వీడు మొగుడా, యముడా! భార్యను సరిగా ఉరేసుకోమని చెప్తాడా?
x

"వీడు మొగుడా, యముడా! భార్యను సరిగా ఉరేసుకోమని చెప్తాడా?"

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని కుదిపేసిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని కుదిపేసిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. “భార్య ఉరేసుకుంటుంటే రక్షించాల్సిన భర్త… సరిగా ఉరేసుకోమంటూ సూచనలు ఇస్తాడా?” అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే…
ఒంగోలుకు చెందిన శ్రీరాం శ్రీనివాసులు వైఎస్సార్ కడప జిల్లా నందలూరు మండలంలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అతని తొలి భార్య పదేళ్ల క్రితం మరణించింది. అనంతరం 2016లో నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి (30)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం రాజంపేట మండలం బోయనపల్లిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

అయితే శ్రీనివాసులుకు మద్యం అలవాటు ఉండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. జీవితంపై విరక్తితో కృష్ణవేణి గత ఆరు నెలలుగా “చనిపోతాను” అంటూ భర్తను బెదిరించేదని తెలిసింది. భర్త మాత్రం దీన్ని నిజంగా తీసుకోకుండా బెదిరింపు ప్రయత్నంగా భావించాడని పోలీసులు చెబుతున్నారు.
ఉరితో చెలగాటం… విషాదాంతం
ఇటీవల మరోసారి గొడవ జరగడంతో గురువారం కృష్ణవేణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇంట్లో తలుపులు వేసుకుని చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటుండగా బయట ఉన్న భర్త గమనించాడు. అయితే ఆమెను కాపాడే ప్రయత్నం చేయకుండా మొబైల్ ఫోన్‌తో వీడియో తీయడం ప్రారంభించాడు. అంతేకాకుండా “కృష్ణా… సరిగా ఉరేసుకో” అంటూ నవ్వుతూ చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది.
ఈ క్రమంలో ఆమె మంచం నుంచి దిగుతుండగా మెడకు ఉచ్చు బిగుసుకుంది. అప్పుడే పరిస్థితి తీవ్రమైందని గ్రహించిన భర్త తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ గడియ తీసుకోలేకపోవడంతో బయట కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపు తెరిచేలోగా కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయింది.
వీడియో వెలుగులోకి… కేసు నమోదు
ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం బయటకు రావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భర్త నిర్లక్ష్యం, ప్రేరేపణ కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం.
గ్రామస్థులు మాత్రం “ఇది సాధారణ సంఘటన కాదు… భార్య ప్రాణాలపై భర్త ఇలా ప్రవర్తించడం అమానుషం” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోషిణీ సంస్థ చేయూత
మహిళలపై హింస, గృహ సమస్యలపై పనిచేసే రోషిణీ సంస్థ (Roshini NGO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కుటుంబ గొడవలను సరదాగా తీసుకోవడం, మానసిక సమస్యలను పట్టించుకోకపోవడం ఇలాంటి విషాదాలకు దారి తీస్తుందని పేర్కొంది.
రోషిణీ సంస్థ మహిళలకు కౌన్సిలింగ్‌, చట్టపరమైన సహాయం, అత్యవసర మద్దతు అందించే సంస్థగా పనిచేస్తోంది. గృహహింస, మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు ఈ సంస్థ సహాయం అందిస్తోంది.
రోషిణీ హెల్ప్‌లైన్ నంబర్లు:
040-66202000, 040-66202001
కౌన్సిలింగ్ / సపోర్ట్ నంబర్లు:
81420 20033 / 81420 20044
90106 61117 / 90106 61118
ఎవరైనా ఆత్మహత్య గురించి మాట్లాడితే దాన్ని సరదాగా తీసుకోవద్దు. వెంటనే కుటుంబ సభ్యులు లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి.
Read More
Next Story