
స్పీడ్ లేజర్ గన్స్‌ను ఆవిష్కరిస్తున్న విశాఖ సీపీ బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ గార్గ్‌లు
వైజాగ్ రైడర్ల వెన్నులో లేజర్ గన్స్ వణుకు!
విశాఖలో వాహన చోదకుల దూకుడుకు స్పీడ్ లేజర్ గన్స్‌తో పోలీసులు చెక్ పెడుతున్నారు.
వైజాగ్‌లో రైడర్లు ఇకపై ఇష్టానుసారం దూసుకు పోతామంటే కుదరదు. రోడ్లపై కాచుకు కూర్చున్న స్పీడ్ లేజర్ గన్‌లు వారిని చూస్తూ ఊరుకోవు. మునుపటిలా పరిమిత వేగానికి మించి ప్రయాణిస్తే ఆ వాహనాలకు క్షణాల్లో ఈ–చలాన్లను జారీ చేస్తాయి. ఆ వాహన యజమానికి చేతి చమురును వదిలిస్తాయి. వాహనాల వేగానికి కళ్లెం వేయడానికి విశాఖ పోలీసులు సరికొత్తగా అత్యాధునిక స్పీడ్ లేజర్ గన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఈ గన్స్ పనితీరు గురించి తెలిసిన వాహన చోదకుల వెన్నులో వణుకు పుడుతోంది.
స్పీడ్ గన్స్‌పై వాహన చోదకులకు అవగాహనకు ఏర్పాటు చేసిన బోర్డు
సీఎస్సార్ నిధులతో స్పీడ్ లేజర్ గన్‌లు..
విశాఖ నగరంలో వాహనాలను దూకుడుగా నడిపే వారి సంఖ్య ఎక్కువే. ఇలా అతి వేగంగా నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడి ఏటా పలువురు చనిపోతున్నారు. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. సంబంధిత కుటుంంబీకులకు తీరని క్షోభను మిగిలిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహన చోదకులకు షాక్ ఇవ్వాలని, తద్వారా రోడ్డు ప్రమాదాలను, మరణాలను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించారు. ఇందుకోసం అత్యాధునిక స్పీడ్ లేజర్ గన్‌లను ప్రవేశపెట్టాలని సంకల్పించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (సీఎస్సార్) నిధులతో స్పీడ్ లేజర్ గన్‌లను సమకూర్చాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా సౌత్ ఏషియన్ ఎల్పీజీ అనే సంస్థ సీఎస్సార్ నిధులతో తొలుత రెండు స్పీడ్ లేజర్ గన్స్‌ను ఒక్కొక్కటి రూ.18 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. వీటిని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.. విశాఖ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) శంఖబ్రత బాగ్చీకి అందజేశారు. త్వరలో మరో స్పీడ్ లేజర్ గన్‌ను అందుబాటులోకి తేనున్నారు.
స్పీడ్ గన్స్ ఎక్కడున్నాయంటే?..
ఈ స్పీడ్ లేజర్ గన్స్‌ను నగరంలోని బీచ్ రోడ్డులోనూ, జాతీయ రహదారిపైన ట్రాఫిక రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నగరంలోని సిరిపురం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఉంచి పోలీస్ సిబ్బందికి తర్ఫీదునిస్తున్నారు. ఇవి రేయింబవళ్లు పని చేస్తాయి.
స్పీడ్ గన్స్ నుంచి తప్పించుకోలేరు..
వాహనాల వేగాన్ని స్పీడ్ లేజర్ గన్స్ రికార్డు చేస్తాయి. కచ్చితత్వంతో ఇవి పని చేస్తాయి. అందువల్ల వీటి నుంచి వాహన చోదకులు ఏ మాత్రం తప్పించుకోలేరు. ఈ లేజర్ గన్లను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) సర్వర్లతో అనుసంధానించారు. దీంతో ఏఐ సాంకేతికత ఆధారంగా వాహనాలు నిబంధనలను అతిక్రమించగానే రియల్ టైంలో డేటా ప్రాసెస్ చేయబడుతుంది. సెకనుకు వందలాది ఇన్ఫ్రారెడ్ కాంతి కిరణాలను పంపుతుంది. దీనివల్ల పోలీసులు వాహనాలను రోడ్డుపై ఆపాల్సిన అవసరం లేకుండానే కాంటాక్టు లెస్ పద్ధతిలో నేరుగా వాహన యజమాని ఫోన్లకు ఈ చలాన్లు వెళ్తాయి.
