
విశాఖలో లూలూకు కేటాయించిన భూమి
బెజవాడలో లూలూ వెనక్కి.. వైజాగ్‌లో ఏమవుతుంది?
ప్రభుత్వం విజయవాడలో లూలూ సంస్థకు భూకేటాయింపును వెనక్కి తీసుకోవడంతో విశాఖలో ఆ సంస్థకిచ్చిన భూమి సంగతేమిటన్నది చర్చనీయాంశమైంది.
వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ప్రభుత్వం కారు చౌకగా లూలూ సంస్థకు కట్టబెట్టడంపై ఎప్పట్నుంచో దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరం నడిబొడ్డున ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లూలూకి కేటాయించిన ప్రభుత్వం తాజాగా వెనక్కి తీసుకుంది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. దీంతో ఇప్పటికే విశాఖలో లూలూకు కేటాయించిన 13.43 ఎకరాలపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
లూలూ మాల్ (ఫైల్ ఫోటో)
విశాఖలో లూలూకు కేటాయింపు ఇలా..
విశాఖ ఆర్కే బీచ్‌కు సమీపంలో హార్బర్ పార్కుకు చెందిన 13.43 ఎకరాల భూమిని గత ఏడాది మార్చిలో లూలూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్థలాన్ని 99 ఏళ్ల లీజుకు కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థలంలో 13.5 లక్షల చదరపు అడుగుల్లో లూలూ సంస్థ ప్రపంచ శ్రేణి మాల్ నిర్మించనుంది. ఇందులో చిల్డ్రన్స్ ఎమ్యూజ్‌మెంట్ పార్కు, ఫుడ్ కోర్టు, తొమ్మిది స్క్రీన్లతో ఐమ్యాక్స్, మల్టిప్లెక్స్‌ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది.
వైజాగ్‌లో ఏం జరిగిందంటే?
తొలుత 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖలోని ఈ 13.43 ఎకరాలను లూలూ యాజమాన్యానికి కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023లో ఆ కేటాయింపును రద్దు చేసింది. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ గత ఏడాది మార్చిలో లూలూకు మరోసారి ఆ స్థలాన్ని 99 ఏళ్ల లీజుకు కేటాయించింది. ఆ సంస్థ అభ్యర్థన మేరకు.. మొదటి మూడేళ్లూ లీజు చెల్లించకుండా లూలూకు వెసులుబాటు కల్పించాలని, ఆ తర్వాత ఏడాదికి రూ.7.08 కోట్ల లీజును చెల్లించేలా పదేళ్లకోసారి 10 శాతం పెంచేలా నిర్ణయించింది. ఈ స్థలంలో లూలూ సంస్థ రూ.1,066 కోట్ల పెట్టుబడులు పెడతానంది. సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని లూలూ సంస్థ పేర్కొంది.
విజయవాడ ఆర్టీసీ స్థలంపై హైకోర్టుకు..
ప్రభుత్వం విజయవాడలో రూ.వందల కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాన్ని లూలూ మాల్‌కు కేటాయించడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, విజయవాడ న్యాయవాది సీహెచ్ వెంకటేశ్వరరావులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీల నాయకులు కూడా లూలూకు ఆర్టీసీ స్థలాన్ని కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో లూలూకు ఆర్టీసీ స్థలం కేటాయింపును రద్దు చేసుకుంటున్నట్టు ఇటీవల ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. దీంతో ప్రభుత్వం విజయవాడ ఆర్టీసీ స్థలాన్ని లూలూకు కేటాయింపులో వెనకడుగు వేసినట్టయింది.
మరి వైజాగ్ లూలూ సంగతేమిటి..?
విశాఖపట్నంలో లూలూ మాల్‌కు భూ కేటాయింపులపై పాకా సత్యనారాయణ అనే న్యాయవాది హైకోర్టులో గతేడాది పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగ్గా.. లూలూకు భూ కేటాయింపుల వ్యవహారం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని: గతంలో ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. విజయవాడతో పోల్చుకుంటే విశాఖలో భూముల విలువ ఎన్నో రెట్లు ఎక్కువ. విశాఖ బీచ్‌కు చేరువలో అత్యంత ఖరీదైన 13 ఎకరాల భూమిని లూలూ సంస్థకు కేటాయింపును విశాఖలోని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. అయితే విజయవాడలో లూలూకి భూ కేటాయింపుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం విశాఖలో ఆ సంస్థకు కేటాయించిన భూములపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్ని బట్టి వైజాగ్‌లో లూలూకు ఇస్తున్న భూముల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోలేదని స్పష్టమవుతోంది. విజయవాడలో లూలూకు ఆర్టీసీ స్థలాన్ని ధారాదత్తం చేసిన వైనంపై ఈ ప్రభుత్వ పాలసీని కూడా సమీక్షిస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. విశాఖలో లూలూ కేటాయింపుపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆపై ఆయన మౌనం దాల్చారు. మరోవైపు లూలూ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో రూ.63 వేల కోట్ల టర్నోవర్ ఉంది. అలాంటి సంస్థకు ఎకరం 99 పైసలకు ఎలా ఇస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈఏఎస్ శర్మ
ఈఏఎస్ శర్మ ఏమన్నారంటే?
విశాఖలో లూలూ సంస్థకు కేటాయించిన భూమి కూడా పబ్లిక్ ల్యాండే.. వేల కోట్ల రూపాయల విలువైనది. లూలూకు అంత తక్కువ ధరకు కట్టబెట్టడానికి వీల్లేదు. స్థానిక సంస్థల పరిధిలో ఉన్న భూములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వరాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. విజయవాడ మాదిరిగానే విశాఖలో లూలూకిచ్చిన భూమిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి’ అని భారత ప్రభుత్వం ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.
విశాఖ భూములను వెనక్కి తీసుకోవల్సిందే..
‘విశాఖలో లూలూకు కేటాయించిన భూములపై హైకోర్టులో పిల్ వేశాను. దీనిపై హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విజయవాడ కేసుకు విశాఖ కేసును కూడా పరిగణనలోకి తీసుకుని జత చేయమని కోర్టు ఉత్తర్వులిచ్చింది. బిడ్ వేయకుండా లూలూకు వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే కేటాయించడం నిబంధనలకు విరుద్ధం. లూలూకు విశాఖ భూముల కేటాయింపును రద్దు చేయాలని కోర్టును కోరుతున్నాం. విజయవాడ మాదిరిగానే కోర్టు తీర్పు అనుకూలంగానే వస్తుందని భావిస్తున్నాం’ అని విశాఖ న్యాయవాది పాకా సత్యనారాయణ వివరించారు.
Next Story

