ఈ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే చట్టమే లేదా ?
ఎదిగిన కొడుకు ను పెళ్లి బారాత్ ఉందని తీసుకెళ్లి కొంతమంది స్నేహితులు చంపేశారని, తనకు న్యాయం చేయమని ఆరు సంవత్సరాలుగా ఇద్దరు దంపతులు అలుపెరుగని పోరాటం చేస్తున్నా..
శుక్రవారం ఉదయం.. పాల ప్యాకెట్ కోసం బయటకి వెళ్తే ఇద్దరు భార్యభర్తలు సైకిల్ పై వస్తూ కనిపించారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ కాలంలో కూడా భార్యభర్తలు ఒకే సైకిల్ పై రావడం ఏంటా అనుకుని చూస్తూ ఉండి పోయాను. భర్త కాస్త బక్కపలచగా, కొంచెం మాసిన బట్టలతో ఉన్నాడు. సైకిల్ తొక్కడానికి కష్టపడుతున్నాడు.
వెనకాల కూర్చున భార్య చేతిలో ఓ సంచి ఉంది. ఇద్ధరి వయస్సు 40-50 మధ్య లో ఉంటుంది. బైక్ పై కాస్త స్పీడ్ గా వెళ్లడంతో తరువాత వారు ఎటు వెళ్తున్నారో పట్టించుకోలేదు. మళ్లీ పాల ప్యాకెట్ తీసుకుని రిటర్న్ లో ఇంటికి వస్తుంటే పోలీస్ స్టేషన్ దగ్గర కనిపించారు. కానీ పని హడావుడిలో పడి పట్టించుకోలేదు.
సాయంత్రం విధులు ముగించాక బయటకు వెళ్తే భార్యాభర్తలు ఇంకా పోలీస్ స్టేషన్ ముందే ఉన్నారు. దగ్గరికి వెళ్లి చూస్తే సైకిల్ పై ఓ కర్రను పెట్టి, దానిపై ఓ ప్లెక్సీ కట్టారు. పెద్ద అక్షరాలతో ‘ నిరసన’ అని రాసి ఉంది. విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించగా, మీడియా అని తెలిసి మాట్లాడాటానికి నిరాకరించారు. తరువాత ‘ఫెడరల్ తెలంగాణ’ వారి ఇంటికి వెళ్లి ఓ గంట సేపు సముదాయించగా విషయం చెప్పడం ప్రారంభించారు. పూర్తిగా వారు తెలిపిన వివరాల ప్రకారం..
నిరసన వ్యక్తం చేస్తున్న భార్యాభర్తల పేర్లు ఆషాడపు లక్ష్మీ, దశరథం. హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందినవారు. వారి పెద్ద కుమారుడు ఆషాడపు రాజేశ్( 21). బీఎస్సీ(బీజెడ్సీ) పూర్తి చేసి కానిస్టేబుల్ కోచింగ్ తీసుకునే వాడు. అయితే ఇదే గ్రామానికి చెందిన తన స్నేహితుడి పెళ్లి కోసం ఇంటికి వచ్చాడు. పెళ్లి పూర్తయ్యాక, తిరిగి ఇంటికి వచ్చిన రాజేశ్ ను పెళ్లి బారాత్ కోసం రావాల్సిందిగా పలువురు స్నేహితులు కాల్ చేయగా నిరాకరించి ఇంటిలోనే ఉన్నాడు.
కానీ అదే గ్రామానికి చెందిన ఓ స్నేహితుడు రాత్రి 9. 25 నిమిషాలకు బైక్ పై రాజేశ్ ఇంటికి వచ్చి తీసుకెళ్లాడు. అక్కడ స్నేహితులు ఇచ్చిన ‘కింగ్ ఫిషర్’ బీర్ తాగిన రాజేశ్ కాసేపటికి డీజే ముందు కుప్పకూలిపోయాడు. రోడ్డుపై గిలాగిలా కొట్టుకుంటూ స్పృహ కోల్పోయాడు. నోటి నుంచి నురుగులు రావడంతో పక్కనే ఉన్న స్నేహితులు నీటితో కడిగే ప్రయత్నం చేసి ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లారు. తరువాత తండ్రికి సమాచారమిచ్చారు.
