
ఖమేనీ నిరసనలు: ‘తప్పుదోవ పట్టించే’ కంటెంట్‌పై కేసులు
శ్రీనగర్ ఎంపీ అఘా సయ్యద్ రుహుల్లా మెహ్ది, మాజీ మేయర్ జునైద్ అజింపై కేసులు..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని హత్య నేపథ్యంలో కాశ్మీర్‌లో చెలరేగిన నిరసనలపై చట్టపర చర్యలు మొదలయ్యాయి. “తప్పుడు, కల్పిత, తప్పుదారి పట్టించే” కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఆరోపణలపై శ్రీనగర్ ఎంపీ అఘా సయ్యద్ రుహుల్లా మెహ్ది, మాజీ మేయర్ జునైద్ అజిం మత్తూపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమేనీ హత్య తర్వాత రోజు, మార్చి 1న కాశ్మీర్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ఘంటా ఘర్ వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేక నినాదాలు వినిపించాయి. రంజాన్ నెల ప్రారంభం కావడంతో సంతాప ప్రార్థనలు కూడా నిర్వహించారు. మార్చి 2న హురియత్ నాయకుడు మిర్వాజ్ ఉమర్ ఫారూఖ్ పిలుపుతో దుకాణాలను మూసివేయించారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ మద్దతు ప్రకటించారు. 2019 ఆగస్టు 5 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో దుకాణాలు, వ్యాపార సంస్థలు, రవాణా వ్యవస్థ స్తంభించడం ఇదే ప్రధమం.
కాగా తన భద్రత తగ్గించారని, ఫేస్‌బుక్ ఖాతా నిలిపివేశారని రుహుల్లా పేర్కొన్నారు. ఈ చర్యలు తనను మౌనంగా ఉంచలేవని, తాను రాజ్యాంగ హక్కుల మేరకే నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు.

