ప్రాణాలు తీస్తున్న పిడుగులు
x

ప్రాణాలు తీస్తున్న పిడుగులు

ఏపీలో ప్రకృతి ప్రకోపానికి ఎనిమిది మంది బలి.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వాతావరణం ఒక్కసారిగా బీభత్సంగా మారింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిన సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదాల్లో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతులలో పొలాల్లో పని చేసుకునే రైతు కూలీలు, పశువుల వ్యాపారులు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పిడుగుల ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరణ మృదంగం
పిడుగుల ధాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఇక్కడ ఒక్క రోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు.
వలస కార్మికులపై పిడుగు: పుల్లలచెరువు మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడటంతో బీహార్‌కు చెందిన కన్నయ్య (18) మృతి చెందగా, ఆయనతో పాటు ఉన్న మరో ఐదుగురు బీహార్ వాసులు తీవ్రంగా గాయపడ్డారు. కనిగిరి సమీపంలో జరిగిన మరో ఘటనలో దుర్గేష్‌కుమార్ (24) అనే బీహార్ కార్మికుడు పిడుగుపాటుకు గురై మరణించాడు.
పొలాల్లో పని చేస్తూ.. పుల్లలచెరువు మండలం యండ్రపల్లి వద్ద మొక్కజొన్న తోటలో పని చేస్తున్న రైతు కూలీ బొందలపాటి నాగయ్య (60), ముండ్లమూరు మండలం వేములబండ పొలాల్లో రావులపల్లి శివకృష్ణ (19), దర్శి మండలం శామంతపూడిలో పశువుల మేత కోసం వెళ్లిన ఆవుల మల్లికార్జునరావు (26) పిడుగులు పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
వ్యాపారి మృతి: పల్నాడు జిల్లాకు చెందిన పశువుల వ్యాపారి మడతల శ్రీనివాసరెడ్డి (37) వ్యాపార నిమిత్తం పుల్లలచెరువు మండలానికి రాగా, పిడుగు ఆయన ప్రాణాలను బలితీసుకుంది.
మన్యం జిల్లాలో ఇద్దరు కూలీల దుర్మరణం
పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పిడుగుల బీభత్సం కొనసాగింది. బలిజిపేట మండలంలోని పొలాల్లో పని చేస్తున్న సమయంలో పిడుగులు పడటంతో వి.పార్వతి (40), డి.సింహాచలం (38) అనే ఇద్దరు కూలీలు మరణించారు. ఇదే ఘటనలో గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రజలకు హెచ్చరిక
రాష్ట్రంలో నెలకొన్న అస్థిర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ కోరుతోంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పొలాల్లో ఉండటం, చెట్ల కింద తలదాచుకోవడం వంటివి చేయరాదని, సురక్షితమైన భవనాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More
Next Story