
జగన్ టూర్.. నేతలపై కేసులు
గుంటూరులో నిబంధనల ఉల్లంఘించారని వివిధ పోలీసు స్టేషన్ లలో పలువురి నేతలపై కేసులు నమోదు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం (ఫిబ్రవరి 4, 2026) గుంటూరులో చేపట్టిన పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు నిర్వహించిన భారీ ర్యాలీలు నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ, పోలీసులు పలువురు కీలక నేతలపై కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పటికీ, అనుమతి లేకుండా జనసమీకరణ చేయడం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించడంపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఖంగుతిన్న నేతలు.. నమోదైన కేసులు
పోలీసుల నివేదిక ప్రకారం, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ (FIR)లు నమోదయ్యాయి. నల్లపాడు పోలీసు స్టేషన్ లో బలసాని కిరణ్ కుమార్, పోతిన మహేశ్‌లపై కేసులు బుక్ అయ్యాయి. తాడేపల్లి , మంగళగిరిలో అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించినందుకు దొంతిరెడ్డి వేమారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. నగరంపాలెం , పట్టాభిపురంలో నూరి ఫాతిమా, పానుగంటి చైతన్యతో పాటు అంబటి మురళిపై కూడా పోలీసులు కేసులు ఫైల్ చేశారు.
స్తంభించిన నగరం
జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు జాతీయ రహదారితో పాటు గుంటూరు నగరంలోని ప్రధాన వీధుల్లో వాహనాలతో భారీ ప్రదర్శనలు చేపట్టారు. కేవలం 40 నిమిషాల్లో ముగియాల్సిన ప్రయాణం, ఈ ర్యాలీల కారణంగా దాదాపు 5 గంటల పాటు సాగిందని పోలీసులు తెలిపారు. దీనివల్ల నగరవాసులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా అత్యవసర వాహనాలకు కూడా దారి లేని పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు నిబంధనల ఉల్లంఘనను సీరియస్‌గా తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆంక్షలు విధించినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. వీడియో ఫుటేజీల ఆధారంగా మరికొంతమంది నేతలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

