అమరావతిలో పిడుగు..వ్యక్తి మృతి
x

అమరావతిలో పిడుగు..వ్యక్తి మృతి

ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా ప్రకోపించింది. భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు వాన చినుకులు ఉపశమనాన్ని ఇస్తాయని భావిస్తే, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన మృత్యుపాశమై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జనజీవనం అతలాకుతలం కాగా, రాజధాని అమరావతిలో పిడుగుపాటుకు ఓ విద్యార్థి తండ్రి బలికావడం విషాదం నింపింది. అటు ఏలూరులో నివాస గృహాలపై పిడుగులు పడి ఆస్తి నష్టం సంభవించగా, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సానికి జనజీవనం స్తంభించిపోయింది. ప్రకృతి కన్నెర్ర చేసిన ఈ వేళ, మరికొన్ని గంటల పాటు పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలు ప్రజలను వణికిస్తున్నాయి.

అమరావతిలో విషాదం.. ఏలూరులో ఆస్తి నష్టం

రాజధాని ప్రాంతం అమరావతిలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని నింపింది. తుళ్లూరులోని మేరీ మాత హై స్కూల్ సమీపంలో పిడుగు పడటంతో ఓ విద్యార్థి తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, ఏలూరు జిల్లా నూజివీడులో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడింది. ఇక్కడ ఒక ఇంటిపై పిడుగు పడటంతో టెర్రస్ పై ఉన్న పిట్టగోడ పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.
విజయవాడ పరిసరాల్లో వాన
కృష్ణా , ఎన్టీఆర్ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. విజయవాడ నగరంతో పాటు ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది.
రాగల 3 గంటల హెచ్చరిక - విపత్తుల శాఖ అప్రమత్తం
వాతావరణ శాఖ, ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాగల మూడు గంటల పాటు రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడవచ్చు. పిడుగులు పడే సమయంలో ప్రజలు బయటకు రావొద్దు. పొలాల్లో ఉండేవారు, ప్రయాణికులు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల కింద గానీ నిలబడకూడదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
Read More
Next Story