కడపలో కేరళ యువతి దుర్మరణం
x

కడపలో కేరళ యువతి దుర్మరణం

విహారయాత్రలో అంతులేని విషాదం.


చదువు ముగించుకుని కొద్ది రోజుల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన ఓ యువతిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కేరళకు చెందిన విద్యార్థిని రిషిక (23) కడప పట్టణం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. సరదాగా సాగాల్సిన విహారయాత్ర కాస్తా, ఆ స్నేహితుల జీవితాల్లో ఎన్నటికీ మర్చిపోలేని తీరని శోకాన్ని మిగిల్చింది.

గండికోట పర్యటనకు వెళ్తుండగా ప్రమాదం

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (IISER)లో రిషిక తన స్నేహితులతో కలిసి బీఎస్‌ఎమ్‌ఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో, రిషిక తన స్నేహితులు ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్య , విశాఖకు చెందిన ఠాగూర్‌ రెడ్డిలతో కలిసి రెండు ద్విచక్ర వాహనాల్లో గండికోట పర్యటనకు బయలుదేరారు. శనివారం ఉదయం వీరు కడప పట్టణం సమీపంలోని ఆలంఖాన్‌ పల్లె ఇర్కాన్ సర్కిల్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ఓ ట్యాంకర్ మృత్యుపాశమై దూసుకొచ్చింది.

కళ్లముందే కబళించిన కాలయముడు

ఠాగూర్‌ రెడ్డి నడుపుతున్న బైక్‌ను వెనుక నుంచి ట్యాంకర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి వెనుక కూర్చున్న రిషిక అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా, ట్యాంకర్‌ ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఈ భీకర ప్రమాదంలో రిషిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళ్లముందే తమ స్నేహితురాలు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం చూసి తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న చెన్నూరు పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రిషిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు నవ్వుతూ సాగిన ప్రయాణం నిమిషాల వ్యవధిలో స్మశాన వైరాగ్యంగా మారడంతో అటు కళాశాలలోనూ, ఇటు ఆమె స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. వారాంతపు విహారయాత్రలకు వెళ్లే యువత రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించారు.

Read More
Next Story