందర్ లో పుట్టి...

1869లో గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించిన మహాత్మా గాంధీ భారత దేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వానికి వహించి చిరస్థాయిగా నిలిచారు. అహింస పట్ల అచంచలమైన విశ్వాసం, నిబద్ధతను చాటిన వారిలో ఆయన్ను మించిన వారు లేరు. తాను నమ్మిన పౌర హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తన తల్లి తనకు జన్మను మాత్రమే ఇచ్చిందని, తాను 'జీవసంబంధమైన జీవిని' కాదని, దైవిక కోరికలను నెరవేర్చడానికి భగవంతుడు పంపిన వ్యక్తిగా చెప్పుకున్నారు మోదీ. ఇప్పుడేమో ఏకంగా మహాత్మా గాంధీనే టార్గెట్ చేయడం వివాదాస్పదమైంది.
Read More
Next Story