
అమరావతి ఓఆర్‌ఆర్‌కు భూసేకరణ షురూ
ఓఆర్‌ఆర్ భూసేకరణ ప్రక్రయ ముమ్మరమైంది. మూడు జిల్లాల్లో 4,870 హెక్టార్ల సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక 'అవుటర్ రింగ్ రోడ్డు' (ORR) కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కేంద్ర రహదారి, రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో, ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ గెజిట్‌ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 4,870.89 హెక్టార్ల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్టీఆర్ జిల్లాలో 1,416 హెక్టార్లు
ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం మండలాల పరిధిలో 1,416.31 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. 18 గ్రామాల పరిధిలోని 1,798 సర్వే నంబర్లలో ఈ భూమి విస్తరించి ఉంది. భూమి యజమానులు ఎవరైనా తమ అభ్యంతరాలను, సూచనలను 21 రోజుల్లోపు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా అందజేయాలని అధికారులు సూచించారు. ఈ గడువు ముగిసిన తర్వాత నేషనల్ హైవేస్ యాక్ట్ 1956 సెక్షన్ 3(2) ప్రకారం తుది ఉత్తర్వులు జారీ చేస్తారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇలా..
ఇప్పటికే డిసెంబరు 8న గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
గుంటూరు జిల్లా: మంగళగిరి, తాడికొండ, మేడికొండూరు, కొల్లిపర, తెనాలి, వట్టిచెరుకూరు సహా పలు మండలాల్లో 4,763 సర్వే నంబర్ల పరిధిలో 2,342.87 హెక్టార్ల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు.
కృష్ణా జిల్లా: బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లో 2,002 సర్వే నంబర్ల నుంచి 1,111.71 హెక్టార్లను సేకరించనున్నారు.
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాజధాని అమరావతికి మెరుగైన రవాణా సౌకర్యాలు కలగడమే కాకుండా, పరివాహక ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Next Story

