Jahnavi Ka
x
Jahnavi Kandula

కందుల జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల నష్ట పరిహారం!

అమెరికా కోర్టులో ఒప్పందం, చావును వెటకారమాడిన పోలీసుకు తగిన శాస్తి


అమెరికాలో ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాహ్నవి కుటుంబం దాఖలు చేసిన సివిల్‌ కేసులో సియాటెల్ నగరం $29 మిలియన్ (దాదాపు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని అసోసియేటెడ్ ప్రెస్‌ వెల్లడించగా, సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
“జాహ్నవి కందుల మరణం హృదయవిదారకం. ఈ ఆర్థిక సెటిల్‌మెంట్‌ ద్వారా ఆమె కుటుంబానికి కొంత ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నాం. జాహ్నవి జీవితం విలువైనదే” అని అటార్నీ ఇవాన్స్ పేర్కొన్నారు.
ఇదీ కేసు నేపథ్యం..
కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి కందుల ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి, సియాటెల్‌లోని నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతోంది.
2023 జనవరి 23 రాత్రి, డెక్స్టర్ అవెన్యూ (స్పీడ్ లిమిట్ 25 mph) వద్ద రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన సియాటెల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్ నడిపిన పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది.
అధికారుల సమాచారం ప్రకారం, కెవిన్ డేవ్ అప్పట్లో ఓ హై-ప్రైయారిటీ ఓవర్‌డోస్ కాల్‌కు స్పందిస్తూ గంటకు 74 mph (దాదాపు 119 కిమీ వేగం)తో వాహనం నడిపారు. పోలీస్ లైట్లు ఆన్‌లో ఉన్నప్పటికీ సైరన్‌ను పూర్తిగా కాకుండా మధ్య మధ్యలో మాత్రమే వినిపించారు.
డాష్‌క్యామ్ వీడియోలో జాహ్నవి క్రాస్‌వాక్ వద్ద రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా ఢీకొట్టినట్టు కనిపించింది. ఆమె శరీరం సుమారు 138 అడుగుల దూరం ఎగిరి పడింది.
క్రిమినల్ కేసు ఎందుకు నమోదు కాలేదు?
ఈ ఘటనపై విచారణ జరిపిన కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం 2024 ఫిబ్రవరిలో కెవిన్ డేవ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. అయితే, రెండో స్థాయి (సెకండ్ డిగ్రీ) క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిర్లక్ష్య డ్రైవింగ్ కేసు కింద నగర న్యాయవాది కార్యాలయం చర్యలు తీసుకుని, కెవిన్ డేవ్‌కు $5,000 జరిమానా విధించారు.
తర్వాత అంతర్గత విచారణల అనంతరం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అతను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు కూడా తేల్చారు.
వివాదానికి దారితీసిన వ్యాఖ్యలు
జాహ్నవి మృతి తర్వాత మరింత సంచలనం సృష్టించిన అంశం – అప్పటి పోలీసు అధికారి డానియల్ ఆడెరర్ చేసిన వ్యాఖ్యలు.
బాడీ కెమెరాలో రికార్డైన వీడియోలో ఆయన మాట్లాడుతూ: “She is dead… Just write a check… She had limited value. (‘ఆమె ఓ మామూలు మనిషి. ఆమె చావుకు పెద్ద విలువేమీ లేదు” అనే వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఆడెరర్ తాను “gallows humor” చేశానని చెప్పుకున్నప్పటికీ, పోలీసు విభాగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 2024లో అప్పటి తాత్కాలిక పోలీస్ చీఫ్ స్యూ రార్ ను కూడా విధుల నుంచి తొలగించారు.
కుటుంబం దాఖలు చేసిన భారీ కేసు..
2024లో జాహ్నవి కుటుంబం $110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ సియాటెల్ నగరం, పోలీసు కెవిన్ డేవ్‌పై రాంగ్‌ఫుల్ డెత్, నిర్లక్ష్యం, దాడి ఆరోపణలతో కేసు వేసింది.
నెలల తరబడి చర్చల అనంతరం సియాటెల్ నగరం ఇప్పుడు $29 మిలియన్ సెటిల్‌మెంటుకు అంగీకరించింది. కోర్టు ఆమోదం అనంతరం ఈ మొత్తం అధికారికంగా విడుదల అవుతుంది.
అంతర్జాతీయ స్పందన..
ఈ ఘటన అప్పట్లో భారత్‌లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థి సంఘాలు, హ్యూమన్ రైట్స్ సంస్థలు న్యాయం కోరుతూ నిరసనలు చేపట్టాయి.
జాహ్నవి కందుల మరణం ఒక కుటుంబానికి మాత్రమే కాదు, విదేశాల్లో చదువుతున్న వేలాది భారతీయ విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
$29 మిలియన్ పరిహారం ఆమె ప్రాణానికి ప్రతిఫలం కాదు. కానీ సంస్థాగత బాధ్యతను అంగీకరించిన ఒక చారిత్రాత్మక పరిణామంగా ఇది నిలుస్తోంది. అయితే ఈ పరిహార ఒప్పందానికి ఇంకా జాహ్నవి తల్లిదండ్రులు అంగీకారం తెలిపినట్టు లేదు. ఏది ఏమైనా జాహ్నవి పేరు ఇప్పుడు న్యాయం, బాధ్యత, మానవ గౌరవానికి ప్రతీకగా మారింది.
Read More
Next Story