
పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌కు ఉపశమనం
ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కేరళ హైకోర్టు..
లైంగిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కస్టడీ విచారణ అవసరం ఉందని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది.
ఫిర్యాదుదారు ప్రవర్తనను పరిశీలిస్తే ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో ఉన్న వ్యక్తిగత సంబంధం ఉన్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తుది నిర్ణయం ట్రయల్ సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఫిర్యాదుదారు వివాహిత, పరిపక్వ మహిళ అని, ఆమెకు ఇష్టం లేకపోతే ఎమ్మెల్యేను తన అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించడం, తరువాత అతనితో కలిసి పాలక్కాడ్‌లో బస చేయడం నమ్మశక్యం కాదని కోర్టు పేర్కొంది. ఘటన జరిగిన తర్వాత కూడా వెంటనే ఫిర్యాదు నమోదు కాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుందని వ్యాఖ్యానించింది.
కోర్టు పరిశీలించిన వాట్సాప్ చాట్‌ల ప్రకారం.. ఫిర్యాదుదారు, ఎమ్మెల్యే మధ్య సన్నిహిత వ్యక్తిగత సంబంధం ఉన్నట్టు కనిపించిందని, బలవంతం లేదా ఒత్తిడి ఉన్నట్లు ప్రత్యక్ష ఆధారాలు కనిపించలేదని తెలిపింది. “విఫలమైన ప్రతి సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేము” అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
గర్భస్రావం ఆరోపణలపై కోర్టు వ్యాఖ్య..
బలవంతపు గర్భస్రావం అంశంలో కూడా చాట్ రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. ఫిర్యాదుదారు స్వచ్ఛందంగా మాత్రలు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొంది. ఆమె అనుమతి లేకుండా గర్భస్రావం జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత విచారణలో ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రాసిక్యూషన్ వాదనలు..
ఎమ్మెల్యేపై ఇదే తరహా మరికొన్ని కేసులు ఉన్నాయని, ఆయనకు అలవాటు నేరప్రవర్తన ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే నైతికత ఒక విషయం, చట్టపరమైన ప్రమాణాలు మరో విషయం అని హైకోర్టు పేర్కొంటూ, “చట్టం, నైతికత సమానం కావు” అని వ్యాఖ్యానించింది. అనంతరం మమ్‌కూటథిల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కేసు నేపథ్యం..
ఈ కేసులో సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. మూడు లైంగిక వేధింపుల కేసుల్లో రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఒక కేసులో అరెస్టై తరువాత రెగ్యులర్ బెయిల్ దొరికింది.

