విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధం..వ్యాపారి సజీవదహనం
x

విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధం..వ్యాపారి సజీవదహనం

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి తోటలో కాయల కోతకు వెళ్లిన లారీకి విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కొబ్బరి తోటలో కాయలు కోసేందుకు 18 మంది కూలీలతో కూడిన ఒక లారీ అక్కడికి చేరుకుంది. కూలీలు తోటలో పనిలో నిమగ్నమై ఉండగా, లారీపై అప్పటికే లోడ్ చేసిన కాయలపై పామర్తి మల్లికార్జున అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. తోటలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు ఒక్కసారిగా లారీకి తగలడంతో హైటెన్షన్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది.

మంటల్లో చిక్కుకున్న మల్లికార్జున

తీగలు తగిలిన వెంటనే మంటలు లారీని చుట్టుముట్టాయి. లారీపై కూర్చున్న మల్లికార్జున మంటల వేడికి కిందకు దూకే అవకాశం లేక, వాటిలోనే చిక్కుకుపోయాడు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఆయన సజీవదహనమయ్యాడు. మల్లికార్జున దేహం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేకుండా మారిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మిగిలిన 17 మంది క్షేమం

అదృష్టవశాత్తూ లారీ కింద ఉన్న 17 మంది కూలీలు మంటలు గమనించి దూరంగా పరుగులు తీయడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మరణించిన మల్లికార్జున కొబ్బరికాయల అమ్మకంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, అటవీ.. తోటల ప్రాంతాల్లో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలపై విచారణ జరుపుతున్నారు.

Read More
Next Story