అమెరికా ఎన్నికల్లో ఈ గడ్డాలు, మీసాల గోలేంటీ? 80 ఏళ్ల తర్వాత పోటీ ఏంటీ!
x

అమెరికా ఎన్నికల్లో ఈ గడ్డాలు, మీసాల గోలేంటీ? 80 ఏళ్ల తర్వాత పోటీ ఏంటీ!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గడ్డాలు, మీసాల గోల ఏమిటీ? సుమారు 80 ఏళ్ల తర్వాత గడ్డమున్న ఓ వ్యక్తి పోటీకి పడడమేంటీ? దీనిపై ఈ రచ్చేమిటీ?


అమెరికా ఏంటీ, ఈ గడ్డాలు, మీసాలే గోలేంటీ? మనమే అనుకుంటే ఆధునికం, అగ్రరాజ్యమనుకునే అమెరికాలోనూ గడ్డాలు, మీసాల సెంటిమెంట్లున్నాయా? అంటే అవుననే అనుకోవాల్సివస్తోంది. భార్య గర్భవతిగా ఉంటేనో, ఇంట్లో ఏదైనా అశుభమేమైనా జరిగితేనో, పరీక్షలంటేనో, ఎన్నికలైతేనో మనోళ్లు గడ్డాలు, మీసాలు పెంచి ఆ తర్వాత తుంచడం ఆనవాయితీ. మొన్న మన ఎన్నికల రిజల్ట్ వచ్చిన మర్నాడు మన తిరుపతి కొండ గుండుబాబులతో కిటకిటలాడింది.


మరో 90 రోజుల్లో అమెరికా ఎన్నికలు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. రిపబ్లికన్ల ప్రెసిడెన్షియల్ క్యాండెట్ డోనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ గా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ను ఎంచుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడాయన గడ్డం అడ్డమైంది. అమెరికాలో రచ్చవుతోంది. సోషల్ మీడియా అయితే హోరెత్తిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రధాన పత్రికలు, ఫాక్స్ న్యూస్ వంటి మెయన్ స్ట్రీమ్ టీవీలు చర్చోపచర్చలు చేస్తున్నాయి. చరిత్రను తిరగేస్తున్నాయి. ట్రంప్‌కి ఈ గడ్డమున్న వాన్స్ ఎంపిక కలిసొస్తుందా? జెల్లగొడుతుందా? అని రాజకీయ పండితులు తల్లకిందులవుతున్నారు. ట్రంప్ ఎంపిక సామాజిక మూస పద్ధతుల్ని బద్దలు కొట్టిందని ఒకరంటే.. అదో బ్యాడ్ ఛాయిస్ అని ఇంకొకరంటున్నారు. ఇంతకీ విషయమేమిట్రా అంటే సుమారు 80 ఏళ్ల తర్వాత ఓ గడ్డమున్న వ్యక్తి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడమే!

గడ్డం పెంచడం వెనక ఇంతుందా!
గతంలో ఎవరైనా నెరిసిన గడ్డంతోనో బట్టనెత్తితోనో కనబడితే ఆయనో మేధావండీ అనేవాళ్లు. ఇప్పుడు గడ్డం పెంచడం పెద్ద ఫ్యాషన్. బోలెడన్ని రకాలు, అనేక రంగులు, క్రిమ్ములు... పెంచిన గడ్డాన్ని తుంచాలన్నా అదే ట్రిమ్ చేయాలన్న ఖరీదైన వ్యవహారమే. అసలు గడ్డాల పెంపకంపైన్నే పెద్ద పెద్ద ధీరీలున్నాయట.
అవన్నీ ఇక్కడెందుక్కానీ... అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు గడ్డమున్న వాళ్లను పోటీకి పెట్టి 80 ఏళ్లు దాటింది. అధునాతం, అంతరిక్షమనే 21వ శతాబ్దంలో ఇదో వింతేమరి. జేడీ వాన్స్ గెలిస్తే 80 ఏళ్ల తర్వాత ఓ గడ్డమున్న వ్యక్తి వైట్ హౌస్ లో అడుగుపెట్టినట్టు లెక్క. ట్రంప్ కి వాన్స్ లో ఏమి నచ్చిందో తెలియదు గాని ఈ గడ్డం సెంటిమెంటును మాత్రం బద్దలుకొట్టాడు. గడ్డమంటే ఇష్టం లేదు గాని అడ్డమేమీ కాదన్నారు. ఆధునిక శైలికి పెద్దపీట వేశారు. 1948 తర్వాత ఓ 39 ఏళ్ల కుర్రాడు అదీ ఓ గడ్డమున్న వ్యక్తి అమెరికాలో పెద్ద పోస్టుకు తలపడుతున్నారు.
