తమిళ నటి అరెస్ట్ తప్పదా.. డీఎంకే కు, తెలుగువారికి సంబంధం ఏంటీ?
ఎప్పుడు వివాదాల్లో ఉంటూ నిత్యం వార్తల్లో ఉండే తమిళ నటి కస్తూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారంతా పనివారని, కానీ వాళ్లే ఇప్పుడు అధికారం..
ఎదగాలంటే కష్టపడి పనిచేయడం ఓ పద్ధతి లేదా పక్క వాళ్లని గిల్లీ వాళ్లే గిల్లారని గోల చేయడం ఓ పద్దతి. కోలీవుడ్ నటీ కస్తూరి కొన్ని సంవత్సరాల నుంచి సరిగ్గా ఇలాంటి పద్దతినే అవలంబిస్తోంది. అయితే పాత విషయాలు కాస్త పక్కన పెడితే.. కొన్ని రోజుల క్రితం కోలీవుడ్ నటీ అన్ని హద్దులు దాటి విమర్శలు చేసింది.
తెలుగువారిని పనివారిగా, అంత: పుర చెలికత్తెలుగా అభివర్ణించింది. ‘‘ రాజుల కాలంలో అంత: పుర మహిళలకు సేవ చేయడానికి వచ్చినవారే తెలుగువారని, ఇప్పుడు వాళ్లే తమది తమిళజాతి అంటూ ప్రకటించుకుంటున్నారని’’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మూడు వందల సంవత్సరాల క్రితం తెలుగువాళ్లంతా చెన్నై కి( తమిళనాడు) వచ్చారని వారంతా ఇప్పుడు తమిళ జాతి అంటూ అధికారం అనుభవిస్తున్నారని పరోక్షంగా దివంగత కరుణానిధి, వారి కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. కరుణానిధి వారి కుటుంబం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారని, తరువాత తమిళనాడు కు వలస వెళ్లారని మాజీ సీఎం ఎంజీఆర్ పార్టీ అప్పట్లో విమర్శలు గుప్పించేది. ఈ వ్యాఖ్యలను ఏనాడు కరుణానిధి ఖండించకపోవడం గమనార్హం. అందుకే తమిళ రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు కరుణానిధి కుటుంబాన్ని సెటిలర్లు అని అర్థం వచ్చే పదంలో విమర్శలు చేస్తుంటాయి.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలనే మరోసారి రిపీట్ చేయబోయి కస్తూరి తెలుగువారిని దారుణంగా కించపరిచింది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం తమిళనాడుకు వచ్చిన బ్రాహ్మణులను మాత్రం తమిళులు కాదని డీఎంకే నాయకులు, ద్రావిడవాదులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వారంతా( తెలుగువారు) అధికారం అనుభవిస్తూ తామే నిజమైన తమిళులమని అంటున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులో నివసిస్తున్న తెలుగువారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూరి పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజానికి తమిళనాడులో నివసిస్తున్న తెలుగువాళ్లంతా వలస వెళ్లిన వారు కాదు. సామాన్య శకం 600 లో తమిళనాడులోని చాలా ప్రాంతాలను పల్లవులు పాలించారు. ఈ రాజులు తెలుగువారు. వంద సంవత్సరాలు ప్రజారంజకంగా పాలించారు. వీరి పాలన అంతమైన తరువాత కూడా తెలుగు వారు అక్కడే స్థిరపడిపోయారు. వందల సంవత్సరాలుగా తమిళనాడులో ఉంటూ తమ సంస్కృతి కాపాడుకుంటున్నారు. కానీ కస్తూరి ఇప్పుడు మాట్లాడిన మాటలు వారిలో అభద్రతభావం నింపింది. పరోక్షంగా తమిళ వాళ్లని తెలుగువారి పైకి ఉసిగొల్పే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం కూడా కస్తూరి వ్యాఖ్యలను తీవ్రంగానే పరిగణించినట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తమిళనాట, తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఇప్పుడు కస్తూరి మరోసారి స్పందించింది. తన మాటలు వక్రీకరణకు గురయ్యాయని, తాను ఆ అర్థంలో మాటలు అనలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.
Next Story