రాష్ట్రపతిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్ బృందం
x

రాష్ట్రపతిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్ బృందం

చంద్రబాబు విజనరీ లీడర్ అని ద్రౌపది ముర్ము ప్రశంసలు.


ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి కీలకంగా మారిన అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ రూపొందించిన బిల్లుకు ఆమోదముద్ర వేసినందుకు గాను, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లోకేశ్ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీల బృందం సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజల తరఫున ఆమెకు లోకేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


చంద్రబాబు దార్శనికతపై ముర్ము ప్రశంసలు

ఈ భేటీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబును ఒక ఇంటెలిజెంట్.. విజనరీ లీడర్ (అత్యంత ప్రతిభావంతుడైన, దార్శనికత కలిగిన నాయకుడు)గా ఆమె అభివర్ణించారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో ఆయనకున్న అపారమైన అనుభవం, భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి ప్రణాళికలు సిద్ధం చేసే ఆయన శైలి అద్భుతమని మెచ్చుకున్నారు. దేశంలోని సీనియర్ నాయకులలో చంద్రబాబు ఒక ప్రత్యేక ముద్ర వేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రైతుల త్యాగం.. ప్రపంచంలోనే అరుదైన ఘట్టం
అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంపై రాష్ట్రపతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం ఒక పిలుపుతో ఏకంగా 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించడం ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టమని ఆమె కొనియాడారు. రాజధాని రైతుల త్యాగం హర్షణీయమని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చంద్రబాబు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం గ్రేట్ అని ప్రశంసించారు. ఇంత పెద్ద ఎత్తున భూ సమీకరణను (Land Pooling) శాంతియుతంగా పూర్తి చేయడం చంద్రబాబు నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

ముగిసిన అనిశ్చితి .. ఏపీ ప్రజల్లో నూతనోత్తేజం
రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి విషయంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడిందని మంత్రి లోకేశ్ ఆమెకు వివరించారు. రాజధానిపై స్పష్టత రావడంతో అటు రైతులు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి భవన్ అందిస్తున్న సహకారం రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపిందని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్న లోకేశ్ బృందం, సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది.
Read More
Next Story