అక్కడి నుంచి ఓ వెహికల్ లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లండని సూచించారు. అయితే ఆస్పత్రికి వెళ్లే దారిలోనే రాజేశ్ ప్రాణాలు పోయాయి. దీనిపై వంగర పోలీస్ స్టేషన్ లో కేసు(సీఆర్ నంబర్. 17/2018, సీఆర్పీసీ 174) నమోదు అయింది. ఈ సంఘన జరిగిన తేదీ 9-05 -2018, అంటే ఆరు సంవత్సరాలు క్రితం. సంగతి.
ఆరు నెలల తరువాత..
సంఘటన జరిగిన తరువాత కేసు విషయం గురించి పలుమార్లు పోలీసులను ఆషాడపు దశరథం సంప్రదించారు. అయితే తమకు పోస్టుమార్టం, అలాగే ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాలేదని దర్యాప్తు అధికారులు సమాచారమిచ్చారు. ఇలా ఆరు నెలలు ఒకే సమాధానం రావడంతో తేదీ 03-11-2018న అప్పటి వరంగల్ సీపీ డా. రవీందర్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో తేదీ.05-11-2018న అప్పటి దర్యాప్తు అధికారి పోస్టు మార్టం రిపోర్టును అందించారు.
రిపోర్టులో ‘ ఆర్గానో ఫాస్పేట్’ పాయిజన్ కారణంగా రాజేశ్ చనిపోయాడని నిఫుణులు తేల్చారు. ‘‘మొదట అధికారులు శాంపిల్ ను హైదరాబాద్ పంపించామని ఇంకా రాలేదని చెప్పేవారు.. కొన్ని రోజులకు నీకెందుకురా రిపోర్టు అంటూ హేళన చేసేవారు.. తిరిగి తిరిగి విసుగుకొచ్చి సీపీ దగ్గరికి వెళ్లాను’’ అని దశరథం చెప్పారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం ఎఫ్ఎస్ ఎల్ రిపోర్టు 16- 07-2018 న వచ్చింది. కానీ దానిపై ఫైనల్ ఓపినియన్ తీసుకోవడానికి దాదాపు మూడు నెలల సమయం తీసుకున్నారు.
‘వెళ్లి రెడ్డి సాబ్ కాళ్లు పట్టుకో.. గవర్నమెంట్ జాబ్ పెట్టిస్తాడు’
‘‘ నా చేతికి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక కొన్ని రోజులకు అంటే నవంబర్ లో నాతో ఓ కానిస్టేబుల్ ను తోడు ఇచ్చి నా కొడుకు, అతని స్నేహితులు ఆల్కహాల్ తాగిన ప్రదేశంలో ఏవైన ఆధారాలు దొరుకుతాయో వెతకండి అంటూ దర్యాప్తు అధికారి చెప్పారు. అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు అంటే బీరు సీసాలు కానీ ఏవీ లేవు ’’ అని దశరథం చెప్పారు.
కేసు విచారణలో ఉండగానే ఇద్దరు దర్యాప్తు అధికారులు తనతో అన్న మాటలను ఆయన చెప్పారు. ‘‘ మీ ఊళ్లో ఉన్న ఫలానా రెడ్డి సాబ్ దగ్గరికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకో.. ఆయన చెప్పింది చెయ్..నీ చిన్న కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం పెట్టిస్తాడు’’ అని ఓ అధికారి చెప్పారని వివరించారు.
మరో దర్యాప్తు అధికారి ‘‘ హోంగార్డుగా పని చేస్తున్న మీ బావను పిలిపిస్తాను. ఇది బతుకమ్మ పండగ సమయం. మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం, తీసుకో.. వారు పిల్లలు కదా ’’ అని ప్రలోభ పెట్టారని బాధితుడు వాపోయాడు. అయితే దశరథం చేతికి పోస్టు మార్టం రిపోర్టు రావడానికి నెల రోజలు ముందే అంటే తేదీ 5-10-2018నే దర్యాప్తు అధికారి అనుమానితులను విచారణ చేసినట్లు, వారి దగ్గర నుంచి ఎలాంటి ఉపయుక్తమైన సమాచారం లభించలేదని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో వివరించారు.
పాలిగ్రాఫ్ టెస్ట్..
