
మహా కుంభమేళ మోనాలిసా ఇంకా మైనరే..
ఎస్టీ కమిషన్ విచారణలో వెలుగులోకి కీలక విషయాలు.. భర్తపై పోక్సో కేసు..
దేశవ్యాప్తంగా మహా కుంభ్ మేళాలో వైరల్ అయిన యువతి మోనాలిసా.. మైనర్ బాలిక అని అధికారికంగా నిర్ధారించారు. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్న భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బాలిక 2025 మహా కుంభమేళా సమయంలో పూలదండలు, రుద్రాక్షలు అమ్ముతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
జాతీయ ఎస్టీ కమిషన్ నిర్వహించిన విచారణలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ 2009 డిసెంబర్ 30గా నిర్ధారించారు. ఈ ఆధారాలతో, ఆమె వివాహ సమయంలో వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే అని కమిషన్ తేల్చింది. కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య ఈ వివరాలను అధికారికంగా ధృవీకరించారు. విచారణలో ఆమెను పెళ్లాడిన వ్యక్తి ముస్లిం అని కూడా గుర్తించారు.
ఈ కేసులో రాజకీయ వాదనలు కూడా చోటుచేసుకున్నాయి. కొందరు బీజేపీ నాయకులు ఈ వివాహాన్ని “లవ్ జిహాద్” కేసుగా పేర్కొంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావాలని కూడా కోరారు.
మరోవైపు, పోలీసు అధికారులు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశారు. మార్చి 25న మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ ఆరోపణలు, పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అదనంగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 137(2) కింద కూడా ప్రత్యేక కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
సంచార వర్గానికి చెందిన మొనాలిసాను మార్చిలో కేరళలోని ఒక ఆలయంలో వివాహం జరిగినట్లు సమాచారం. ఈ వివాహంపై కుటుంబ సభ్యులు, కొందరు ఇతరులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

