
ఇరుసుమండ.. పూర్తిగా ఆరిన మంట
కోనసీమ జిల్లా, ఇరుసుమండలో ఆయిల్ బావి వద్ద చెలరేగిన బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి
కోనసీమ జిల్లా, ఇరుసుమండలో ఆయిల్ బావి వద్ద చెలరేగిన బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి. మంటల అనంతరం మిగిలిన శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని అధికారులు వెల్లడించారు.
మోరి–5 డ్రిల్లింగ్ సైట్‌లోని బావి వద్ద మంటలు ఆరిన అనంతరం, భద్రతా చర్యల్లో భాగంగా వాటర్ అంబ్రెల్లా పద్ధతిలో శీతలీకరణ పనులు చేపట్టారు. బావి చుట్టూ ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిన తర్వాతే తదుపరి సాంకేతిక చర్యలకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక బావిని శాశ్వతంగా సురక్షితం చేసేందుకు అవసరమైన వెల్ క్యాపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతోంది. ఈ మేరకు బావి వద్ద అమర్చేందుకు అవసరమైన బ్లోఅవుట్ ప్రివెంటర్‌ను ఓఎన్జీసీ సిద్ధం చేసింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించిన తర్వాతే ఈ పనులు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది.
ఇరుసుమండలోని మోరి–5 డ్రిల్లింగ్ సైట్‌లో ఇటీవల అకస్మాత్తుగా బావి నుంచి మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. అయితే సకాలంలో చేపట్టిన చర్యలతో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు.
మలికిపురం (Malikipuram) మండలం ఇరుసుమండలో జనవరి 5న ఓఎన్జీసీ పైపులైన్ (ONGC Pipeline) నుంచి గ్యాస్ లీకై భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ గాలిలోకి ఎగజిమ్మడంతో ఒక్కసారిగా మంటలు (Fire) చెలరేగాయి. అది చూసి గ్రామస్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో మండల తహశీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పని మొదలు పెట్టారు.
గత ఏడాది ఆగస్టులోనూ ఇదే గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ అయ్యింది. ఇక్కడ తరుచూ గ్యాస్ లీక్ అవుతున్న సంఘటనలు జరుగుతుండడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా దీని వల్ల తీవ్ర ప్రమాదం జరగొచ్చని, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాలని.. లేదంటే గ్రామ ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
5 రోజుల నిర్విరామ కృషి తర్వాత జనవరి 10న మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో జనం ఊపిరిపీల్చారు.
Next Story