తనకు ఇంటారాగేషన్ లో ఎలాంటి ఆధారాలు లభించలేదని, పాలిగ్రాఫ్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని దర్యాప్తు అధికారి కోర్టును అనుమతి కోరాడు. ఇదే సమయంలో బాధితుడు దశరథం హుస్నాబాద్ కోర్టుకు ఓ పిటిషన్ పెట్టుకున్నాడు. కేసుకు సంబంధించి ‘ సీఏ’ కాపీ ఇవ్వాలని అభ్యర్థించాడు. అందులో కోర్టుకు ఎలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇవ్వలేదని తెలియజేసింది.
కనీసం సీడీఆర్ రిపోర్టు కానీ, కస్టడీ పిటిషన్ గానీ దర్యాప్తు అధికారులు వేయలేదు. తరువాత ఎస్ ఐ పిటిషన్ పై పాలిగ్రాఫ్ టెస్ట్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. అందులో తొమ్మిది నిందితులను ముగ్గురు ముగ్గురు చొప్పున మూడు రోజుల్లో పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. అందులో అధికారులు అడిగిన నాలుగు ప్రశ్నలకు నిందితులు ‘మాకేమీ తెలియదు’ అనే సమాధానం ఇచ్చినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
కనీసం బెంచీ మీదకు రానీ ‘రిట్’ పిటిషన్..
కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుకు ఆందోళన, అనుమానం వ్యక్తం చేసిన దశరథం జూలై 21, 2020 న తెలంగాణ హైకోర్టులో ‘ రిట్ పిటిషన్’ దాఖలు చేశాడు.(డబ్ల్యూపీ11320/2020,డబ్ల్యూపీఎస్ఆర్ 14680/2020). అయితే కేసు దాఖలు చేసి రెండు సంవత్సరాలైన కేసు బెంచ్ మీదకు రాలేదు.
‘‘ కేసు దాఖలు చేసిన మొదటి అడ్వకేట్ రూ. 20 వేలు తీసుకుని దాదాపుగా 20 నెలలు తన చుట్టు తిప్పించుకున్నాడు. చివరకు తన వల్ల కాదని, ఎన్ ఓ సీ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. తరువాత మరో లాయర్ ను సంప్రదించగా ఆయన కూడా ఆరు నెలలు కాలయాపన చేసి, చివరకు నాకు చాలా కేసులు ఉన్నాయి. నువ్వు వేరే లాయర్ ను చూసుకో అని ఎన్ ఓ సీ ఇచ్చి తిప్పి పంపారు’’ అని దశరథం ఆవేదన వ్యక్తం చేశాడు.
న్యాయం జరగకపోగా దాదాపుగా 50 వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. రెండు సంవత్సరాలు కాలయాపన జరిగింది. ఇదే సమయంలో ఆధారాలు లేవని పోలీసులు కేసును క్లోజ్ చేశారు. తరువాత హెచ్ ఆర్సీని సంప్రదించారు. అక్కడ కూడా న్యాయం జరగలేదు. కానీ పోలీసులు కొన్ని వివరాలను మాత్రం అందించారు.
ఎకరం భూమి అమ్మకం..
కొడుకు హత్యకు గురయ్యాడని బలంగా నమ్మిన దశరథం.. నాలుగు సంవత్సరాలుగా పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగడంతో ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఖర్చుల కోసం తనకున్న భూమిలో ఎకరం అమ్మేశాడు. పైగా తనకున్నది వర్షాధార పంటలు పండేది కావడంతో జీవనాధారం కోసం పూర్తిగా కూలీ పని మీదే ఆధారపడ్డాడు. సగం రోజులు పని చేసి వాటిలోనే కొంత దాచుకుని న్యాయం కోసం అందరి చుట్టూ తిరుగుతున్నాడు.
‘ మాదీ కుమ్మరి కులం, మాకు ధనబలం లేదు..కుల బలం లేదు. కనీసం నాతో ఆందోళన చేయడానికి పదిమంది కూడా లేని కులం మాదీ. అందరికి ఒకటే పరిస్థితి.. రెక్కాడితేనే.. నోట్లోకి ఓ ముద్ద పోతుంది. వాళ్లు ఏమని నాతో వస్తారు’’ అని దశరథం ఆవేదన వ్యక్తం చేశాడు.
