కర్నూలు, కృష్ణా జిల్లాల VAAలకు తాజా బదిలీలు!
x

కర్నూలు, కృష్ణా జిల్లాల VAAలకు తాజా బదిలీలు!

ఏపీ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ల (VAAలు) బదిలీల విషయంలో హైకోర్టు జోక్యం తర్వాత తాజా మలుపు!


హైకోర్ట్ డివిజన్ బెంచ్ 2026 జనవరి 31న ఇచ్చిన కీలక తీర్పు అమలు చేయకుండా ప్రభుత్వం నెలన్నరకాలం కాలయాపన చేసింది. చివరకు మార్చి 20న G.O.RT.No.6 జారీ చేసింది. ఇందులో కృష్ణా జిల్లాలో 103 మంది, కర్నూలు జిల్లాలో 106 మంది VAAలకు మాత్రమే తాజా కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. గత సంవత్సరం జూన్ లో జరిగిన బదిలీల్లో అవకతవకలు జరిగాయంటూ కర్నూలు, కృష్ణా జిల్లాలకు చెందిన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కోర్టును ఆశ్రయించారు. తీర్పు రావడానికి ఏడు నెలల కాలం పట్టింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసే ప్రక్రియకు నెలా 20 రోజులు పట్టింది. మరో తొమ్మిది రోజుల్లో ఈ జిల్లాల్లో బదిలీల ప్రక్రియ జరగాల్సి ఉంది. దీనంతటికీ నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహించకపోవడం.

హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో కోర్టు స్పష్టంగా ఏమన్నది?

1. వాదులు, అప్పీల్ దాఖలుచేసినవారు గతంలో సమర్పించిన రాతపూర్వక ఎంపికల (ఆప్షన్స్) ఆధారంగానే బదిలీలు జరపాలి.

2. ఇప్పటికే జాయిన్ అయినవారు అదే స్థానంలో కొనసాగాలి.

3. బదిలీలు G.O.Ms.No.5 (తేదీ: 12.06.2025) ప్రకారం క్యాండిడేట్ వారీగా కారణాలు ఇచ్చి అమలు చేయాలి.

4. ఎంపికలు తప్పనిసరి కావు... కానీ సీనియారిటీ, ప్రాధాన్యతలు పరిగణించాలి.

5. మార్చి 2026లోపు పూర్తి చేయాలి.

ఇంతకీ G.O.Ms.No.5లో ఏముంది?

ఈ జీవోలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ల రేషనలైజేషన్, క్యాటగిరైజేషన్, బదిలీలు-పోస్టింగ్‌లకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఉన్నాయి. సీనియారిటీ ప్రకారం ప్రచురించిన లిస్ట్, ఉద్యోగులు ఇచ్చిన ఎంపికలు, ప్రాధాన్యతలు, గ్రామాల్లో అవసరం ఆధారంగా బదిలీలు జరపాలని స్పష్టమైన నియమాలు పేర్కొన్నాయి. దూర ప్రాంతాలకు బదిలీ చేసేటప్పుడు కూడా ఉద్యోగి ఎంపికను పరిగణించాలని ఉంది.

ఉద్యోగులు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?

స్వర్ణ గ్రామాలు, వార్డుల శాఖ మొదటి రౌండ్ బదిలీల్లో (2025 మే-జూన్) G.O.Ms.No.4, G.O.Ms.No.5 మార్గదర్శకాలను పాటించలేదు. సీనియారిటీ లిస్ట్ ప్రకారం ఉద్యోగులు ఇచ్చిన ఎంపికలు, ప్రాధాన్యతలు పట్టించుకోకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఇది ఉద్యోగుల మధ్య అసంతృప్తి, అన్యాయం భావనను కలిగించింది. దీంతో కర్నూలు జిల్లాకు చెందిన 59 మంది, కృష్ణా జిల్లాకు చెందిన 19 మంది హైకోర్టును ఆశ్రయించడానికి దారి తీసింది. అంటే శాఖ సొంతంగా ప్రక్రియను పారదర్శకంగా, నియమబద్ధంగా నిర్వహించకపోవడమే కోర్టు కేసులకు మూలకారణం.

ఇప్పుడు బదిలీలపై ఉన్న బ్యాన్ (06.07.2025 నుంచి) మధ్యనే కోర్టు ఆదేశాల మేరకు మినహాయింపు ఇచ్చి, డైరెక్టర్ SGSW కౌన్సెలింగ్ షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కర్నూల్, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, SGSW డైరెక్టర్ ఈ ప్రక్రియను మార్చి చివరిలోపు పూర్తి చేయాలి.

ఈ నిర్ణయం వల్ల కోర్టును ఆశ్రయించిన VAAలకు న్యాయం జరుగుతుందని, గ్రామీణ వ్యవసాయ సేవలు సజావుగా సాగుతాయని అధికారులు ఆశా భావం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఇప్పుడు కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురు చూస్తున్నారు.

Read More
Next Story