వైఎస్ఆర్ ‘ఫీజురీఎంబర్స్‌మెంట్’ పథకానికి తెలంగాణలో మంగళం ?
x

వైఎస్ఆర్ ‘ఫీజురీఎంబర్స్‌మెంట్’ పథకానికి తెలంగాణలో మంగళం ?

ఒకపుడు లక్షలాది మంది పేద విద్యార్ధుల ఉన్నతవిద్య చదివేందుకు అండగా నిలిచిన ఈ పథకం ఇప్పుడు భారంగా మారుతుందా అన్న ప్రశ్న పెరిగిపోతోంది.


పేదరికం కారణంగా ఒక్కవిద్యార్థి కూడా చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం ఒకప్పుడు లక్షల కుటుంబాలకు అండగా నిలిచింది. కానీ ఇప్పుడు అదే పథకం భవిష్యత్తుపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరితో ఏర్పడిన పరిస్థితులు, హైకోర్టు తాజా తీర్పు ఈ చర్చను మరింత వేడెక్కించాయి.

గతనాలుగేళ్లుగా కాలేజీలకు సుమారు రు.10,000 కోట్ల ఫీజురీఎంబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు కీలకనిర్ణయం తీసుకుంది. కాలేజీలు విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అయితే ప్రభుత్వం తరువాత బకాయిలు చెల్లిస్తే, అప్పటికే వసూలు చేసిన మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని షరతు విధించింది. ఈ తీర్పు 2026–27 విద్యా సంవత్సరానికి వర్తిస్తుంది.

అయితే ఇక్కడే అసలు సమస్య కనిపిస్తోంది. ఇప్పటికే పంచాయితీలు, రిటైర్డ్ ఉద్యోగులు వంటి ఇతర విభాగాలకు కలిపి ప్రభుత్వం సుమారు రు. 30,000 కోట్ల బకాయిల భారం మోస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా రు. 10,000 కోట్ల ఫీజుబకాయిలను చెల్లించడం సాధ్యమా ? అన్నసందేహం పెరిగిపోతోంది. ప్రభుత్వం చెల్లింపులు ఆలస్యం చేస్తే, యాజమాన్యాలు కూడా విద్యార్థులకు ఫీజులు తిరిగి ఇవ్వడం అనిశ్చితిగా మారుతుంది.

దీనిప్రభావం నేరుగా విద్యార్థులపై పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఫీజులు ప్రభుత్వం చెల్లిస్తుందని నమ్మకంతో చదువుకుంటున్న పేదవిద్యార్థులు ఇకపై స్వయంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. ఫీజులు కట్టలేకపోతే అడ్మిషన్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సుమారు 1.5 లక్షలమంది విద్యార్థులు ఈపథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, వారి కుటుంబాలను కలుపుకుంటే లక్షలాది మంది దీనిపై ఆధారపడి ఉన్నారు.

మరోవైపు కాలేజీల యాజమాన్యాల వాదన కూడా ఉంది. ఫీజులు లేకుండా కాలేజీలను నడపడం కష్టమని, సిబ్బంది జీతాలు, మౌలిక వసతులన్నీ ఫీజులపైనే ఆధారపడుతున్నాయని వారు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కాలేజీలు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఎడ్యుకేషన్స్ ఇన్‌స్టిట్యూషన్స్(ఫాతీ)వెంటనే రు.10,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అర్హత ప్రమాణాల ప్రకారం తక్కువ ఆదాయం గల బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి ఉన్నారని పేర్కొంటోంది.

ఒకప్పుడు ఎన్నికల్లో కీలకపాత్ర పోషించిన ఈ పథకం, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు, పాలనా లోపాలు, కోర్టు తీర్పుల మధ్య నలిగిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసే పరిస్థితి వస్తే, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం అసలు ఉద్దేశ్యం కోల్పోతుందనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఒకపుడు లక్షలాది మంది పేద విద్యార్ధుల ఉన్నతవిద్య చదివేందుకు అండగా నిలిచిన ఈ పథకం ఇప్పుడు విద్యార్థులకు భారంగా మారే దిశగా వెళ్తుందా అన్న ప్రశ్న పెరిగిపోతోంది.

Read More
Next Story