ఉపాధ్యాయులేమైనా యంత్రాలా!
x

ఉపాధ్యాయులేమైనా యంత్రాలా!

కమిషనర్ వైఖరిలో మార్పు రాకపోతే పోరాటం తప్పదు: యుటిఎఫ్ కడప జిల్లా శాఖ హెచ్చరిక.


రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయులను యంత్రాలుగా భావిస్తూ, నిరంతరం బోధనేతర కార్యక్రమాలతో విద్యా బోధనకు దూరం చేస్తూ వేధింపులకు గురిచేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) తీవ్రంగా వ్యతిరేకించింది.

విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను వేధించడమే పనిగా పెట్టుకుని వెబెక్స్ మీటింగ్ ల ద్వారా ఎంఈఓలు, డివైఇఓ లు, డిఈఓ లపై ఒత్తిడి తెచ్చి తీవ్ర పదజాలంతో దుర్భాషలాడడాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు.

ఆదివారం ఉదయం కడప యుటిఎఫ్ భవన్ నందు జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం ఈ ధోరణిని తీవ్రంగా విమర్శించింది. విద్యా శాఖ కమిషనర్ వైఖరిలో మార్పు రాకపోతే భవిష్యత్తులో యుటిఎఫ్ పోరాటాలకు సిద్ధమవుతుందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయులకు విద్యాశక్తి పేరుతో వందరోజుల ప్రణాళిక రూపొందించి, పండుగలు మరియు సెలవు దినాలలో పనిచేయమనడం, పదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు పరీక్ష నిర్వహించి, అదే రోజు సాయంత్రానికల్లా మార్కులు ఆన్లైన్లో నమోదు చేయాలని ఒత్తిడి చేయడం సరైనది కాదని వారు అన్నారు.

ముస్తాబు కార్యక్రమం పేరుతో ఉపాధ్యాయులపై మరింత ఒత్తిడి పెంచుతూ వేధింపులకు గురిచేయటం తగదన్నారు. విద్యార్థులను పాఠశాలకు సిద్ధపరిచి పంపే బాధ్యతల నుండి తల్లిదండ్రులను మినహాయించి, ఉపాధ్యాయులకు ఆ బాధ్యత అప్పజెప్పడమేంటని వారు ప్రశ్నించారు. పాఠశాలకు విద్యార్థులకు సంబంధించిన బోధనను మినహాయించి మిగిలిన అన్ని పనులు ఉపాధ్యాయులే చేయాలనడం, తల్లిదండ్రుల కనీస బాధ్యతలను ఉపాధ్యాయులే నిర్వర్తించాలని కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడం సబబు కాదన్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయులకు తగినంత సమయం కేటాయించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే ప్రణాళిక రూపొందించాలి కానీ ముస్తాబు, బోధనేతర పనుల ద్వారా ఉపాధ్యాయుల బోధన సమయాన్ని హరించే విధంగా ప్రణాళికలు రూపొందించడం వెనుక ప్రభుత్వ విద్యా రంగాన్ని పతనావస్థకు తీసుకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు భావించవలసి వస్తుందని తెలిపారు. ఉపాధ్యాయుల పట్ల, విద్యా శాఖలో పనిచేస్తున్న అధికారుల పట్ల మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను తలదన్నేలా ప్రస్తుత కమిషనర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

విద్యాశాఖ కమిషనర్ దుందుడుకు వైఖరి పట్ల మంత్రి నారా లోకేష్ మరియు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో గత ప్రభుత్వానికి జరిగిన నష్టమే ఈ ప్రభుత్వానికి తప్పక జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి విద్యారంగంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించాలని కోరారు. విద్యా శాఖ కమిషనర్ వైఖరిలో మార్పు రాకపోతే భవిష్యత్తులో యుటిఎఫ్ పోరాటాలకు సిద్ధమవుతుందని తెలిపారు.

కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్.నాగార్జున రెడ్డి, జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, వివిధ విభాగాల కన్వీనర్లు పాల్గొన్నారు.

Read More
Next Story