లేజర్ గన్స్‌తో బహుళ సేవలు..
ఈ స్పీడ్ లేజర్ గన్స్ వాహన వేగాన్ని రికార్డు చేయడమే కాదు.. రోడ్డు ప్రమాదాలను నియంత్రణ, రద్దీ ప్రాంతాఓ్ల ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించడం లోనూ సహాయ పడతాయి. ఇవి 100 మీటర్ల దూరం నుంచే వాహన వేగాన్ని రికార్డు చేస్తాయి. ఇంకా ట్రిపుల్ రైడింగ్‌ను, హెల్మెట్ లేకుండా వెళ్లే వారిని, రాంగ్ రూట్‌లో ప్రయాణించే వారిని గుర్తిస్తాయి. ఇవి విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు పని భారాన్ని తగ్గిస్తాయి.
నగరంలో వేగం 40 కి.మీలు దాటితే ఫైన్..
విశాఖ నగరంలో వాహన వేగం గంటకు 40 కి.మీలు దాటితే ఇకపై ఆ వాహన యజమాని జరిమానా చెల్లించాల్సిందే. నగర పరిధిలో ఏ ప్రాంతంలో ఎంత వేగంతో ప్రయాణించాలో పోలీసులు తాజాగా నిబంధనలను నిర్దేశించారు. దాని ప్రకారం.. కూర్మన్నపాలెం నుంచి కొమ్మాది వరకు వాహనాలు 40 కి.మీలు, కొమ్మాది నుంచి రాజాపులోవ వరకు 50 కి.మీలు, పినగాడి నుంచి పెందుర్తి వరకు (హైవే బైపాస్) 60 కి.మీలు, ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్డులో 40 కి.మీలు, అన్ని బీఆర్‌టీఎస్ రోడ్లపై 40 కి.మీలు, పెందుర్తి నుంచి బాజీ జంక్షన్ వరకు 50 కి.మీలు, మున్సిపల్ రోడ్లపై గంటకు 40 కి.మీల వేగ పరిమితిని విధించారు. నిర్దేశిత వేగానికి మించి వెళ్తే లేజర్ గన్స్ ద్వారా గుర్తించి రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపితే రూ.1500, ద్విచక్ర వాహనంపై పిలియన్ రైడర్ (వెనక కూర్చున్న వ్యక్తి)కు హల్మెట్ లేకుంటే రూ.వెయ్యి, ట్రిపుల్ రైడింకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామని పోలీస్ కమిషనర్ బాగ్చీ స్పష్టం చేశారు. పలుమార్లు ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు రవాణా శాఖ అధికారులకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.
వాహన చోదకుల వెన్నులో వణుకు..
పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్పీడ్ లేజర్ గన్స్‌ను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వేగ పరిమితిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నగర పరిధిలో 40 కి.మీల వేగాన్ని మించకూడదన్న నిబంధన సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొమ్మాది నుంచి కూర్మన్నపాలెం వరకు 40 కి.మీల దూరం ఉంటుంది. ఇదంతా హైవేపైనే ఉంటుంది. ఈ రూట్లో కూడా స్పీడ్ గన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సిగ్నల్స్ వద ట్రాఫిక్ క్లియరయ్యాక వాహనాలు ఒకింత వేగంగా ముందుకెళ్తాయి. అలా వెళ్తే కచ్చితంగా స్పీడ్ గన్ కంట్లో పడతాయి. వెనువెంటనే ఆటోమేటిక్‌గా ఈ–చలాన్లు జారీ అవుతాయి. ఇలా నిత్యం రాకపోకలు సాగించే వారు పలుమార్లు చలాన్ల సొమ్ము చెల్లించుకోవలసి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరంలో వేగ పరిమితిపై వెసులుబాటు కల్పించాలన్న డిమాండ్ వాహనదారుల నుంచి వినిపిస్తోంది. మరోవైపు స్పీడ్ గన్స్‌తో ఎడా పెడా విధించే చలాన్లతో పభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది.
Next Story

