‘అవును.. ఇస్మాయెల్ హనియే మేము చంపేశాం’
హౌతీ నాయకులకు అదే గతి పడుతుందని హెచ్చరించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
కొన్ని నెలల క్రితం ఇరాన్ లో హత్యకు గురైన ఉగ్రవాద సంస్థ హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా ను తామే హతమార్చినట్లు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్వయంగా అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
గత ఏడాది ఇజ్రాయెల్ పై హమాస్ అత్యంత పాశవికంగా దాడి చేసింది. తరువాత ఐడీఎఫ్ దాడులు ప్రారంభించడంతో లెబనాన్ లో దాక్కున్న మరో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా టెల్ అవీవ్ పై రాకెట్ దాడులకు పాల్పడటంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తలు తలెత్తాయి. ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఇరాన్ బహిరంగ మద్ధతుతో పాటు ఆయుధాలను అందించడంతో ఆ రెండు దేశాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.
‘‘ నేను హౌతీ ఉగ్రవాదులకు ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మేము హమాస్ ను నిర్మూలించాము, లెబనాన్ లో ఉన్న హెజ్ బుల్లా ను తుదముట్టించాము. అలాగే ఉగ్రవాద ఉత్పత్తి స్థానాలను ధ్వంసం చేశాం. సిరియాలో అసద్ పాలనను అంతం చేశాము. అలాగే హౌతీలకు ఇదే గతిపడుతుంది’’ అని కాట్జ్ అన్నారని రాయిటర్స్ పేర్కొంది.
ఇజ్రాయెల్ "వారి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తుంది. మేము వారి నాయకులను చంపివేస్తాం. మేము ఎలాగైతే టెహ్రాన్, గాజా, లెబనాన్‌లలో హనియే, సిన్వార్, నస్రల్లాలకు చంపి వేశామో. హౌతీ నాయకులను అలాగే ఏరివేస్తాం. అలాగే హోడెయిడా, సనాలో దాడులు చేస్తాము" అని కాట్జ్ వ్యాఖ్యానించినట్లు రక్షణ శాఖ సిబ్బంది మీడియాకు తెలిపారు.
యెమెన్‌లోని ఇరాన్-మద్దతుగల హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ను దెబ్బతీయడానికి ఒక సంవత్సరానికి పైగా ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తున్నారు. పాలస్తీనాకు సంఘీభావంగా దాడులు చేస్తున్నామని ప్రకటనలు ఇస్తుండటంపై ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారు.
అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో ప్రారంభమైన యుద్ధం గాజాలో నరమేధం జరిగింది. వేలాది ఉగ్రవాదులతో పాటు చాలామంది పాలస్తీయన్లు మరణించారు. సాధారణంగా ఖతార్‌లో ఉన్న హనీయే, హమాస్ అంతర్జాతీయ దౌత్యానికి ముఖంగా ఉన్నాడు. పాలస్తీనాలో కాల్పుల విరమణ జరగడానికి మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తుల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది జూలైలో హనియోనే ఇరాన్ లో ఇజ్రాయెల్ సీక్రెట్ మిషన్ ద్వారా హతమార్చింది.
నెలల తర్వాత, గాజాలోని ఇజ్రాయెల్ దళాలు హనియే వారసుడు, దశాబ్దాల నాటి ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో తాజా రక్తపాతానికి కారణమైన అక్టోబర్ 7 దాడికి సూత్రధారి అయిన యాహ్యా సిన్వార్‌ను హతమార్చాయి.
Next Story