కర్నూల్లో 7,8 తేదీల్లో ద్రావిడ సమాజ సాహిత్యాల సదస్సు
x

కర్నూల్లో 7,8 తేదీల్లో ద్రావిడ సమాజ సాహిత్యాల సదస్సు

ప్రరవే ఎనిమిదవ మహాసభలు


ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పదిహేడేళ్ల (ప్రరవే) ఎనిమిదవ మహాసభల సందర్భంగా ద్రావిడ సమాజ సాహిత్యాలు సారూప్యత,ఐక్యత, పోరాటం పేరుతో రెండు రోజులు పాటు సదస్సులు నిర్వహిస్తున్నారు.

కర్నూలు లోని కెవిఆర్ కళాశాలలో అనిశెట్టి రజిత ప్రాంగణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రరవే ప్రకటించింది. ప్రరవే నాయకులు డాక్టర్ జి. అరుణ మాట్లాడుతూ భాషాపరమైన ద్రావిడ పదం తమిళనాట 20వ శతాబ్ది ప్రారంభంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థకు బ్రాహ్మణాధిక్యతకు, ఉత్తరభారత ఆధిక్యతకు వ్యతిరేకంగా భాషాసాంస్కృతిక అస్తిత్వఆకాంక్షలను, ఆత్మగౌరవ ఆరాటాలను, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ప్రజాస్వామిక విలువలను ముందుకు తెచ్చిన ఉద్యమానికి పేరైందని అన్నారు. ద్రావిడ పదం ప్రభావాలను, అధికారాలను ప్రతిఘటించే అర్థవిస్తృతిని పొందిందన్నారు.

విరసం రాష్ట్ర నాయకులు పాణి మాట్లాడుతూ చరిత్ర కొనసాగింపుగా వర్తమాన ఫాసిస్ట్ సందర్భాన్ని ఎదుర్కోగల నైతిక ధైర్యాన్నిచ్చే లౌకిక ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రోది చేసుకొనటం లక్ష్యంగా ఈసారి మహాసభలకు ద్రావిడ సాహిత్యం ఎన్నుకోవడం అరుదైన, అవసరమైన విషయమని అన్నారు

ద్రావిడ భాషల సామాజిక సాహిత్య పరిణామాల చరిత్రలో సారూప్యతను అంచనా వేయటం ద్వారా వర్తమానంలో ఐక్యతకు ఉన్న అవకాశాలను నిర్ధారించటం, ప్రభుత్వ భాషా విధానాలు, ప్రయోగాలు బహుళ జాతుల భాషా స్వయంప్రతిపత్తికి అవరోధం అవుతున్న తీరును చర్చలోకి తీసుకురావటం, ప్రతిఘటించే ప్రక్రియల గురించి ఆలోచన రేకెత్తించటం వంటివి సదస్సు లక్ష్యాలుగా ఉండడం గొప్ప పరిణామమని అన్నారు.

ద్రావిడ భావజాలం అంటే ఏమిటో నిర్ధారించుకొనటం అవసరం అన్నారు. ఇనాయతుల్లా మాట్లాడుతూ ద్రవిడ తత్వాన్ని విశాలార్ధంలో నిర్వచించటం, వివరించటం ఈ సదస్సులో చర్చకు రావలసిన ప్రశ్నలు కొన్ని అని, ద్రావిడ భాషా కుటుంబంలో ఈ నాలుగు కాక మరికొన్ని భాషలు ఉన్నాయన్నారు. లిపి లేక, ఉన్నా పెద్దగా సాహిత్యం లేక మైనారిటీలుగా ఉన్న ఆ భాషీయులు తెలుగు తమిళ కన్నడ మళయాళీల బంధువులే అవుతారన్నారు. చరిత్ర, జీవన శైలి, పోరాటాలలో వారితో మనకున్న సారూప్యతల గురించి తెలుసుకొంటూ ఐక్యత పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామా అన్న విషయాన్ని ఈ సదస్సులో చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. పిడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ వర్తమాన కార్పొరేట్ రాజకీయ దృశ్యంలో గోండీ కొండా కోయ వంటి భాషా సమూహాలు వనరుల మీద ఆధిపత్యాన్ని, బ్రతుకు తెరువులను కోల్పోవటమే కాక పీడనకు హింసకు గురవుతున్నారు. జాతి అస్తిత్వమే ప్రమాదంలో పడుతున్నదనీ, ఇటువంటి సమయంలో ఒకే భాషాకుటుంబానికి చెందినవాళ్ళుగా వాళ్ళతో నిలబడుతున్నామా, వాళ్ళకోసం పనిచేస్తున్నామా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అని అన్నారు.గోండీ, కోయ తదితర గిరిజన సమూహాలతో సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతో కలిసి వాళ్ళకోసమూ, పీడిత ప్రజల విముక్తికోసం పని చేస్తున్న విప్లవోద్యమం వలన గోండు జీవితాలు, గోండు భాషా పదజాలం తెలుగు సాహిత్యంలోకి ప్రవేశిస్తున్నాయి. గోండు భాషలో సాహిత్య సృజన కూడా జరుగుతున్నది. వాటిని ఐక్యతా సాధనకు ఉపయోగించుకొనడం ఎలా అనే చర్చ జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు.
సభలకు ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు రచయిత కె శ్రీనివాస్, ప్రముఖ విమర్శకులు కల్లూరి భాస్కరం,జి. భార్గవ, కవి గూండ్ల వెంకట నారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ డా.సి. మృణాళిని, కవి జిలుకర శ్రీనివాస్ లతోపాటు వివిధ సాహిత్య సంఘాల నాయకులు హాజరవుతారు.
Read More
Next Story