మహారాష్ట్రలో 5% ముస్లిం రిజర్వేషన్ రద్దు
x

మహారాష్ట్రలో 5% ముస్లిం రిజర్వేషన్ రద్దు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..


Click the Play button to hear this message in audio format

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం (SEBC) కేటగిరీ కింద ముస్లింలకు అమల్లో ఉన్న 5 శాతం రిజర్వేషన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం మంగళవారం రాత్రి జీవో జారీ చేసింది. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ రిజర్వేషన్ వర్తించేది. తాజా ఉత్తర్వుతో ఇకపై ముస్లింలకు ప్రత్యేకంగా ఈ కోటా అమలులో ఉండదని స్పష్టం చేసింది.


రిజర్వేషన్ల నేపథ్యం ఎలా మొదలైంది?

2014లో అప్పటి కాంగ్రెస్–ఎన్‌సీపీ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సామాజికంగా వెనుకబడిన ముస్లిం వర్గాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ ఆర్డినెన్స్ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు ఇది ఎన్నికల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించాయి.


చట్టపరమైన వివాదాలు..

ఈ రిజర్వేషన్ నిర్ణయం బాంబే హైకోర్టులో సవాళ్లను ఎదుర్కొంది. 2014 నవంబర్ 14న హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. తరువాత ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు తీర్పులు, చట్టపరమైన అడ్డంకుల కారణంగా ఆ రిజర్వేషన్ పూర్తిగా అమలులోకి రాలేదు. డిసెంబర్ 23, 2014 నాటికి శాసనసభ ఆ ఆర్డినెన్స్‌ను చట్టంగా ఆమోదించకపోవడంతో గడువు ముగిసింది. అయినప్పటికీ అధికారికంగా రద్దు ప్రకటన లేకపోవడంతో ఈ అంశం అనిశ్చితిలోనే కొనసాగింది.

దాదాపు 12 సంవత్సరాల తరువాత దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇస్తూ తాజా ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసింది. చట్టపరంగా అమలులో లేని కోటాను అధికారికంగా రద్దు చేస్తూ, భవిష్యత్తులో కూడా ఈ కేటగిరీ కింద రిజర్వేషన్ ఉండదని తెలిపింది. ప్రభుత్వం ప్రకారం, ఇది కేవలం చట్టపరమైన స్పష్టత కోసం తీసుకున్న నిర్ణయమేనని, ఇప్పటికే అమలులో లేని అంశాన్ని అధికారికంగా ముగించినట్లేనని వాదిస్తోంది.


రంజాన్ బహుమతి..AIMIM

ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్ నేతలు ఇది ముస్లిం సమాజానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం వాటిని నిలిపివేస్తోందని విమర్శించారు.

AIMIM నాయకులు ఈ నిర్ణయాన్ని వ్యంగ్యంగా “రంజాన్ బహుమతి”గా అభివర్ణిస్తూ, విద్యార్థులు చదువు ఆపకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. NCP (SP) ప్రతినిధులు సామాజిక న్యాయానికి విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. ముస్లిం వెనుకబడిన వర్గాల హక్కులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.


ప్రభుత్వ వాదన..

ప్రభుత్వం మాత్రం ఈ చర్య పూర్తిగా చట్టపరమైన కారణాల వల్లేనని స్పష్టం చేసింది. కోర్టుల ఆదేశాలు, ఆర్డినెన్స్ గడువు ముగిసిన అంశాలను పరిగణలోకి తీసుకుని అనిశ్చితిని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కొత్తగా ఎలాంటి కోటా రద్దు చేయలేదని, అమల్లో లేని విధానాన్ని అధికారికంగా ముగించామని స్పష్టత ఇచ్చారు.

మొత్తంగా చూస్తే.. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ అంశం మళ్లీ రాజకీయ చర్చకు దారి తీసింది. ఒకవైపు ప్రభుత్వం చట్టపరమైన స్పష్టతగా పేర్కొంటుండగా, మరోవైపు ప్రతిపక్షాలు సామాజిక న్యాయానికి విరుద్ధమని విమర్శిస్తున్నాయి. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది

Read More
Next Story