జ్ఞానభూమికి ’స్కోచ్ ప్లాటినం‘ మకుటం
x

జ్ఞానభూమికి ’స్కోచ్ ప్లాటినం‘ మకుటం

ఢిల్లీ వేదికగా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖకు అరుదైన గౌరవం.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జ్ఞానభూమి పోర్టల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. విద్యార్థులకు రియల్ టైమ్ (Real-time) సేవలు అందించడంలో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు గానూ, సాంఘిక సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ ప్లాటినం అవార్డు (SKOCH Platinum Award) దక్కింది. శనివారం ఢిల్లీలో జరిగిన 106వ స్కోచ్ అవార్డుల ప్రధానోత్సవంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి (IAS) ఈ అవార్డును అందుకున్నారు.

డిజిటల్ విప్లవంతో పేద విద్యార్థులకు అండ
ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం జ్ఞానభూమి పోర్టల్ ఒక శక్తివంతమైన డిజిటల్ వారధిలా పనిచేస్తోంది. గతంలో స్కాలర్‌షిప్పులు లేదా విద్యా పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చాక, దరఖాస్తు నుండి నగదు జమ అయ్యే వరకు ప్రతి దశ పారదర్శకంగా మారింది. కేవలం స్కాలర్‌షిప్పులకే పరిమితం కాకుండా, విద్యార్థుల విద్యా ప్రస్థానంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగించేలా ఈ ప్లాట్‌ఫారమ్‌ను తీర్చిదిద్దారు.
స్కూల్ స్థాయి నుండి సివిల్స్ వరకు
జ్ఞానభూమి పోర్టల్ ద్వారా అందుతున్న సేవలు విద్యార్థి దశలోని అన్ని స్థాయిలను కవర్ చేస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల కోసం ప్రీ-మెట్రిక్, ఉన్నత చదువుల కోసం పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్పులను ఈ పోర్టల్ ద్వారానే రియల్ టైమ్‌లో అందిస్తున్నారు. అలాగే, నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ , ప్రభుత్వ హాస్టల్ అడ్మిషన్ల ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేయడం వల్ల వేలాది మందికి లబ్ధి చేకూరుతోంది.
విదేశీ విద్య.. ఉన్నత శిఖరాలకు మార్గం
పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్య (విదేశీ విద్య) పథకానికి జ్ఞానభూమి పోర్టల్ వెన్నెముకలా నిలుస్తోంది. దీనితో పాటు, దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాల కోసం సివిల్స్ కోచింగ్ , విద్యోన్నతి వంటి పథకాలను కూడా ఈ పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అట్టడుగు వర్గాల విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ, ఆర్థిక తోడ్పాటును వేగంగా అందిస్తున్నందుకు గాను ఈ పోర్టల్‌కు జాతీయ స్థాయి ప్లాటినం గౌరవం దక్కింది.
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు
జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను, సిబ్బందిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఉద్యోగి కలిసికట్టుగా పనిచేసి, పేద విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల అభివృద్ధికి సాంకేతికతను జోడించి ప్రభుత్వం అందిస్తున్న సేవలకు ఈ అవార్డు ఒక నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
Read More
Next Story