
‘వైఎస్సార్‌సీపీ కార్యాలయాల’ చుట్టూ న్యాయ యుద్ధం
కోర్టు ఆదేశాలంటే నవ్వులాట అనుకుంటున్నారా? అని మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భవనాల చుట్టూ సాగుతున్న వివాదం ఇప్పుడు న్యాయస్థానాల్లో యుద్ధంగా మారింది. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధమవగా, అడుగడుగునా న్యాయస్థానం జోక్యంతో ఈ ప్రక్రియ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తాజాగా మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అధికారుల కక్షపూరిత ధోరణిని సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు మచిలీపట్నంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) ఇవ్వడంలో జాప్యం చేయడంపై తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, పదే పదే నోటీసులు ఇస్తూ కాలయాపన చేయడంపై జస్టిస్ నూనెపల్లి హరినాథ్ అసహనం వ్యక్తం చేశారు. "అధికారులు తాము కోర్టుల కంటే పైన ఉన్నామని అనుకుంటున్నారా?" అని ప్రశ్నిస్తూ, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించారు. దీనిపై వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.

