
‘గ్యాస్ వినియోగదారులకు ఆందోళన అక్కర్లేదు’
ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదన్న పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాలో భారత్‌కు కొంత అంతరాయం ఉందన్న మాట వాస్తవమేనని కేంద్రం తెలిపింది. అయితే దేశంలో ఎలాంటి కొరత లేదని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని హామీ ఇచ్చింది. కొంతమంది గ్యాస్ వినియోగదారుల్లో ఆందోళనలు నెలకొన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయంపై పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీ కేంద్రాల్లో ఎక్కడా కొరత లేదని స్పష్టం చేశారు. తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని తెలిపారు. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్లు అందుతున్నాయని, పీఎన్‌జీ సరఫరా కూడా పూర్తిస్థాయిలో కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇక ఎల్పీజీని తీసుకొస్తున్న రెండు భారత నౌకలు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. “పైన్ గ్యాస్” నౌక 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో మార్చి 27న న్యూ మంగళూరు పోర్టుకు చేరుకోనుండగా, “జగ్ వసంత్” నౌక 47,600 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో మార్చి 26న కాండ్లా పోర్టుకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 20 భారతీయ నౌకలు, 540 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో ఎలాంటి సముద్ర ప్రమాదాలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, పశ్చిమాసియా పరిస్థితులపై భారత్ అంతర్జాతీయ స్థాయిలో సంప్రదింపులు జరుపుతోంది. విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడి, ఇంధన భద్రతపై చర్చించారు. గల్ఫ్ దేశాల రాయబారులతో కూడా సమావేశమై తాజా పరిస్థితులను తెలుసుకుంటున్నారు.
మొత్తంగా, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సరఫరా వ్యవస్థపై కొంత ఇబ్బంది ఉన్నా.. దేశంలో ఎల్పీజీ కొరత లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపింది.

