మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు వరమా?
x

మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు వరమా?

రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు..


ఉత్తరాంధ్ర పారిశ్రామిక ఆకాశంలో మరో ధ్రువతార ఉదయించబోతోంది. దశాబ్దాల కాలంగా భారీ పరిశ్రమల కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాంతానికి ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఒక అద్భుతమైన వరంగా మారనుంది. దాదాపు రూ.1.36 లక్షల కోట్ల కళ్లు చెదిరే పెట్టుబడితో, నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఏర్పాటు కానున్న ఈ మెగా గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో కలిసి నేడు (సోమవారం) శంకుస్థాపన చేయనున్నారు. ఇది కేవలం ఒక ఉక్కు కర్మాగారం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తును మార్చే ఒక భారీ ఉపాధి గని అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

లక్ష మందికి ఉపాధి.. విశాఖ రీజియన్ ఇక గ్లోబల్ హబ్
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రెండు దశల్లో ఈ ప్లాంట్ సాకారం కానుంది. దీనికి అనుబంధంగా రూ.11,198 కోట్లతో నిర్మించనున్న క్యాప్టివ్ పోర్ట్ (సొంత రేవు) ద్వారా మరో 6 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ ఎకనమిక్ రీజియన్ అంతర్జాతీయ ఉక్కు మార్కెట్‌లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఈ ప్రాంతం మొత్తం ఒక భారీ పారిశ్రామిక హబ్‌గా అవతరించబోతోందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
మౌలిక సదుపాయాల జాతర..శరవేగంగా అభివృద్ధి
ఈ ప్లాంట్ రాకతో నక్కపల్లి , పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఊహించని రీతిలో మెరుగుపడనున్నాయి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌ను జాతీయ రహదారి (NH-16)తో అనుసంధానించేలా 4 లేన్ల రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్లు, రైల్వే లైన్లు, విద్యుత్ , నీటి సరఫరా మెరుగుపడటంతో స్థానిక భూముల విలువలు పెరగడమే కాకుండా, చిన్న తరహా పరిశ్రమలు (MSMEలు) , సేవా రంగం (హోటళ్లు, రవాణా, గృహ నిర్మాణం) భారీగా వృద్ధి చెందుతాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.
ముఖ్యమంత్రి పర్యటన - షెడ్యూల్ విశేషాలు
సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రాజయ్యపేటకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఎక్స్‌పీరియన్స్ జోన్ ను సందర్శించి, ప్లాంట్ నమూనాను (Model) పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఉక్కు సంస్థల ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది.
Read More
Next Story