కశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగింపు – పాఠశాలలు బంద్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత
x

కశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగింపు – పాఠశాలలు బంద్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత

సమ్మెకు రాజకీయ పార్టీలు మద్దతు


Click the Play button to hear this message in audio format

ఇరాన్ సుప్రీం లీడర్ ఖామెనీ హత్య అనంతరం కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలు ఉద్ధృతం కావడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు. కదలికలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పాఠశాలలు, విద్యాసంస్థలను రెండు రోజులపాటు మూసివేశారు.

ఖామెనీ మరణం నేపథ్యంలో లాల్ చౌక్, సైదా కదల్, బుడ్గాం, బండిపోరా, అనంతనాగ్, పుల్వామా ప్రాంతాల్లో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. లాల్ చౌక్‌లోని ఘంటా ఘర్ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా దిగ్భందించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

కశ్మీర్ వ్యాలీలో దాదాపు 15 లక్షల షియా ముస్లింలు నివసిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు.

ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలమా (ఎమ్మ్యూఎం) చైర్మన్ మిర్వైజ్ ఉమర్ ఫారూఖ్ పిలుపుతో ఒకరోజు సమ్మె నిర్వహిస్తున్నారు. “ప్రజలు శాంతియుతంగా, ఐక్యతతో సమ్మె పాటించాలి” అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మెకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అందులో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా ఉన్నారు.


నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

నిరసనల నేపథ్యంలో సోమవారం కశ్మీర్ అంతటా హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించారు. ప్రజల్లో అపోహలు వ్యాపించకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ధృవీకరించని సమాచారం లేదా వదంతులను ప్రచారం చేయకూడదని మీడియా సంస్థలకు పోలీసులు సూచించారు. ప్రస్తుతానికి కశ్మీర్ వ్యాలీ మొత్తం హై అలర్ట్‌లో ఉండగా, భద్రతా బలగాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

Read More
Next Story