
లిక్కర్ స్కాం రూపకర్త కసిరెడ్డి... సుప్రీం క్లారిటీ!
కసిరెడ్డిని లిక్కర్ స్కాం ఆర్కిటెక్ట్ అన్న సుప్రీం కోర్టు, బెయిల్ నిరాకరణ
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.ఈ కేసులో ఏ1 నిందితుడిగా వున్న రాజ్ కసిరెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ కుంభకోణంలో సూత్రధారులంటూ చాలా పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే గురువారం ఉదయం సుప్రీంకోర్టు మద్యం కుంభకోణంపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ కేసులో మొత్తం వ్యవహారానికి ఆర్కిటెక్ట్ రాజ్ కెసిరెడ్డేనని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ కెసిరెడ్డి వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది.
వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం ద్వారా సుమారు 4 వేల కోట్ల మేర కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేయిస్తోంది.
మద్యం కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డిని సీఐడీ సిట్ ఏ-1 నిందితుడుగా చేర్చింది.
గతేడాది మద్యం స్కాం కేసులో అరెస్టు అయిన రాజ్ కెసిరెడ్డి 9 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ లభించినా.. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే 750 కోట్లు మళ్లించిన షెల్ కంపెనీలతో రాజ్ కెసిరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు నిర్ధారించింది.ఈయనే కీలక సూత్రధారిగా కోర్టు వ్యాఖ్యానించడం తో రాజ్ కసిరెడ్డికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
ఆయనకు రెగ్యులర్ బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు కసిరెడ్డి లాయర్ అనుమతి కోరగా సుప్రీం కోర్టు అంగీకరించింది.
కేసులో కీలకంగా రాజ్ కసిరెడ్డి
కడప జిల్లాకు చెందిన రాజ్ కసిరెడ్డి, హైదరాబాద్‌లో నివాసముంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. మద్యం కుంభకోణంలో నిధుల మళ్లింపు, షెల్ కంపెనీల నిర్వహణ, నల్లధనాన్ని వైట్‌లోకి మార్చడంలో ప్రధాన సూత్రధారిగా SIT గుర్తించింది. 2025 ఏప్రిల్ లో హైదరాబాద్‌లో అరెస్టయిన రాజ్ కసిరెడ్డి, అప్పటి నుండి జైలులోనే ఉన్నారు. మద్యం కుంభకోణం సొమ్ముతో 'స్పై' (Spy) వంటి చిత్రాల నిర్మాణంలో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
భారీగా నగదు స్వాధీనం
ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం SIT హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఫామ్‌హౌస్‌లో కొన్ని నెలల క్రితం భారీగా నగదును స్వాధీనం చేసుకుంది. సులోచన ఫార్మ్స్ గెస్ట్‌హౌస్‌లో దాచిన ₹11 కోట్ల నగదును 12 అట్టపెట్టెల్లో జూలై 30, 2025న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 40వ నిందితుడు వరుణ్ కుమార్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. రాజ్ కెసిరెడ్డి సూచనల మేరకు నగదును దాచినట్లు దర్యాప్తు లో గుర్తించారు. భారీగా నగదు దొరకడంతోనే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి పేరు అందరికీ వెల్లడైంది. ఆ సొమ్ము తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి వాదించారు.దాదాపు ₹3,500 కోట్లు ఈ నగదు ముడుపులుగా అందినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసులో 12 మందిని అరెస్టు చేశారు, మరిన్ని కీలక ఆధారాల కోసం విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డి
బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Next Story

