
నీరు లేని జీవనం: ఒక గ్రామ జ్ఞాపకం...
ఈ రోజు ప్రపంచం మొత్తం “నీరు జీవనాధారం” అని గుర్తు చేసుకుంటుంది. కానీ ఆ గుర్తు చేసుకోవడం కూడా ఎంతో కష్టంగా మారింది. ఎందుకంటే… నీరు ఇప్పుడు కొనాల్సి వస్తోంది.
ఒకప్పుడు అంటే నాకు 12 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు (ప్రస్తుతం నా వయసు 56 సంవత్సరాలు) గ్రామంలో మంచి నీళ్లు కొనాల్సి వస్తుందని ఊహలో కూడా లేదు. ప్రతి ఊరి పక్కనే వాగు, వంక, చెరువు ఉండేవి. వర్షాకాలం వచ్చేసరికి మూడు నుంచి ఐదు రోజుల పాటు “ముసురు” పట్టి వర్షం కురిసేది. ఎడతెరిపి లేకుండా, నిరంతరం. ఆ వర్షపు నీరు వాగుల్లోకి పారి, గ్రామం చుట్టుపక్కల అంతా నిండిపోయేది.
ఊరిపేరు రాచకొండ. ప్రస్తుతం మార్కాపురం జిల్లాలోని పుల్లలచెరువు మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ. ఈ ఊరికి చుట్టూ కొండలు, వాగులు, వంకలు, చెరువులు, పశువుల బీళ్లు ఉన్నాయి. నిత్యం గ్రామ పరిసరాలు పచ్చగా ఉంటాయి. ఊరి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలన్నీ పంట భూములు. గ్రామంలో సుమారు వంద కుటుంబాలు ఉంటే అందులో సగం కుటుంబాల వారు వ్యవసాయం చేస్తారు. మిగిలిన 40 కుటుంబాల వారు వ్యవసాయ కూలీలుగా జీవితం సాగిస్తారు. మరో పది కుటుంబాల వారు మేకలు, గొర్రెలు కాచి జీవిస్తారు.
నాటి జ్జాపకాల బావి
గ్రామంలో నుంచి తూర్పు వైపు నరసింహస్వామి కొండ, దక్షిణం వైపు ఊరకొండ, పడమరవైపు పెద్దకొండ, దయ్యాగల గొంది. అలాగే ఏసయ్య కొండ, ఉత్తరాన వెంకటరెడ్డి పల్లె గ్రామం.
గ్రామంలో పశు సంపద ఎక్కువ. రైతు కుటుంబంలో కనీసం రెండు గేదెలు, రెండు ఎద్దులు, ఎద్దుల బండి తప్పకుండా ఉండేవి. పశువులకు ప్రత్యేక బీళ్లు కూడా ఉండేవి. మధ్యాహ్నం వేసవిలో గ్రామస్తులంతా వాగులు, బావుల్లో ఈత కొట్టేవారు. మేకలు, గొర్రెలు మేపే కాపరులు వాగులోనే స్నానం చేస్తూ కనిపించేవారు. గేదెలను కూడా నీటిలోకి తోసి, అవి మునగి సేదతీరేవి. నీరు… సులభం. స్వేచ్ఛ. జీవితం.
పడమట నల్లమల అడవుల నుంచి వచ్చే వాగులు రాచకొండను ఆనుకుని పారుతూ కొత్త చెరువుకు చేరుకుంటాయి. ఈ చెరువు కింద వేల ఎకరాల మాగాణి భూములు ఉన్నాయి. ఊరిని ఆనుకుని ఉన్న వడ్డోడి గుట్ట పశువుల బీడుగా ఉంటుంది. దానిని ఆనుకుని బురకారెడ్డి చెరువు నిత్యం నీటితో తొణికిస లాడుతుంది. ఆ చెరువును ఆనుకుని రేగు చెలకలు (కేవలం రేగు చెట్లు పెరిగిన భూమి) వేల ఎకరాలు ఉండేవి. అవన్నీ ప్రభుత్వ భూములే.
ఈ భూములు పచ్చని చెట్లు, వాగుల్లో నిత్యం పారే నీరు గ్రామంలో సందడిగా ఉండే జనం. పొలాలకు వెళుతూ ఎక్కడ కావాలంటే అక్కడ దోసిళ్లతో తాగే నీరు. వాగులు, బావుల నుంచి బిందెలతో ముంచుకుని తీసుకునే మంచినీరు. ఏ కొరతా లేని సస్యశ్యామల గ్రామం.
ఇప్పుడు?
వాగులు పూర్తిగా ఎండిపోయాయి. వంకలు మాయమయ్యాయి. భూగర్భజలం అడుగంటింది. వెయ్యి అడుగుల లోతు బోరు బావులు తవ్వినా నీరు రావడం లేదు. పచ్చని పొలాలు కనిపించడం లేదు. పొలం గట్లపై కూడా ఒక్క పచ్చని గడ్డి మొలక కనిపించడం లేదు. పశువుల బీళ్లు మాయమయ్యాయి. గేదెలు, ఎద్దులు, మేకలు… అన్నీ నశించాయి.
ఇప్పుడు తాగునీరు బాటిళ్లకు పరిమితమైంది. బోరు నీటిని శుద్ధి చేసి, ఏదో కలిపి, పది రూపాయల నుంచి వేల రూపాయల వరకు అమ్ముతున్నారు. ఆ నీరు మనిషి ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితమో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. కొనకుండా మంచి నీరు దొరకడం లేదు.
ఇది ఒక వ్యక్తి జ్ఞాపకం కాదు. ఇది లక్షలాది గ్రామాల కథ.
పర్యావరణం దెబ్బతినడం, వర్షాలు తగ్గడం, అడవులు నరికివేయడం, అక్రమ బోర్లు తవ్వడం… ఇవన్నీ కలిసి మన జీవనాధారాన్ని కొనుగోలు చేయాల్సిన స్థితికి తీసుకెళ్లాయి.
ప్రపంచ నీటి దినోత్సవం ఈ సందర్భంగా మనకు ఒక్కటే ప్రశ్న.
‘‘మనం ఇంకా ఎంతకాలం నీటిని కొనుగోలు చేసి తాగాలి? లేదా… దాన్ని కాపాడుకోవాలా?’’
నీరు లేనిది జీవితం లేదు
ఆ జీవితాన్ని మళ్లీ తిరిగి పొందాలంటే… ఈ ఒక్క రోజు కాదు, ప్రతి రోజూ నీటిని గౌరవించాలి. వాగుల్ని కాపాడాలి. చెరువుల్ని తీర్చిదిద్దాలి. అడవుల్ని పెంచాలి. భూగర్భజలాన్ని దోచుకోకూడదు.
ఎందుకంటే…
చిన్నతనంలో వాగులో ఈత కొట్టిన ఆ పిల్లలు ఇప్పుడు బాటిల్ నీరు కొనుక్కుని తాగుతున్నారు.
ఆ పిల్లల పిల్లలు కూడా అదే బాటిల్‌ను చూసి పెరగకూడదు.
నీరు… కేవలం తాగడానికి మాత్రమే కాదు.
అది జ్ఞాపకాలు. అది జీవితం. అది మన భవిష్యత్తు.
ఈ ప్రపంచ నీటి దినోత్సవం… ఆ జ్ఞాపకాన్ని మళ్లీ సజీవంగా చేసి, మన చేతుల్లో ఉన్న నీటిని కాపాడుకోవాలని హెచ్చరిస్తోంది.