సీఆర్పీపీసీ సెక్షన్ల బుక్ చదివేశాడు..
తనకు న్యాయం జరగకుండానే కేసు క్లోజ్ కావడంతో ఆందోళనకు గురైన దశరథం.. పోలీస్ అధికారుల చుట్టూ తిరగడం ప్రారంభించారు. తనకు చట్టంపై సరైన అవగాహన లేదన్న కారణంతోనే ఇలా జరుగుతుందని భావించిన ఆయన.. సీఆర్పీపీసీ సెక్షన్ల బుక్ ను ఔపోసన పట్టడం ప్రారంభించాడు. ప్రతి సెక్షన్ ను క్షణ్ణంగా చదివి వాటి ఆధారంగానే అధికారుల నుంచి సమాచారం రాబట్టుకునే ప్రయత్నం చేశారు.
ఆయన పరిజ్ఞానంపై ‘ఫెడరల్ తెలంగాణ’ కూడా ఆశ్చర్యపోయింది. ప్రస్తుత వంగర పీఎస్ ఎస్ ఐ దివ్య కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.‘‘ ఆయనకు( దశరథం) నాకంటే ఎక్కువ తెలుసు’’ అని వివరించారు. తన కొడుకు కేసును సీఆర్పీపీసీ సెక్షన్ 174 నుంచి సెక్షన్ 302, 304, 307 కింద మార్చాలని పోలీసులను వేడుకుంటున్నారు.
కేసు రీ ఓపెన్..
తనకు న్యాయం జరగలేదని భావించిన బాధితుడు.. తిరిగి పోలీసు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. చివరకు 2023 జనవరిలో వరంగల్ సీపీగా ఉన్న రంగనాథ్ ను కలిసి కేసు వివరాలను అందించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఆయన వెంటనే కేసు రీ ఓపెన చేయాలని అధికారులను ఆదేశించాడు. అలా అదే ఏడాది మే లో కేసు రీ ఓపెన్ చేశారు.
అయితే దాదాపు 17 నెలల గడచిన కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇందుకు నిరసనగానే దశరథం భార్య లక్ష్మీతో ప్రతిరోజు వంగర పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నాడు.
‘‘ మేము పీఎస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలోనే ఈ కేసులో ఏ1 గా ఉన్న అనుమానితుడు మమ్మల్ని చూస్తూ వెకిలీగా నవ్వుతూ, దమ్ముంటే నా పై చేయి వేసి చూడంటూ సవాల్ విసిరాడు. నేను ఈ విషయాన్ని పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ దంపతులు ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అలాగే స్టేషన్ ముందు కూర్చుంటున్నారు. మధ్యాహ్నం కొన్ని మంచినీళ్లు తాగి కడుపు నింపుకుంటున్నారు. న్యాయం కోసం ఎండకు ఎండి, వానకు తడిసిపోతున్నారు. ఇదే విషయంపై ‘ఫెడరల్ తెలంగాణ’, వంగర ఎస్ ఐ దివ్య ను సంప్రదించింది. ‘‘ కేసు పూర్తిగా కోర్టు పరిధిలో ఉంది. గౌరవ జడ్జి ట్రైనింగ్ కోసం వెళ్లారు. మరుసటి వాయిదాకు వారు ఎలాంటి ఆదేశాలు ఎలా ఇస్తే అలా పనిచేస్తాం’’ అని తెలిపారు.
ఇంత గొప్ప స్నేహితులా? ఛీ..
రాజేశ్ చనిపోయి, పెద్ద కర్మ పూర్తి కాకముందే కొంతమంది పెద్ద మనుషులు దశరథం ఇంటికి వచ్చారు. కేసు విత్ డ్రా చేసుకోవడానికి వాళ్లు ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా.. ‘‘ ఓ గొర్రె, 20 కిలోల బియ్యం’’ అది ఇస్తాం తీసుకోండి. కేసు విత్ డ్రా చేసుకోండని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. దీనికి దశరథం ఒప్పుకోకుండా ఎదురు తిరగడంతో వాళ్లంతా మరోసారి ఆయన ఇంటికి రాలేదు.
