
విశాఖపట్నానికి సమీపంలో ఓ హోటల్ పై పెట్టిన బోర్డు
ఆంధ్రా ఆతిథ్యానికి 'గ్యాస్' గండం: కుదేలవుతున్న హోటళ్ల రంగం!
ఏపీలో వంట బంద్! హోటల్ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న గ్యాస్ కొరత, ప్రభుత్వ దాడులు
ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్ హోటల్ రంగంపై పడింది. కమర్షియల్ గ్యాస్ కొరత ఆతిధ్య రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. చాలా హోటళ్లు ఇప్పటికే ఆహార పదార్థాల మెనూను కుదించగా మరికొన్ని ఏకంగా మూతపడుతున్నాయి. ఈ రంగంపై ఆధారపడి బతుకీడుస్తున్న లక్షలాది మంది చిగురుటాకుల్లా వణుకుకుతున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి ఆహార సరఫరా సంస్థల కార్మికులు (గిగ్ వర్కర్స్) ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల అన్వేషణలో పడ్డారు. గ్యాస్ కష్టాలు చాలవన్నట్టు జీఎస్టీ అధికారులు, తూనికలు కొలతల శాఖ దాడులు ఒకవైపు ఆదాయపన్ను శాఖ దాడులు మరొకవైపు హోటల్ రంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఏపీ ఆతిథ్య రంగ పరిస్థితి ఇదీ...
ఆంధ్రప్రదేశ్ లో సుమారు 5వేల వరకు రిజిస్టర్ అయిన హోటల్స్ ఉన్నట్టు అంచనా. అసంఘటిత రంగంలోని చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, లాడ్జీలు, వసతి గృహాలను కూడా కలిపితే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.
CEIC డేటా ప్రకారం రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో (స్టార్ హోటల్స్ నుంచి బడ్జెట్ హోటల్స్ వరకు) సుమారు 34,000 కు పైగా యూనిట్లు ఉన్నాయి. ఇందులో చిన్న స్థాయి భోజనశాలలు (మెస్) కూడా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్-2029' లక్ష్యంతో 2029 నాటికి అదనంగా 50,000 గదులను అందుబాటులోకి తెచ్చేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన దశలో ఈ యుద్ధం వచ్చి ఆతిధ్య రంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది.
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతంటే...
ఆంధ్రప్రదేశ్‌లో హోటల్, పర్యాటక రంగం (Hospitality Sector) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (GSDP) వాటా సుమారు 6% నుండి 7% వరకు ఉంటుంది.
2024-25 అంచనాల ప్రకారం రాష్ట్ర GSDP సుమారు ₹16 లక్షల కోట్లుగా ఉంటే, అందులో హోటల్, దాని అనుబంధ రంగాల వాటా దాదాపు ₹90,000 నుండి ₹1,00,000 కోట్లు (వ్యాపార టర్నోవర్ రూపంలో) ఉంటుందని అంచనా.
పైగా, ఇది ప్రభుత్వానికి నేరుగా వచ్చే ఆదాయం. GST, ఇతర పన్నుల రూపంలో ఉంటుంది. హోటల్ గదులు, ఆహార సేవలపై 5%, 12%, 18% GST వర్తిస్తుంది. రాష్ట్రం ఏటా పొందే మొత్తం GST వసూళ్లలో (సుమారు ₹30,000 - ₹35,000 కోట్లు) హోటల్ రంగం వాటాయే.
స్టార్ హోటల్లు, రెస్టారెంట్ బార్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఎక్సైజ్ సుంకం, లైసెన్స్ ఫీజులు అందుతాయి. హోటళ్ల అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, స్థానిక సంస్థల పన్నుల ద్వారా ఏటా వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరుతాయి.
ఆదాయంపై సంక్షోభ ప్రభావం..
ప్రస్తుతం హోటళ్లు ఎదుర్కొంటున్న గ్యాస్ కొరత, మూసివేత భయాల వల్ల ప్రభుత్వానికి చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉందని తిరుపతిలో హోటల్ నిర్వహిస్తున్న రామముని నాయుడు చెప్పారు. "హోటళ్లు మూతపడితే రోజువారీ లావాదేవీలు ఆగిపోయి, రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయం పడిపోతుంది. 5-6 లక్షల మందికి ఉపాధి ఇచ్చే ఈ రంగం దెబ్బతింటే, అది పరోక్షంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడినట్టే కదా" అని చెప్పారు.
గ్యాస్ సంక్షోభం ఎలా ఉందంటే..
