
కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు?
బడ్జెట్ ముందు విదేశాలకు వెళ్లిన 21 ఎమ్మెల్యేలు..
కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మార్చి 6న అసెంబ్లీలో 17వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు విదేశాలకు పయనమయ్యారు. ఈ పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.
విదేశీ పర్యటన..
కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్నారు. ముందుగా మలేషియాలోని కౌలాలంపూర్ చేరుకొని, అక్కడి నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హెచ్.డి. తమ్మయ్య మాట్లాడుతూ.. “మేం వ్యక్తిగతంగా టూర్‌కు వెళ్తున్నాం. నా కుటుంబంతో కలిసి. బడ్జెట్ సమావేశానికి ముందే ఈ పర్యటన ఫిక్స్ చేసుకున్నాం. దీనికి రాజకీయాలను ముడిపెట్టవద్దు” అని చెప్పారు.
ఇతర ఎమ్మెల్యేలు ఎవరు?
సి. పుట్టరంగ శెట్టి, బి. దేవేంద్రప్ప, హంపనగౌడ బదారి, బి.ఎం. నగరాజ్, ఏ. వసంత్ కుమార్, డి. తిమ్మయ్య, శరణగౌడ పాటిల్ బయ్యాపూర్ తదితరులు విదేశీ పర్యటనకు వెళ్తున్న వారిలో ఉన్నారు.
బదారి మాట్లాడుతూ..ఈ పర్యటన ఖర్చులు ఎమ్మెల్యేలు సొంతంగా భరిస్తున్నారని, ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. “మేము సంవత్సరానికి రెండు, మూడు సార్లు విదేశాలకు వెళ్తాం. ఇప్పటికే మస్కట్, యూరప్, అమెరికా వెళ్లాం” అని చెప్పారు.
పార్టీలో విభేదాల వల్లేనా?
డిప్యూటీ సీఎం డి.కే. శివకుమార్ పక్షాన ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.సి. బాలకృష్ణ మాట్లాడుతూ.. “మా స్నేహితులతో కలిసి వెళ్తున్నా. ఇది వర్గపోరాటం కాదు” అని చెప్పారు.
అదే సమయంలో ఎమ్మెల్యే రవి గణిగ ఇలా అన్నారు. “విదేశీ పర్యటన కారణంగా ప్రభుత్వాన్ని మార్చలేము. కాంగ్రెస్ అధిష్టానం సరైన సమయానికి నిర్ణయం తీసుకుంటుంది” అని చెప్పారు.

