రాహూల్ తిట్టడంపై అభిమానుల ఆగ్రహం..
x

రాహూల్ తిట్టడంపై అభిమానుల ఆగ్రహం..

ఉప్పల్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్, లక్నోను చిత్తుచేసింది. అయితే తమ జట్టు దారుణ పరాజయం తరువాత ఆ జట్టు ఓనర్ కెప్టెన్ కేఎల్ రాహూల్ ను అవమానించడంపై..


ఐపీఎల్ లో నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే తమ జట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా ఓడిపోవడంతో లక్నో జట్టు యజమాని గోయోంకా కెప్టెన్ కేఎల్ రాహూల్ ను కోపంగా మందలించినట్లు ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అయ్యాయి.

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో రాహుల్ మాట్లాడుతూ.. మాటల కోసం ఓడిపోయానని చెప్పాడు. అలాంటి బ్యాటింగ్ ను మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తాం. వాళ్ల నైపుణ్యానికి వందనాలు.. రెండో ఇన్నింగ్స్ లో పిచ్ ఎలా స్పందిస్తుందో మనకు తెలిసే అవకాశం కూడా లేదు. బంతికి వారికి దొరకకుండా ఎలా వేయాలో తెలియలేదని రాహూల్ వ్యాఖ్యానించాడు.
వైరల్ అయిన వీడియో..
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 166 పరుగుల లక్ష్యాన్ని SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్), అభిషేక్ శర్మ (28 బంతుల్లో 75) కేవలం 9.4 ఓవర్లలో 167/0 స్కోరు చేసి రికార్డులను సృష్టించారు. దీనిపై LSG యజమాని సంజీవ్ గోయెంకా రాహుల్‌ను మందలించిన వీడియో వైరల్‌గా మారింది.
దీనిపై భారత క్రికెట్ అభిమానులు గోయెంకాపై మండిపడుతున్నారు. పబ్లిక్ లో భారత బ్యాట్స్ మెన్ ను తిట్టడంపై సోషల్ మీడియాలో గోయెంకా పై తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనిని నలుగురి మధ్య చేయడం ఏంటనీ చాలామంది నెటిజన్లు ప్రశ్నించారు.
IPL 2024 హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ , గోయెంకా-రాహుల్ సంభాషణ వీడియోను "LSG క్యాంప్ నుంచి యానిమేటెడ్ ప్రతిచర్యలు" అని క్యాప్షన్ జత చేసి పోస్టు చేసింది. ఈ వీడియోలో రాహూల్ ప్రశాంతంగా తల ఊపుతూ కొన్ని మాటలు మాట్లాడుతూ కనిపించగా, గోయోంకా దురుసు ప్రవర్తన స్పష్టంగా కనిపించింది. తరువాత కోచ్ లాంగర్ తో కూడా మాట్లాడినట్లు వీడియోలో కనిపించింది.
ఈ చర్యపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమీస్మిత్ స్పందించాడు. యజమానికి మానసిక పరిపక్వత లేదని, నాలుగు గోడల మధ్య జరిగే ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఎల్‌ఎస్‌జీ ఆడిన తీరుపై గోయెంకా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. ఇదే విధమైన అభిప్రాయాన్ని కివీస్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ వ్యక్తం చేశాడు.
ఈ సంఘటనపై ఓ ప్రముఖ యూట్యూబర్ తన విశ్లేషణ వినిపించాడు. ఇదే గోయెంకా ఇంతకుముందు ధోనిని అవమానించిన సంగతిని గుర్తుచేశారు. ఐపీఎల్ లో ఓనర్ల ప్రవర్తనపై బీసీసీఐ కూడా కఠిన ఆంక్షలు విధించాలని కోరాడు. తనకు గోయోంకా చేసిన తీరుపై బీపీ పెరిగిందని, ఆటగాళ్లు ఏం బానిసలు కాదని వ్యాఖ్యానించారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వార్నర్ ను, ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను ఇలాగే అవమానించాయని కచ్చితంగా బీసీసీఐ ఈ ఓనర్ల విషయంలో కఠినంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇలాగే జరిగితే అభిమానులు చూస్తూ ఊరుకోవద్దని అన్నారు. ఈ వ్యాఖ్యాలకు తగ్గట్టే సోషల్ మీడియా గోయెంకా పైకి దుమ్మెత్తి పోసింది. ఆయన మరోసారి ఇలాగే ప్రదర్శిస్తే..ఆయన చేస్తున్న బిజినెస్ బాయ్ కాట్ ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే భారత్ లో క్రికెట్ ఓ మతం అయితే.. అందులో దేవుళ్లు క్రికెటర్లు.

Read More
Next Story