ఇదీ గడ్డాలున్న వారి చరిత్ర...

అమెరికాకి 1888లో అధ్యక్షుడిగా ఎన్నికైన బెంజిమన్ హారిసన్ గడ్డమున్న చివరి వ్యక్తి. ఆ తర్వాత మరే అధ్యక్షుడికి గడ్డం లేదు. 1908లో ఎన్నికైన మరో అధ్యక్షుడు విలియం హోవార్డ్ టాఫ్ట్ కి మెలితిప్పిన గుబురు మీసాలుండేవే గాని గడ్డం లేదు. మీసాలున్న చివరి వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ కర్టిస్. హెర్బర్ట్ హూవర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్. ఆ తర్వాత అంతా నున్నంగా గడ్డం చేసుకున్న వాళ్లే. చివరిగా అంటే 1944, 1948లో ప్రధాన పార్టీ- రిపబ్లికన్ల అభ్యర్థి థామస్ ఇ. డ్యూయీ మూతి మీద మీసంతో అధ్యక్షపదవికి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడాయన మీసాలపై ఎన్ని కామెంట్లో.! "ఎవరైనా ఓ వ్యక్తి తన మనస్సును ప్రభావితం చేయకుండా మీసాలు పెంచలేడు" అన్నాడు డ్యూయీపై పోటీ చేసిన హూవర్. ఇక ఆ తర్వాత రాజధాని వాషింగ్టన్ డీసీ అధికారవర్గాలలో మీసాలు, గడ్డాలు లేని వారి రాజ్యమే సాగింది ఇప్పటి వరకు.
గడ్డాలతో సమస్య ఏమిటీ...
గడ్డం పెంచడమంటే అనుమానాలకు తావివ్వడమేనట. పూర్తిగా కాకుండా చెంపల మీద కాస్త అటు ఇటు వదిలి గడ్డం పెంచారంటే చెప్పాలనుకున్నదేదో దాస్తున్నారన్నట్టు అనుమానిస్తారట. అటువంటి గడ్డం కుయుక్తికి గుర్తట. అలా అని నీట్ గా ట్రిమ్ చేసుకున్నా అనుమానించే ఆస్కారం లేకపోలేదు. గ్రీకు పురణాల్లో మాదిరి మేక మొఖంతో ఉండే మెఫిస్టోఫెల్స్ అనే రాక్షసుడితోనో లేదా డ్రాక్యులాతోనో పోలుస్తారట. పోనీ ట్రిమ్ చేయకుండా వదిలేస్తే క్యూబా కమ్యూనిస్టు నేత ఫిడెల్ కాస్ట్రోతోనో, హిప్పీల వంటి తిరుగుబాటుదారులతో పోల్చి సెటైర్లు వేస్తారట. గడ్డం వెనుక ఇన్ని సిద్ధాంతాలున్నాయని తెలిస్తే మనోళ్లు ఏమి చేస్తారో మరి.
గడ్డం గీసుకునే వాళ్లు నాగరికులా..
"పొద్దున్నే లేచి శుభ్రంగా గడ్డం గీసుకునే వాళ్లను నాగరికులుగా, (అర్భనైజ్డ్ పీపుల్) హుందాగా ఉండే వాళ్లుగా భావిస్తుంటారు" అంటున్నారు స్టాన్‌ఫోర్డ్ లా స్కూలు ప్రొఫెసర్ రిచర్డ్ టి. ఫోర్డ్. "డ్రెస్ కోడ్స్: హౌ ది లాస్ ఆఫ్ ఫ్యాషన్ మేడ్ హిస్టరీ", "గడ్డాలు- గ్రామీణ జీవనశైలి (మౌంటెయిన్ మ్యాన్) వంటి పుస్తకాలు రాశారు ఈ ప్రొఫెసర్ గారు. అనేక సాంస్కృతిక సంఘాలతోనూ ఆయనకు పరిచయాలున్నాయి. ఈయన వాదనలకు అమెరికా ఆధునికులు ప్రాధాన్యత ఇస్తారట. అయితే రిచర్డ్ వాదనను వ్యతిరేకించే వారూ ఉన్నారు. అసలు సమస్యల్ని అటకెక్కించేందుకే ఇవన్నీ అనేవాళ్లూ లేకపోలేదు. గడ్డాలు, మీసాలతో సమస్యలు పరిష్కారమవుతాయా? అస్థిత్వాలను కోల్పోయిన జాతులకు ప్రాతినిధ్యం వహించే నాయకులు గడ్డాలు మీసాలు పెంచినంత మాత్రాన వాళ్లు వాళ్ల జాతులకు ప్రాతినిధ్యం వహించినట్టవుతుందా! ఇండియాలో కనుక మీ కులపోడికి సీటు ఇచ్చామన్నట్టే ఉంటుందేమో ఈ గడ్డాల పోలిక కూడా.
