అంకెల గారడీనా? అభ్యుదయ బాటనా?
x

అంకెల గారడీనా? అభ్యుదయ బాటనా?

అసెంబ్లీలో నేడు పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమర్పణ.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం శనివారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దాదాపు రూ. 3.46 లక్షల కోట్ల భారీ అంచనాతో రూపొందించిన ఈ పద్దును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉదయం 11:15 గంటలకు సభకు సమర్పించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై రాష్ట్ర రథాన్ని నడిపించేలా ఈ బడ్జెట్ ఉండబోతోందని సమాచారం.

రూ. 3.46 లక్షల కోట్ల భారీ పద్దు.. సూపర్ సిక్స్‌పైనే గురి

గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ పరిమాణాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీల అమలుకు ఈ బడ్జెట్‌లో సింహభాగం నిధులు కేటాయించనున్నారు. ’తల్లికి వందనం‘, ’దీపం 2.0', ’నిరుద్యోగ భృతి‘ వంటి పథకాలతో పాటు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం భారీగా నిధులు కేయించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, సంక్షేమానికి లోటు లేకుండా అంకెల క్రమబద్ధీకరణ చేసినట్లు తెలుస్తోంది.

వ్యవసాయ బడ్జెట్.. సాగుకు ఊపిరి

రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం, మధ్యాహ్నం 12:50 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పిస్తారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ఉద్యానవన రంగ అభివృద్ధికి ఈ పద్దులో పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించవచ్చని భావిస్తున్నారు.

అమరావతి, పోలవరానికి ప్రాధాన్యత

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చారు. కేంద్రం నుంచి అందుతున్న సహకారాన్ని సమన్వయం చేసుకుంటూ, పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు ఊపిరి పోయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కేంద్ర నిధుల కోతతో అప్రమత్తం

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధుల నిలిపివేతతో రాష్ట్ర ప్రభుత్వం కొంత అప్రమత్తమైంది. సుమారు రూ. 10,000 కోట్ల నిధుల లోటును భర్తీ చేసుకుంటూనే, రాష్ట్ర సొంత ఆదాయ వనరులను పెంచుకునేలా ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో దిశానిర్దేశం చేయనున్నారు. నేడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, 17, 18 తేదీల్లో దీనిపై సమగ్ర చర్చ జరగనుంది.

Read More
Next Story