జగన్ ‘పాదయాత్ర 2.0’ ఓ బిగ్ స్ట్రాటజీ
x

జగన్ ‘పాదయాత్ర 2.0’ ఓ బిగ్ స్ట్రాటజీ

జగన్ చేసిన పాదయాత్ర ప్రకటనతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనం ఉత్తేజం నెలకొంది.


ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై మళ్లీ ’పాదయాత్ర‘ సెగలు పుడుతున్నాయి. ఓటమి తర్వాత మౌనంగా ఉన్నారనుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఒక్కసారిగా ’పాదయాత్ర 2.0’ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఇది కేవలం ప్రజలను కలవడానికి చేస్తున్న పర్యటన కాదు. కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తన వైపునకు తిప్పుకునేలా పక్కాగా సిద్ధం చేసిన ఒక ’పొలిటికల్ మాస్టర్ ప్లాన్‘. ఎన్నికలకు మూడేళ్ల ముందే రంగంలోకి దిగి, ఏకధాటిగా ఏడాదిన్నర పాటు జనారణ్యంలోనే ఉండాలని జగన్ నిర్ణయించుకోవడం వెనుక లోతైన రాజనీతి దాగి ఉంది. అటు చంద్రబాబు తన మార్క్ పాలనతో ముందుకు వెళ్తుంటే, ఇటు జగన్ ’ప్రజాక్షేత్రమే యుద్ధభూమి‘గా మార్చుకుంటూ వేస్తున్న ఈ అడుగులు ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్‌కు నాంది పలికాయి. ఆత్మరక్షణ నుంచి ఆక్రమణ దిశగా జగన్ వేస్తున్న ఈ ’బిగ్ స్ట్రాటజీ‘ అసలు కథ ఇదీ..

ఇది కేవలం నడక కాదు, సుదీర్ఘ పోరాటం
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికలకు ఆరు నెలల ముందో, ఏడాది ముందో పాదయాత్రలకు శ్రీకారం చుడతారు. కానీ జగన్ లెక్కలు వేరుగా ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే, ఏడాదిన్నర తర్వాత రంగంలోకి దిగుతానని ప్రకటించడం వెనుక ఒక భారీ స్కెచ్ ఉంది. ఏడాదిన్నర పాటు నిరంతరం జనంలోనే ఉండటం ద్వారా, అంటే దాదాపు ఎన్నికల నగారా మోగే వరకు ఊరూరా తిరుగుతూ.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను పతాక స్థాయికి తీసుకెళ్లాలన్నది ఆయన ప్లాన్. ఇది ఒకరకమైన ’
ప్రొలాంగ్డ్ పొలిటికల్ వార్‘
. ప్రభుత్వంపై అసంతృప్తిని సెగలు కక్కేలా చేస్తూ, ఎన్నికల సమయానికి దానిని ఓట్ల సునామీగా మార్చుకోవాలన్నదే ఈ సుదీర్ఘ యాత్ర అసలు ఉద్దేశం.

ఆత్మరక్షణ వీడి ఆక్రమణ వైపు.. రెడ్ బుక్ పాలనపై జగన్ గర్జన

గత కొద్ది నెలలుగా అక్రమ కేసులు, అరెస్టులు, వేధింపులతో వైసీపీ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయిందన్నది వాస్తవం. అయితే, ఈ పాదయాత్రతో పార్టీని ఒక్కసారిగా ’అటాకింగ్ మోడ్‌‘లోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. కేసులు పెడితే భయపడేది లేదు.. జనం కోసం రోడ్డెక్కుతాను అనే సంకేతాన్ని పంపిస్తూ, కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ పాలనపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. జగన్ ఉంటేనే బాగుండేది అనే సెంటిమెంట్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడమే లక్ష్యంగా ఈ ఆక్రమణ వ్యూహం సాగబోతోంది. ఇది కేవలం యాత్ర కాదు.. కూటమి కోటను బద్దలు కొట్టేందుకు సిద్ధం చేసిన సమరశంఖం అని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

డీలా పడ్డ కేడర్‌కు పొలిటికల్ బూస్టర్

ఓటమి భారంతో, ప్రభుత్వం పెడుతున్న కేసులతో వైసీపీ శ్రేణులు కొంత నిరాశలో ఉన్న తరుణంలో.. జగన్ పాదయాత్ర ప్రకటన ఒక సంజీవని లా పనిచేస్తోంది. సైన్యం యుద్ధానికి సిద్ధం కావాలంటే నాయకుడు స్వయంగా కదనరంగంలోకి రావాల్సిందేనని జగన్ గుర్తించారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే, క్షేత్రస్థాయిలో డీలా పడ్డ కార్యకర్తలు తిరిగి ఉత్సాహంతో ఉరకలేస్తారు. ఇది కేవలం పాదయాత్ర మాత్రమే కాదు, పార్టీ ఉనికిని చాటుకునే ’సర్వైవల్ అండ్ రివైవల్‘ ప్లాన్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని పునరుత్తేజితం చేసి, పార్టీ యంత్రాంగాన్ని మళ్లీ ఎన్నికల మెషీన్‌లా మార్చడమే ఈ బిగ్ స్ట్రాటజీలోని కీలక భాగం. అయితే 2019లో అధికారాన్ని కట్టబెట్టిన పాదయాత్ర అస్త్రాన్నే జగన్ మళ్లీ నమ్ముకున్నారు. అయితే, ఈసారి ఆయన ఎదురుగా ఉన్నది బలమైన కూటమి ప్రభుత్వం. మరి ఈ ’బిగ్ స్ట్రాటజీ‘తో జగన్ ఏపీ రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతారో చూడాలి.

Read More
Next Story