నా భర్తను కాపాడండి: ఆషాడపు లక్ష్మీ
కొడుకు చనిపోవడంతో మా ఆయన బాగా కుంగిపోయాడని దశరథం భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎండా, వాన లెక్క చేయకుండా అందరూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, కానీ ఇప్పటి వరకూ న్యాయం జరగలేదని వాపోయారు. ఈ ఆరు సంవత్సరాల్లో ఆరోగ్యం పాడైందని, తన గురించి పట్టించుకోకుండా న్యాయం కోసం పరితపిస్తున్నారని అన్నారు.
నేరస్థులకు శిక్ష పడే వరకూ ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడటం లేదని, చెట్టంతా కొడుకు పోవడంతో ఆయన రందీ ఎక్కువైందని, పోలీసులు తమకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. ఇది వరకూ అనేకమంది విలేకరులు వచ్చి కేసు సంబంధించి వివరాలు జిరాక్స్ తీసుకుని వెళ్లిపోయారని, తరువాత ఫోన్ చేస్తే కూడా స్పందించలేదని చెప్పారు. అందుకే విలేకరులు అంటే తమకు గౌరవం పోయిందని, మీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడలేదని వివరించారు.
అసలు ఏం జరిగింది.. కొంతమంది స్నేహితుల ప్రకారం..
ఈ విషయం పై ‘ఫెడరల్ తెలంగాణ’ కొంతమంది అభిప్రాయాలను సేకరించింది. కొందరూ దీనిపై స్పందించడానికి నిరాకరించిన.. చాలా మంది మాత్రం ఒకే విషయాన్ని చెప్పారు. వారి ప్రకారం .. రంగయ్య పల్లి గ్రామంలో ఆషాడపు రాజేశ్ కు చెందిన స్నేహితులు పదిమంది దాకా ఉన్నారు. ఇందులో ఓ నలుగురు స్నేహితులు కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు.
రాజేశ్ కాస్త అమాయకుడు. మాటకు ఎదురు చెప్పే రకం కాదు. ఇతని లాగే మరి కొంతమంది స్నేహితులు ఉన్నారు. దీనిని ఆసరాగా తీసుకుని జులాయిగా తిరిగే స్నేహితులు మాటలతో హింసించి శాడిజపు ఆనందం పొందేవారు. దారిలో వెళ్తుంటే రాజేశ్, ఇతర స్నేహితుల ప్యాంటు పట్టుకుని కిందకు లాగడం లాంటి వికృత చేష్టలను పాల్పడేవారు. ఇంట్లో అమ్మ లేనప్పుడు రాజేశ్ వంట వండితే నువ్వు ఆడపిల్లవని ఏడిపించేవారు. లంగా ఓణి వేసుకోమని మాటలతో హింసించేవారు. ఇలాంటి సమయంలో వారు ఎదురు తిరిగి టిట్ ఫర్ ట్యాట్ చేశారు.
వాళ్లకున్న బలహీనతలను ఆసరాగా చేసుకుని వేరే నంబర్ నుంచి ఆ గుంపులోని మెయిన్ వ్యక్తులకు అమ్మాయి వాయిస్ తో ఫోన్ చేశారు.( ప్రత్యేక యాప్ లేదా పాత చైనా మొబైల్ కావచ్చు) ఇది నిజమని వాళ్లు కూడా వీళ్లతో ఫోన్ లో మాట్లాడేవారు. అయితే రాజేశ్ తో ఉన్న స్నేహితుల్లోనే మరో వ్యక్తి ఈ విషయాన్ని అవతలి వర్గానికి తెలిపారు. దాంతో వీరి మధ్య గొడవ జరిగింది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు.
కొంతకాలం తరువాత అమ్మాయి అనుకుని ఫోన్ లో మాట్లాడిన స్నేహితులను, మిగిలిన స్నేహితులు వెక్కిరించడం ప్రారంభించారు. మీరు అబ్బాయిలతో ప్రేమలో పడ్డారు. మీరు ట్రాన్స్ జెండర్, గే వంటి పదాల అర్థం వచ్చే మాటలతో వీళ్లని టార్గెట్ చేశారు. ఇదే క్రమంగా రాజేశ్ పై కోపానికి కారణమై ఇలాంటి దారుణానికి కారణమై ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Next Story