సీఎఎపై కాంగ్రెస్ మౌనాన్ని తప్పుబట్టిన కేరళ సీఎం విజయన్
x

సీఎఎపై కాంగ్రెస్ మౌనాన్ని తప్పుబట్టిన కేరళ సీఎం విజయన్

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై కాంగ్రెస్, రాహుల్ గాంధీ మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు కేరళ సీఎం విజయన్.


కాంగ్రెస్ సిఎఎపై మౌనంగా ఉండడాన్నికేరళ సీఎం పినరయి విజయన్ తప్పుబట్టారు. హస్తం పార్టీ ధోరణి బిజెపి సంఘ్ పరివార్‌ల ఆలోచనకు దగ్గరగా ఉందని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీపీఐ(ఎం) అభ్యర్థి వి జాయ్‌ పోటీ చేస్తున్న అట్టింగల్‌లో ఆయన ప్రసంగించారు.

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై కాంగ్రెస్, రాహుల్ గాంధీ మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సిఎఎ ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. అమెరికా సహా అనేక దేశాలు సీఏఏను వ్యతిరేకించడంతో పాటు విమర్శించాని గుర్తుచేస్తూ..కాంగ్రెస్ తన వైఖరి స్పష్టంగా చెప్పకపోగా బీజేపీ సంఘ్ పరివార్ ఎజెండాను వ్యతిరేకించలేకపోయిందని విజయన్ అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ(ఎం) నేత థామస్ ఐజాక్‌ అరెస్టులను ఉటంకిస్తూ.. తమ పార్టీ నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), ఆదాయపు పన్ను శాఖ దాడి చేసినపుడు మాత్రమే కాంగ్రెస్ స్పందించేలా ఉందని, ఇతర పార్టీల నేతల విషయంలో మౌనంగా ఉంటోందని అన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఈడీ చర్యలు తీసుకోగలిగిందని, KIIFB మసాలా బాండ్ కేసు విచారణకు సంబంధించి ఐజాక్‌ను ఈడీ ఎందుకు అరెస్టు చేయడం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని అన్నారు.

నిరాశకు చెందా..

2019 లోక్‌సభ ఎన్నికల్లో యూడీఎఫ్ ఎంపీలను పార్లమెంట్‌కు పంపించిన ప్రజలు..జాతీయ సమస్యపై తమ గళాన్ని వినిపించకపోవడంతో నిరాశకు గురయ్యారని, దీంతో తమకు ఓటేసిన ప్రజానీకం బాధపడ్డారని విజయన్ పేర్కొన్నారు. కేరళ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆర్థిక ఆంక్షలకు వ్యతిరేకంగా యుడిఎఫ్ ఎంపీలు మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు.

విజయన్ ఆరోపణలను తిప్పికొట్టిన కాంగ్రెస్...

పినరయి విజయన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సిఎఎను మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారని శశి థరూర్, కెసి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా లోక్‌సభలో తాను చాలా మాట్లాడానని, వాటిని కేరళ సీఎంకు చూపిస్తానని థరూర్ చెప్పారు. రాహుల్ గాంధీలా బీజేపీని ఎవరూ వ్యతిరేకించలేదని, నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకే విజయన్, వాయనాడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని వేణుగోపాల్ అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వివాదాస్పద సీఎఎ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కేంద్రం విధానాలు ఒక్కటే కారణం కాదని కాంగ్రెస్ వాదించింది.వామపక్ష ప్రభుత్వ నిర్వహణ లోపం, దుబారా, అవినీతి, పేలవమైన పన్నుల వసూళ్లే ప్రధాన కారణమని గ్రాండ్ ఓల్డ్ పార్టీ పేర్కొంది.


Read More
Next Story