2001లో జార్జ్ డబ్ల్యూ బుష్ పై అల్ గోరే పోటీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. సుప్రీం కోర్టు కూడా బుష్ కే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత అల్ గోరే గడ్డం పెంచాడు. 2015లో పాల్ ర్యాన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ కోసం పోటీ పడి ఆ తర్వాత తప్పుకుని గడ్డం పెంచాడు. 2016లో టెడ్ క్రూజ్ అధ్యక్ష పదవికి పోటీ పడి తప్పుకున్నాడు. ఆ తర్వాత గడ్డం పెంచాడు. ఇలా చాలామంది తమ చేయాల్సిన ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత గడ్డాలు పెంచారు. కానీ ఏమి జరిగిందీ? పోయిన అస్థిత్వాలు వచ్చాయా? వాళ్లు ప్రాతినిధ్యం వహించిన జాతులకు ఏమైనా మేలు జరిగిందా? ఏమీ లేదన్నది సారాంశం.
మంచికైనా చెడుకైనా గడ్డం ఓ గుర్తు...
అమెరికా టెలివిజన్ హోస్ట్ డేవిడ్ లెటర్‌మాన్ ఓ సందర్భంలో చెప్పినట్లు.. మంచికైనా చెడుకైనా గడ్డం ఓ గుర్తు. భిన్నమైన జీవనానికి మంచి రిమైండర్. గడ్డం పెంచడం కూడా రీబ్రాండింగే. గబుక్కున గుర్తుపడతారా లేదా అన్నది సమస్యే గాని అదో బ్రాండింగ్.
నిజానికి ట్రంప్ గడ్డాలు, మీసాలకు వ్యతిరేకం. తన కొడుక్కీ అదే మాట చెప్పాడు గాని డోనాల్డ్ జూనియర్ పాటించినట్టు లేదు. 2018 నుంచి ట్రంప్ కుమారుడు గడ్డం పెంచుతున్నాడు. మొన్నీమధ్య జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గడ్డంతో ఉన్నాడు. ఇప్పటికీ అతని ట్రేడ్‌మార్క్ గడ్డమే.
అబ్రహం లింకన్ కి ఆ అమ్మాయి ఏమి చెప్పిందంటే...
ఇప్పుడు యాదృచ్ఛికంగా ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా గడ్డం పెంచిన జేడీ వాన్స్ ను ఎంచుకున్నాడు. జేడీ వాన్స్ ఎప్పటి నుంచి గడ్డం పెంచుతున్నాడో తెలియదు గాని 2017లో తాను రాసిన "హిల్‌బిల్లీ ఎలిజీ" పుస్తకావిష్కరణ సభలో క్లీన్ షేవ్‌తోనే ఉన్నాడు. 2022లో సెనేట్‌కు పోటీ చేసే సమయానికి పూర్తిస్థాయిలో గడ్డం ఉంది. ముఖ కవళికల్లో మార్పు కోసమో, రాజకీయాల్లో ప్రత్యేకంగా కనిపించడం కోసమో గాని తలకట్టు, మీసకట్టు, గడ్డం స్టైల్ మార్చాడు వాన్స్. చాలా మోడ్రన్ గా మారాడు. ఇప్పుడు వాన్స్‌ను "యువ అబ్రహం లింకన్"తో పోల్చాడు ట్రంప్. అయితే అది నిజం కాదు. లింకన్ కి గడ్డం ఉండేదే తప్ప మీసాలు ఉండేవి కావు.
