
పెద్దపసుపుల పాఠశాలలో పంజాబీ ప్రతిధ్వని
ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్
కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్ద పసుపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పంజాబీ భాష ప్రతిధ్వనించింది.
జమ్మలమడుగు పట్టణంలో జరుగుతున్న అండర్ -14 జాతీయ వాలీబాల్ పోటీలకు విచ్చేసిన పంజాబ్ రాష్ట్ర జట్టు విద్యార్థినులు బుధవారం పెద్ద పసుపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు కోచ్ లక్వీందర్ సింగ్, లవ్ ప్రీత్ కౌర్ ల ఆధ్వర్యంలో పిల్లలకు పంజాబీ అక్షరాలు, భాష విశిష్టత గురించి వివరించారు. పంజాబీ సంస్కృతి పట్ల పిల్లలకు అవగాహన కల్గించారు. అలాగే పంజాబీ పదాలను పిల్లలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా పంజాబీ పదాలను పలకడానికి పిల్లలు ఎంతగానో ఇష్టపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ (Ek Bharat Shresht Bharat) కింది ఆంధప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో పంజాబీ భాషను పరిచేయం చేసేందుకు అంగీకరించింది. ఇదే విధంగా పంజాబ్ పాఠశాలలు తెలుగు భాషను అక్కడి విద్యార్థులకు పరిచయం చేస్తాయి.
ఈ అవగాహన మేరకు పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 10 తరగతుల వరకు విద్యార్థులు తెలుగు ప్రాథమికాలను నేర్చుకోడం ఈ విద్యాసంవత్సరం నుంచి మొదలయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు తమ విద్యార్థులకు పంజాబీని నేర్పించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఈ రోజు జమ్మల మడుగు సందర్శించిన పంజాబీ జట్టును పెద్ద పసుపుల పాఠశాలకు ఆహ్వానించారు.
ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హెచ్ఎం జరీనా బేగం మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పాఠశాలల్లో అమలుచేస్తున్న సంగతిని గుర్తు చేశారు.
ప్రతి రాష్ట్రం తమ భాషతో పాటు మరొక ప్రాంతీయ భాషను ఈ కార్యక్రమం క్రింద ఎంపిక చేసుకుంటుందని ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రం తెలుగు భాషను , మన రాష్ట్రం పంజాబీ భాషను ఎంపిక చేసుకుందని వివరించారు. తమ పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగేందుకు సహాయ సహకారాలు అందించిన అండర్ 14 జాతీయ వాలీబాల్ పోటీల నిర్వాహకుడు బసిరెడ్డి శ్రీనివాసులరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాఠశాల పక్షాన పంజాబ్ రాష్ట్ర జట్టు కోచ్ లను కాశ్మీర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సత్కార కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

