విజయసాయి ఆరోజైనా బిగ్ బాస్ గుట్టువిప్పుతారా?
x
విజయసాయి రెడ్డి (ఫైల్)

విజయసాయి ఆరోజైనా 'బిగ్ బాస్' గుట్టువిప్పుతారా?

విజిల్ బ్లోయర్ ను విచారణకు రమ్మన్న ఈడీ


వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు చెబుతున్న మద్యం కుంభకోణం (AP Liquor Scam) ఉచ్చు ఇప్పుడు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి గట్టిగా బిగుస్తోంది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
మనీ లాండరింగ్ కోణంలో లోతైన దర్యాప్తు
2019 నుంచి 2024 మధ్య ఏపీలో అమలు చేసిన మద్యం విధానంలో భారీగా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గట్టిగా అనుమానిస్తోంది. మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి ముడుపులు స్వీకరించి, ఆ సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు మళ్లించినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ బృందం (SIT) సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ తన తదుపరి కార్యాచరణను సిద్ధం చేసింది.
విజిల్‌ బ్లోయర్‌ను అన్నవారే.. ఇప్పుడు హాట్‌సీట్‌లోకి!
విజయసాయి రెడ్డి ఈ కేసు విషయంలో గతంలో విభిన్నమైన పాత్ర పోషించారు. గతేడాది ఏప్రిల్‌లో ఆయన స్పందిస్తూ.. "ఈ స్కామ్‌లో నా పాత్ర కేవలం విజిల్‌ బ్లోయర్‌గానే" అని పేర్కొన్నారు. అంతేకాదు, తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, దొంగలను పట్టుకోవడానికి సహకరిస్తానని 'ఎక్స్‌' వేదికగా సవాల్ చేశారు.
వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన స్వరం మార్చారు. మద్యం సొమ్ము ఎక్కడికి చేరిందో 'బిగ్ బాస్' (జగన్)కే తెలుసని వ్యాఖ్యానిస్తూ సంచలనం సృష్టించారు. ఈ కుంభకోణానికి మాస్టర్‌మైండ్ రాజ్ కసిరెడ్డి అని, అతనే మొత్తం వ్యవహారం నడిపించాడని గతంలో సిట్ విచారణలో విజయసాయిరెడ్డి వెల్లడించారు.
22న ఏం జరగబోతోంది?
ఇప్పటికే సాక్షిగా సిట్ విచారణ ఎదుర్కొన్న విజయసాయి రెడ్డి, ఇప్పుడు ఈడీ ముందు నిందితుడిగా లేదా కీలక వ్యక్తిగా హాజరుకానుండటం రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. వైసీపీ నెంబర్ 2 నాయకుడిగా కొనసాగిన ఆయనకు ఈడీ నోటీసులు అందడం చూస్తుంటే, మద్యం ఉచ్చు ఆయనను వదిలేలా కనిపించడం లేదు.
Read More
Next Story