ముంబై, పూణే, నాగ్‌పూర్‌లో ముందంజలో బీజేపీ; థానేలో శివసేన..
BMC ఎన్నికల్లో ప్రభావం చూపని థాకరే సోదరులు కలయిక..
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో (Maharashtra civic polls) మహాయుతి కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ఆధిక్యంలో బీజేపీ..
మొత్తం 227 వార్డులకుగాను 210 వార్డుల్లో బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన హవా కొనసాగుతోంది. ముంబైలోని 92 వార్డులలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 26 వార్డులలో ఆధిక్యంలో ఉందని మీడియా సమాచారం. ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్ 114ను సులభంగా క్రాస్ చేయగలదు. కాంగ్రెస్, దాని మిత్రపక్షం వంచిత్ బహుజన్ అఘాడితో కలిసి లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను చేజిక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రభావం చూపని థాకరే సోదరుల కలయిక..
మరాఠాలను ఏకం చేయాలన్నన లక్ష్యంతో రెండు దశాబ్దాల తర్వాత థాకరే సోదరులు చేతులు కలిపినా మహాయుతి కూటమి మీద ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన-యూబీటీ 60 వార్డులలో, రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి.
షిండే కంచుకోటగా చెప్పుకునే థానేలో 131 వార్డులకు గాను 18 వార్డులలో ఆధిక్యంలో ఉండగా.. మిత్రపక్షమైన బీజేపీ 10 వార్డులలో ఆధిక్యంలో ఉంది.
ఇక పూణేలో బీజేపీ హవా కొనసాగుతోంది. 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో, ఎన్‌సీపీ 5 స్థానాల్లో, ఎన్‌సీపీ (ఎస్‌పి) 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
పింప్రి చించ్వాడ్‌లో బీజేపీ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పూణే, పింప్రి చించ్వాడ్ ఎన్నికలలో రెండు పార్టీలు స్వతంత్రంగా పోటీ చేశాయి. నాగ్‌పూర్ నాసిక్, శంభాజీనగర్ మునిసిపల్ కార్పొరేషన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో 52.94 శాతం పోలింగ్ నమోదు కాగా 2017 ఎన్నికల్లో ఇది 55.53 శాతంగా నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.