లింకన్ గడ్డంపై చరిత్రలో నమోదైన ఓ కథనం ప్రకారం 1860లో ఓ 11 ఏళ్ల బాలిక లింకన్‌తో.. మీ ముఖం కోలగా, పేలవంగా ఉంటుందని, గడ్డం పెంచితే అది కనపడదని, అధ్యక్ష ఎన్నికకు సాయపడుతుందని చెప్పినట్టు చరిత్ర చెబుతోంది. వాన్స్ ముఖం గుండ్రంగా ఉంటుంది. పసితనపు ఛాయలు కనిపిస్తాయి. దవడలు కూడా నిండుగానే ఉంటాయి. ఓ మనిషి వ్యక్తితాన్ని అంచనా వేయడానికి గడ్డం, దవడలు సాయపడతాయట. వాన్స్ గడ్డం డోనాల్డ్ ట్రంప్ జూనియర్ వంటిదే. వెస్ట్రన్ స్టైల్. మన సేమ్యా మాదిరి నున్నగా ఉంటుంది. తన ముందున్న ఏ రాజకీయ నాయకుల గడ్డాల కంటే వాన్స్ గడ్డం తీసిపోదన్నది ట్రంప్ మాట.
వాన్స్ లాంటి గడ్డం ఉన్నవాళ్లకి తుపాకులంటే ఇష్టమట...
ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీకి చెందిన రెబెకా ఇ. హెరిక్ చేసిన పరిశోధన ప్రకారం ఓటర్లు "గడ్డాలు, మీసాలున్న మగవాళ్లని- తక్కువ స్త్రీవాదులుగా, తుపాకులంటే మోజు, సైన్యాల పెంపు, బలగాల మోహరింపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారుగా చూస్తారు." అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుదాం- MAGA- అనే నినాదమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఏమైనా, వాన్స్ గడ్డం కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందో లేదో చూడాలి.
మీసాలున్న అధ్యక్షులెవరంటే...
19వ శతాబ్దం చివర్లో 20వ శతాబ్దం ప్రారంభంలో వైట్ హౌస్‌లో గడ్డాలు, మీసాలున్న వాళ్లు ఎక్కువే. 1861లో లింకన్ కి గడ్డం ఉండేది. ఆ తరువాత వచ్చిన 11 మంది అధ్యక్షుల్లో 9 మందికి గడ్డాలో మీసాలో ఉండేవి. 1916 అధ్యక్ష ఎన్నికలలో వుడ్రో విల్సన్‌పై పోటీ చేసిన రిపబ్లికన్‌కు చెందిన చార్లెస్ ఎవాన్స్ హ్యూస్ కి తెల్లగడ్డం, మీసాలు ఉండేవి. ఆయన్ని గడ్డమున్న మంచుకొండ అనేవారట. సొగసైన మీసకట్టు, పొడవైన గడ్డాల యుగం 20వ శతాబ్దం ప్రారంభంలోనే విలియం హెచ్. టాఫ్ట్‌తో ముగిసింది. 1913లో పదవి నుంచి వైదొలిగిన టాఫ్ట్ మీసాలున్న 27వ అధ్యక్షుడు.
గడ్డాలున్న వారికే ఓట్లు..
2015లో ఓ చిత్రమైన సర్వే బయటకు వచ్చింది. ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీ ఆ సర్వే చేసింది. గడ్డం ఉన్నవాళ్లు, లేని వాళ్లలో ( క్లీన్-షేవ్) ఎవర్ని ఇష్టపడతారని ఓటర్లని అడిగితే గడ్డాలున్న వారికే ఎక్కువ ఓట్లు పడ్డాయట. సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది పురుషులు, 49 శాతం మంది మహిళలు గడ్డం పెంచిన వారికే ఓటు వేస్తామన్నారు. మొత్తం మీద వాన్స్ ఎంపికతో గడ్డాలపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. వాన్స్ గడ్డం అడ్డంకి అనే ధోరణి చివరికి ఏవైపునకు దారి తీస్తుందో చూడాలి.
డిస్పోజబుల్ బ్లేడ్స్ రాకతో మార్పు...
1901లో కింగ్ క్యాంప్ జిల్లెట్ సేఫ్టీ రేజర్‌ను- డిస్పోజబుల్ బ్లేడ్‌లతో కనిపెట్టిన తర్వాత క్లీన్-షేవ్‌నెస్ వచ్చింది. మగవాళ్ల జీవనశైలిలోనూ మార్పు వచ్చింది. "క్లీన్-షేవ్‌నెస్ అనేది పురుష లక్షణంగా మారింది. ఇప్పుడు మళ్లీ గడ్డాల యుగం వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా- గడ్డాలు మీసాలపై మహా మోజు చూపుతోంది.
Read More
Next Story