పంచె కట్టి, కండువా వేసి పంచాంగ శ్రవణంలో పాల్గొన్న జగన్ దంపతులు
x

పంచె కట్టి, కండువా వేసి పంచాంగ శ్రవణంలో పాల్గొన్న జగన్ దంపతులు

వేద పండితులు జగన్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.


వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా పంచెకట్టు, కండువాతో విచ్చేసిన జగన్ దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ వేడుకల్లో పాల్గొని వారికి సాదరంగా ఆహ్వానం పలికారు.


శాస్త్రోక్తంగా పూజలు.. పంచాంగ శ్రవణం

ఉగాది వేడుకల కోసం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా పూజా మందిరాన్ని తలపించేలా వేదికను సిద్ధం చేశారు. తొలుత జగన్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ సిద్ధాంతి పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి కొత్త ఏడాది పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. గ్రహ గతులు, రాష్ట్ర భవిష్యత్తు, పార్టీ స్థితిగతులను వివరిస్తూ సాగిన ఈ కార్యక్రమాన్ని నేతలందరూ ఆసక్తిగా ఆలకించారు. పంచాంగ శ్రవణం ముగిసిన తర్వాత వేద పండితులు జగన్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
ఈ సందర్భంగా వైఎస్ జగన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పంచాంగకర్త పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రితో పాటు కార్యక్రమానికి విచ్చేసిన వేద పండితులను జగన్ శాలువాలతో సత్కరించి గౌరవించారు.


Read More
Next Story