
రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలపై ఆశ వదులుకోండి: అమెరికా
కీవ్ భద్రతను యూరప్ దేశాలే భరించాలన్న యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ
ఉక్రెయిన్ కు సంబంధించిన గత ప్రభుత్వం తీసుకున్న అన్ని పాలసీలను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అలాగే యుద్దానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడినట్లు, చర్చలు ప్రారంభించినట్లు వెల్లడించారు. అలాగే ఇరు దేశాలు యుద్ద ఖైదీలుగా జైళ్లలో ఉన్న వారిని మార్చుకున్నట్లు పేర్కొన్నారు.
పుతిన్ తో మాట్లాడినట్లు తన సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ పోస్టు చేశారు. త్వరలో రష్యా అధ్యక్షుడితో తాను భేటీ అవుతానని చెప్పారు. పుతిన్ తో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నామని వెల్లడించారు. తమ ఆధీనంలో ఉన్న రష్యాన్ అలెగ్జాండర్ వావ్ విక్ ను విడుదల చేయగా, రష్యా తన జైలు లో ఉన్న స్కూల్ టీచర్ అయిన మార్క్ ఫొగెల్ ను విడుదల చేసింది.
నాటో మెంబర్ షిప్ ఉక్రెయిన్...
ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం పై ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. వాస్తవానికి ఉక్రెయిన్ కు నాటో మెంబర్ షిప్ అవసరమా అని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్ సేత్ అన్నారు.
ఆయన నాటో ప్రధాన కార్యాలయమైన బ్రస్సెల్స్ ను బుధవారం సందర్శించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి కావాల్సిన ఏదైన సెక్యురిటీ గ్యారెంటీలు యూరోపియన్ దేశాలు చూసుకుంటాయని అన్నారు.
అలాగే రష్యా ప్రస్తుతం యుద్దంలో ఆక్రమించకున్న ప్రాంతాలు తిరిగి యుద్దం చేసి వెనక్కి తీసుకుంటామనే ఆలోచనలు సైతం మానుకోవాలని కీవ్ నాయకత్వానికి సూచించారు.అలాగే రష్యాతో శాంతి చర్చలకు సిద్దం కావాలని కూడా సందేశం పంపారు.
అయితే పుతిన్ మాట్లాడుతూ.. ఏదైన ఒప్పందం ముందుకు సాగాలంటే ముందుగా నాటో దళాలు ఉక్రెయిన్ నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.
జెలెన్ స్కీ చర్చలకు వస్తాడా?
అయితే రష్యా- అమెరికా అధ్యక్షుల మధ్య జరిగే చర్చల ప్రక్రియకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వస్తాడా అనే అనుమానాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్ష సలహదారు డిమిట్రో లిట్విన్ మాట్లాడినట్లు తెలిసింది. ఇది ‘‘మంచి సంభాషణ’’ అని ఆయన అన్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక రాయబారీ రిటైర్డ్ జనరల్ కీత్ సెల్లాగ్ అందరూ ఈ వారం చివర్లో జర్మనీలో జరిగే వార్షిక మ్యూనిక్ భద్రతా సమావేశానికి రాబోతున్నారు. ఈ సమావేశానికే జెలెన్ స్కీ సైతం హజరవుతున్నట్లు సమాచారం.
రష్యాతో అమెరికా జరిపే చర్చలలో ఉక్రెయిన్ ఒక పార్టీగా ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వడానికి వైట్ హౌజ్ అధికారులు నిరాకరించారు. కానీ ఖైదీల మార్పిడిని, పోరాటాన్ని ముగించడానికి చర్చలను ముందుకు తీసుకెళ్లగల దౌత్యపరమైన మార్పుకు నిదర్శనంగా వారు అభివర్ణించారు.
లక్షలాది మరణాలను ఆపాలనుకుంటున్నాం: ట్రంప్
ఫిబ్రవరి 24, 2022 లో రష్యా, ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడం మొదలు పెట్టింది. అంతకుముందు కీవ్ ను నాటో లో చేర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. జో బైడెన్ ప్రభుత్వం కూడా వేగంగా పావులు కదిపింది.
