
ఎంపిలతో, ఎమ్మెల్యేలతో లోకేష్ కొత్త అనుబంధం
-కూటమి ప్రజాప్రతినిధులతో కొనసాగుతున్న విందు సమావేశాలు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎంపిలతో, ఎమ్మెల్యేలతో డిన్నర్ సమావేశాలు కొనసాగిస్తున్నారు.గతంలో ఎపుడూ లేనంతగా ఈ సారి ఆయన కూటమి ప్రజాప్రతినిధులకు దగ్గిరవుతున్నారు. సభ్యులతోనే కాదు, వారి కుటుంబ సభ్యలకు సన్నిహితమవుతున్నారు. ప్రజాప్రతినిధులకు స్థానిక సమస్యలను సత్వరం పరిష్కరించి నియోజకవర్గాలలో వాళ్ల ఇమేజ్ పెరిగేందుకు దోహదం చేస్తానని చెబుతూ మహిళా కుటుంబ సభ్యులకు కానుకలు ఇస్తున్నారు. సెల్ఫీ దిగుతున్నారు. టిడిపిలో ఇది ఒక కొత్త వరవడి. కూటమి అదికారంలోకి వచ్చి ఇరవై నెలల తర్వాత ఈ వ్యూహం అమలు చేస్తున్నారు. తొందరలోనే కూటమి నాయకత్వంలో ఆయనకు అప్పగిస్తారా, అందుకే ఆయన అందరి మద్దతుకోసం ఇలా డిన్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నారా అనే చర్చ జరుగుతూ ఉంది. కూటమి నాయకత్వం అంటే ఏమిటి? అనేదే చర్చనీయాంశం. వచ్చే ఎన్నికలనాటికి చంద్రబాబు నాయుడు తప్పకుని నాయకత్వం లోకేష్ కు అప్పగించేందుకు రంగం తయారువుతున్నదని ఒక వర్గం నుంచి వూహాగానాలు వినబడుతున్నాయి. లోకేష్ ఢిల్లీలో ప్రధాని ఆశీస్సులు పొందారని, ఇక పార్టీ, కూటమినేతల మద్దతు కోసం ఇలా డిన్నర్ మీటింగ్స్ తో ప్రజాప్రతినిధుల, కుటుంబ సభ్యుల మద్దతు కూడగడుతున్నారని ఆయన చెబుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రశంసలు కూడా లభించాయి. మొన్నామధ్య ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వం పరంగా కృషి చేస్తున్నాను, లోకేష్ పార్టీ పరంగా మంచి సంబంధాలు కూటమి పార్టీలతో కొనసాగిస్తున్నారు,’’ అన్నారు. అంటే, లోకేష్ డిన్నర్ సమావేశాలు చాలా ఆలోచించి, ఒక వ్యూహం ప్రకారం చేపట్టిన రాజకీయ కార్యక్రమం అని అర్థమవుతుంది.
పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి ఉండవల్లి నివాసానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరైన కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మాటలు, ముచ్చట్లతో చాలా సమయం సరదాగా గడిపారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జవాబుదారీతనానికి నిదర్శనంగా, ప్రజాప్రతినిధులు ఎవరూ అడగకుండానే వారు ఇచ్చిన వినతులు పరిష్కారం అయినవి, పరిష్కార దశలో ఉన్నవి, పెండింగువి తెలియజేస్తూ నివేదికలు అందజేశారు. ఆహ్లాదకర వాతావరణంలో విందు జరిగింది. ఇంట్లో శుభకార్యం నిర్వహించినప్పుడు పాటించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలు పెట్టారు.
ఈ ఆత్మీయ కలయికకు కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధి ఎమ్మెల్యేలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి (కడప), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు-బీజేపీ), పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి (కమలాపురం), ఎన్ వరదరాజులురెడ్డి (ప్రొద్దుటూరు), ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాలరెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (రాయచోటి), నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి (పీలేరు) షాజహాన్ బాషా (మదనపల్లె) కుటుంబసభ్యులతో హాజరయ్యారు.

