ఎట్టకేలకు జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
x

ఎట్టకేలకు జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

ఢిల్లీ నగదు వివాదం, అభిశంసన విచారణల మధ్య అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు.


Click the Play button to hear this message in audio format

ఢిల్లీ నగదు వివాదం నేపథ్యంలో అభిశంసన విచారణ జరుగుతుండగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.

లేఖలో కారణాలను వివరించకుండా గౌరవంతో పదవి నుంచి తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ రాజీనామాతో, ఆయనపై కొనసాగుతున్న అభిశంసన ప్రక్రియ ముగిసే అవకాశముందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి.

ఈ వివాదం 2025 మార్చి 14న ఢిల్లీలో జరిగిన ఘటనతో ప్రారంభమైంది. లూటియన్స్ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పనివాళ్ల క్వార్టర్స్ దగ్గర గిడ్డంగిలో కాలిపోయిన కరెన్సీ నోట్లు కనిపించాయని సమాచారం. ఆ సమయంలో జస్టిస్ వర్మ, ఆయన భార్య భోపాల్‌లో ఉన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసి అంతర్గత విచారణ చేపట్టింది. నివేదికను ఆ కమిటీ అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు సమర్పించింది.

విచారణ జరుగుతున్న సమయంలో, ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ వర్మకు న్యాయపర పనులు నిలిపివేశారు. తర్వాత ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయనకు ఎలాంటి కేసులు కేటాయించవద్దని ఆదేశాలు ఇచ్చారు.

ఈ కేసుకు సంబంధించిన నగదు ఫోటోలు, వీడియోలను కూడా కోర్టు బహిర్గతం చేసింది.

అయితే, ఈ ఆరోపణలను జస్టిస్ వర్మ ఖండించారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు ఆ గదిలో నగదు ఉంచలేదని తెలిపారు. ఆ గది అందరికీ అందుబాటులో ఉండేదని చెప్పారు.

ఇలాంటి పరిణామాల మధ్య కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలుకుతూ.. జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు.

Read More
Next Story