యుద్ధం మొదలైనప్పటి నుంచి కమర్షియల్ గ్యాస్ కి ఇబ్బంది పడాల్సి వస్తోంది. గ్యాస్ కి ఇబ్బంది లేదని చెబుతున్నా కమర్షియల్ గ్యాస్ ఇవ్వడం లేదన్నది నిజం. దీనిపై ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. "హోటళ్లకు దాదాపు కమర్షియల్ గ్యాస్ బంద్ అయింది. పూర్తిగా గ్యాస్ బంద్ అయిందని ప్రభుత్వం ప్రకటించకపోయినా ఆచరణలో మాత్రం అదే జరుగుతోంది. ఏ డీలరు కూడా వ్యాపార అవసరాలకు గ్యాస్ ఇవ్వడం లేదు. దీంతో బ్లాక్ లో కొనుక్కోవాల్సి వస్తోంది. ఇదేదో చిన్న హోటళ్లకు సరిపోతుందేమో గాని పెద్ద వాటికి సరిపోదు. అందుకే త్వరలో ముఖ్యమంత్రిని కలిసి తమ కష్టాలను చెప్పాలనుకుంటున్నాం. పూర్తిగా బంద్ అయితే చాలా మంది నష్టపోవాల్సి ఉంటుంది" అన్నారు.
గ్యాస్, విద్యుత్ సంక్షోభం ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని వేలాది హోటళ్లపై పడుతుంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలు నిత్యం లక్షలాది మంది వచ్చిపోయే నగరాలు కావడంతో హోటళ్లు మూతపడితే వచ్చిపోయే వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే అనంతపురం, విశాఖ, అనకాపల్లి, కర్నూలు పరిసర ప్రాంతాలలో హోటళ్లు మూతపడినట్టు శ్రీనివాసరావు చెప్పారు.
లక్షలాది మంది ఉపాధిపై నీలినీడలు...
హోటళ్ల అసోసియేషన్ అంచనా ప్రకారం 5-6 లక్షల మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే చిన్న హోటళ్లే కాదు, పెద్ద హోటళ్లు కూడా మూసివేత దిశగా అడుగులు వేయక తప్పదు అని హోటల్ అసోసియేషన్ హెచ్చరించింది. హోటళ్లు మూతపడితే యజమానులే కాకుండా ఈ గిగ్ వర్కర్లు నష్టపోతారన్నది హోటల్స్ రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త కురాడి చంద్రశేఖర కల్కూర అభిప్రాయపడ్డారు. ఆతిథ్య రంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆయన కోరారు.
ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన మర్నాటి నుంచి కమర్షియల్ గ్యాస్ కష్టాలు ప్రారంభమైయ్యాయి. అప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైనా హోటళ్లు దృష్టి సారించాయి. అయితే అవి గిట్టుబాటు అయ్యేలా లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇండక్షన్ కుకింగ్ (విద్యుదయస్కాంత శక్తి) అనే ఆధునిక వంట పద్ధతిని ఉపయోగించమని చెబుతున్నా విద్యుత్ సంక్షోభం వస్తే ఏమిటనే దానికి సమాధానం లేదని విశాఖపట్నానికి చెందిన ఓ హోటల్ వ్యాపారి వాపోయారు.
"ఎలక్ట్రిక్ వినియోగం భారీగా ఉంటుంది. ఒకేసారి అందరూ ఈవైపు దృష్టి సారిస్తే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. అప్పుడు మళ్లీ విద్యుత్ కోతలు ఉంటాయి. ఉన్నట్టుండి విద్యుత్ పోతే ఆ వంటతో అన్నీ వేస్టే అవుతాయి" అని జి.శ్రీనివాసరావు చెప్పారు. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా విద్యుత్ పొయ్యిలను వాడదామన్నా, వేసవి కారణంగా విద్యుత్ కోతలు పెరిగే అవకాశం ఉండటంతో అది సాధ్యపడటం లేదు.
ఒంగోలులో అత్యవసర సమావేశం ఎందుకు?
ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడానికి మార్చి 25న ఒంగోలులో రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్విగ్గీ, జొమాటా వంటి సంస్థలు వసూలు చేస్తున్న కమీషన్లపైనా, ప్రభుత్వం గ్యాస్ సరఫరాను పునరుద్ధరణపైన, వివిధ శాఖల దాడులపైనా చర్చించనున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు చెప్పారు.
ప్రస్తుతం ఆతిథ్య రంగం ఎదుర్కొంటున్న ఈ పెను సవాలును ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో మున్ముందుగాని తేలదు.
Next Story

