ఆర్జేడీ లాలూకు సుప్రీంలో షాక్..
x

ఆర్జేడీ లాలూకు సుప్రీంలో షాక్..

ఉద్యోగాల కోసం భూమి కేసు (Land for job)లో CBI FIRను రద్దు చేయాలన్న లాలూ అభ్యర్థనను తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం..


Click the Play button to hear this message in audio format

ఉద్యోగాల కోసం భూమి కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ (Lalu Prasad Yadav)కు సుప్రీంకోర్టులో పెద్ద షాక్ తగిలింది. ఆయన, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.

అయితే, 77 ఏళ్ల బీహార్ మాజీ ముఖ్యమంత్రికి కొంత ఉపశమనం లభించింది. విచారణ సమయంలో ట్రయల్ కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని కోర్టు మినహాయింపు ఇచ్చింది.

జస్టిస్‌లు ఎం.ఎం. సుందరేష్, ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో మరో కీలక అంశాన్ని కూడా అనుమతించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తింపు అంశాన్ని ట్రయల్ కోర్టు ముందు లేవనెత్తేందుకు యాదవ్‌కు అవకాశం కల్పించింది.

ఇదే కేసులో ముందుగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కూడా మార్చి 24న యాదవ్ అభ్యర్థనను తిరస్కరించింది. సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతి తీసుకోలేదనే కారణంతో సీబీఐ చర్య చెల్లదని చేసిన వాదనను హైకోర్టు అంగీకరించలేదు.

ఇంతకూ కేసేమిటి?

ఈ ‘ఉద్యోగాల కోసం భూమి’ కేసు 2004–2009 మధ్యకాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న వెస్ట్ సెంట్రల్ జోన్‌లో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నది సీబీఐ ఆరోపణ. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు లేదా వారి కుటుంబ సభ్యులు లాలూ కుటుంబ సభ్యులకు బహుమతిగా భూములను బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి.

లాలూ వాదన ఏంటంటే..

లాలూ తరఫున న్యాయవాదులు కీలకంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగిపై దర్యాప్తు ప్రారంభించడానికి ముందు సంబంధిత అధికారుల అనుమతి అవసరం. అయితే ఈ అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తు ప్రారంభించినందున ఎఫ్‌ఐఆర్ చెల్లదని, దర్యాప్తు చట్టబద్ధం కాదని, ఛార్జ్‌షీట్లు కూడా రద్దు చేయాలని యాదవ్ వాదించారు.

సుప్రీం నిర్ణయం..

సుప్రీంకోర్టు ఈ వాదనలను పూర్తిగా అంగీకరించలేదు. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. అయితే, సెక్షన్ 17A అంశాన్ని ట్రయల్ కోర్టు ముందు లేవనెత్తే హక్కును ఇచ్చింది. దీంతో కేసు విచారణ కొనసాగనుంది. అదే సమయంలో, లాలూ యాదవ్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందడం ఆయనకు కొంత ఊరటగా భావిస్తున్నారు.

ఈ కేసు బీహార్ రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More
Next Story