రాజధాని అమరావతి చట్టబద్ధతకు లోక్‌సభ ఓకే!
x

రాజధాని అమరావతి 'చట్టబద్ధత'కు లోక్‌సభ ఓకే!

లోక్ సభలో వాడీవేడీ చర్చ, రేపు రాజ్యసభ ముందుకు..


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏకైక, శాశ్వతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు-2026’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో దశాబ్ద కాలంగా నెలకొన్న రాజధాని అనిశ్చితికి తెరపడింది. అయితే, ఈ ప్రక్రియ కూడా సజావుగా సాగలేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పార్లమెంటు సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు పార్లమెంటులో విమర్శలు, ప్రతివిమర్శల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభలో లేరు. చివరకు స్పీకర్ స్థానంలో కూడా టీటీడీ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ (ప్యానల్ స్పీకర్) ఉన్నారు. సుమారు రెండు గంటల పాటు చర్చ సాగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు చర్చలో పాల్గొన్నారు.
పురందేశ్వరి, కిషన్ రెడ్డి ఏమన్నారంటే...
బిజెపి ఎంపీ డి.కె. పురందేశ్వరి మాట్లాడుతూ, విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని గుర్తుచేశారు. "చర్చ లేకుండా రాష్ట్రాన్ని విభజించి, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నడి రోడ్డుపై నిలబెట్టారు. నేడు అమరావతికి శాశ్వత హోదా కల్పించడం ద్వారా ఆ చారిత్రక తప్పును సరిదిద్దుతున్నాం" అని పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతిని రాజధానిగా చెప్పుకోలేని దుస్థితిని గత ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. తెలంగాణ పోరాటాన్ని గుర్తు చేస్తూనే, విభజన తర్వాత రెండు రాష్ట్రాలు పోటీతత్వంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాజధాని విషయంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, కూటమి ఇచ్చిన హామీ మేరకు అమరావతిని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.
'ఊసరవెల్లి' వ్యాఖ్యలు.. వైసీపీ వాకౌట్..
చర్చలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన "ఊసరవెల్లి" వ్యాఖ్యలు సభలో చిచ్చు పెట్టాయి. జగన్‌ను 'పులివెందుల ఎమ్మెల్యే' అని సంబోధిస్తూ ఆయన చేసిన విమర్శలపై వైసీపీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. వైసీపీ పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సీఎం రమేశ్ ను కూడా వ్యక్తిగతంగా దూషించారు. బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి తమ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు.
అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో లోక్ సభ ఆమోదించింది. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సుమారు రెండు గంటలపాటు దీనిపై చర్చ జరిగింది. అనంతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్‌ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్‌ ప్రకటించారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది.
Read More
Next Story