దానితో పుతిన్ సైనిక చర్యకు పూనుకున్నారు. అయితే మూడు సంవత్సరాలుగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ మాత్రం వీటికి చెక్ పెట్టడానికి పూనుకున్నారు.
‘‘మన దేశాల బలాల గురించి, కలిసి పనిచేయడం వల్ల మనకు లభించే గొప్ప ప్రయోజనం గురించి మేము వివరంగా మాట్లాడుకున్నాం’’ అని ట్రంప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. కానీ అంతకుముందుగా తాము యుద్దంలో జరుగుతున్న లక్షలాది మరణాలను ఆపాలనుకుంటున్నామని పేర్కొన్నారు.
మాకు సంబంధించిన బృందాలను వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆదేశించాను. వారితో మాట్లాడిన తరువాత జెలెన్స్కీని అప్రమత్తం చేస్తామని కూడా ట్రంప్ చెప్పారు. చర్చలకు నాయకత్వం వహించడానికి ఆయన రూబియో, సీఐఏ డెరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్, జాతీయ భద్రతా సలహదారు మైకేల్ వాల్జ్, ప్రత్యేక మిడ్ ఈస్ట్ రాయబారీ స్టీవెన్ విట్ కాఫ్ లను నియమించారు.
ఉక్రెయిన్ రక్షణకు యూరప్ దే బాధ్యత: ట్రంప్
తన కొత్త పరిపాలన సభ్యుడిగా, నాటోకు తొలిసారిగా పర్యటన చేస్తున్న హెగ్సెత్, ఉక్రెయిన్ రక్షణకు సంబంధించిన ఆర్థిక, సైనిక బాధ్యతలను యూరప్ చేపట్టేలా ట్రంప్ నిశ్చయించుకున్నారని ఇందులో అమెరికా దళాలు లేని శాంతి పరిరక్షక దళం కూడా ఉందని సూచించారు.
అమెరికా రక్షణ కార్యదర్శి కూడా ఆ దళానికి ఆర్టికల్ 5 రక్షణలు ఉండకూడదని అన్నారు. దీని ప్రకారం అమెరికా లేదా నాటో కూటమిలోని 31 ఇతర దేశాలు రష్యన్ దళాలతో సంబంధాలు ఏర్పరచుకుంటే ఆ దళాలకు సాయం చేయాల్సి ఉంటుంది.
‘‘ ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వడం అనేది పరిష్కారం కాదని నమ్మడం లేదు.’’ అని హెగ్సెత్ అన్నారు. అలాగే కీవ్ మద్దతుదారులు నాటో ప్రధాన కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ నెల 24 తో యుద్దం నాలుగో సంవత్సరంలోకి చేరుతుంది. అయితే వీరు ఇంక ఆధునాతన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సేకరించడానికి మాట్లాడుకున్నారని తెలిసింది.
యుద్దాన్ని త్వరగా ముగించాలని ట్రంప్ హమీ ఇచ్చారు. ఇది అమెరికన్ పన్ను చెల్లింపుదారులకు చాలా డబ్బును ఖర్చు చేస్తుందని ఆయన ఫిర్యాదు చేశారు. ఉక్రెయిన్ తన అరుదైన ఖనిజాలు, శక్తి ఇతర వనరులను ఇవ్వాలని కోరుతున్నారు.
అలాగే నాటో సభ్య దేశాలు కూడా తమ బడ్జెట్ లో రక్షణ వ్యయాన్ని 5 శాతానికి గణనీయగా పెంచాల్సిన అవసరం ఉందని హెగ్సేత్ అన్నారు. ఇక నుంచి తమ పై ఆధారపడటాన్ని యూఎస్ సహించలేదన్నారు. బదులుగా యూరప్ ఇక నుంచి తన భద్రత తనే బాధ్యతను వహించాలని హెగ్సేత్ అన్నారు.
ఒక దేశం నాటోలో చేరాలంటే 32 దేశాలు అంగీకరించాలి. అంటే ప్రతి సభ్యుడికి వీటో ఉంది. ఒక్కరు వ్యతిరేకించిన దేశానికి సభ్యత్వం రాదు.
Next Story